TG | ఫోర్త్‌ సిటీయే తెలంగాణాకు ఫ్యూచర్‌ సిటీ

  • ‘బిల్డర్స్‌ గ్రీన్‌ సమ్మిట్‌’లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్న ఫోర్త్‌ సిటీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం నోవాటేలో జరిగిన ‘తెలంగాణ బిల్డర్స్‌ గ్రీన్‌ సమ్మిట్‌’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఫోర్త్‌ సిటీ హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీ అని, ప్రపంచ కేంద్రంగా ఫోర్త్‌ సిటీని తీర్చి దిద్దుతామన్నారు. నెట్‌ జీరో సిటీ నిర్మాణంలో భాగంగా ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుందని వివరించారు.

భావితరాలకు ఎంతో మేలు జరిగేలా.. రానున్న యాభై ఏళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాస్తామని వెల్లడించారు. ఆధునిక దేశాల బాటలో తెలంగాణను ముందుకు నడిపిస్తామంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం హైదరాబాద్‌ అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించి అభివృద్ధికి పునాదులు వేస్తున్నామని తెలిపారు.

బిల్డర్స్‌, డెవలపర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తోందని, వారు సంపద సృష్టికర్తలు.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు వారికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.

గ్రీన్‌ సిటీ ఆవిష్కరణకు ప్రోత్సాహకాలు

హైదరాబాదును గ్రీన్‌ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలు స్థానికంగా ఉండడం కష్టంగా ఉంది, ఒక సీజన్‌లో పౌరులు అక్కడి నుండి వలస వెళ్ళవలసి వస్తుంది. ఆ పరిస్థితి హైదరాబాద్ కు రాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

హైదరాబాద్‌ నగరంలోని డీజిల్‌ వాహనాలను దశలవారీ ఎలక్ట్రిక్రల్‌ వాహనాలుగా మారుస్తున్నట్టు తెలిపారు. ఎలక్ట్రికల్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని కోల్పోయి రిజిస్ట్రేషన్‌ చార్జీలు తగ్గించేందుకు కూడా వెనుకాడ లేదని తెలిపారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

పెట్టుబడులు రాబట్టేందుకు కొన్ని కోణాల్లో చర్యలు

హైదరాబాద్‌ చుట్టు పక్కల పెట్టుబడులకు సీఎం రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబులు దావోస్లో పర్యటించి 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించారని వివరించారు. 2029-30 కి 20,000 మెగావాట్ల గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తి లక్ష్యంగా కొత్త విద్యుత్‌ పాలసీలో స్పష్టం చేశామని, 35 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు పోతున్నట్టు తెలిపారు.

ఆధునిక దేశాల బాటలో తెలంగాణను నడిపించేందుకు కేవలం అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాదు నగరానికి ఒక ఏడాదిలో పదివేల కోట్లు- కేటాయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం హైదరాబాదును ఉన్నత స్థానానికి తీసుకువెళ్లిందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *