రూ.353 కోట్లు గుటుక్.. వెలుగులోకి యుపిక్స్ మాయజాలం
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు… పెట్టిన పెట్టుబడికి అత్యధిక వడ్డీలు… పెట్టుబడి పెట్టించిన వారికి అత్యధిక కమిషన్లు.. ఇలా మాయమాటలతో అమాయకులను తమ ఉచ్చులోకి లాగుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన యుపిక్స్ క్రియేషన్ (Yupix Creation) సమస్త బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ వర్క్ చేస్తున్నామంటూ ఇంటర్నేషనల్ గా పేరు ఉన్న కంపెనీగా తమ దంటూ విస్తృత ప్రచారం చేసుకునే కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు (Highest profits) వస్తాయంటూ ఆశ చూపి మోసం చేసిన యుపిక్స్ సంస్థ లో అతి ముఖ్యమైన ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి కీలక సమాచారం రాబట్టడంతో పాటు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రూ 23 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ మెంట్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో ఎంతోమంది బాధితులను నిండా ముంచిన యుపిక్స్ సంస్థ చేసిన మోసాలను నిందితుల వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ (Police Commissioner) ఎస్వీ రాజశేఖర్ బాబు శనివారం నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో వివరించారు.
సంస్థ ప్రారంభం ఇలా…
2014 వ సంవత్సరంలో నిడుమోలు వెంకట సత్య లక్ష్మి కిరణ్ (Venkata Satya Lakshmi Kiran) అనే వ్యక్తి విజయవాడ సత్యనారాయణపురం అది శేషయ్య వీధిలో యుపిక్స్ అనే యానిమేషన్ కంపెనీ (Animation company) ని ఏర్పాటు చేసారు.. దీనిలో సుమారు 70మంది స్టాఫ్ పని చేసేవాళ్ళు. ఈ క్రమంలో కిరణ్ కి పేరం మాల్యాద్రి, అతని కొడుకు పేరం మహేశ్వర రెడ్డి, కోత్తురి వేణుగోపాల్ రావు, మిట్టపల్లి రాజేంద్ర బాబు ఇతని కొడుకు మిట్టపల్లి రాజీవ్ కృష్ణ వారు పరిచయమై అంధరూ ఏ విధంగానైనా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో 2018 సంవత్సరంలో వీరందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి పన్నెండు నెలలకు పదికి పది లక్షలు, పన్నెండు నెలలకు కోటికి కోటి రూపాయలు డిపాజిట్ చేసేవారికి ఆధిక డబ్బులు ఇచ్చే విధంగా ఈ కంపెనీలో పెట్టుబడులు (company Investments) పెడితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని మాయ మాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో వీరు ముందుగా పెట్టుబడి పెట్టి లాభాలు సంపాధించినట్లు చూపిస్తూ వారికి మాయమాటల ద్వారా ఆకర్షించారు. ఈ క్రమంలో వీరు పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు తీసుకున్నారు అదేవిధంగా వీళ్ళ బంధువులు స్నేహితులతో డిపాజిట్ లు (Deposit s) చేయించి డిపాజిట్ లను చేయించినదుకు కమీషన్ లను పెట్టుబడుల నుండి వచ్చిన డబ్బులను వారి సొంత ఖాతాలలో మళ్ళించుకున్నారు. ఇందులో మోసపోయిన వాళ్ళలో వీరి సమీప ప్రాంతాలైన నర్సారావు పేట, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన భాధితులు ఎక్కువగా ఉన్నారు.

వందల సంఖ్యలో బాధితులు…
భాధితులు సుమారు 183 మంది సుమారు రూ.353 కోట్ల రూపాయల (Rs.353 crore) ను నగదును యుపిక్స్ గ్రూపు కంపెనీలో పెట్టుబడి పెట్టి నష్టపోయారు. 2024 సంవత్సరం చివరకు సుమారుగా 194 కోట్ల రూపాయలు వరకు డిపాజిట్ లను వారి సొంత ఖాతాలలోకి మళ్లించుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తు (Police investigation) లో వెల్లడయ్యింది.
బాధితుల ఫిర్యాదుతో…
ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన నరసరావుపేట (Narasaraopet) కు చెందిన త్రిపురమల్లు శ్రీనివాసరావు, కలవకొల్లు దిలీప్ కుమార్ లు పోలీస్ స్టేషన్ కు వచ్చి సత్యనారాయణపురం ఆధిశేషయ్య వీధిలో యుపిక్స్ క్రియేషన్ కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోయినట్లుగా ఫిర్యాదు (Complaint) చేశారు. దీనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాబాలు ఇస్తామని చెప్పి సుమారు రూ.20 కోట్ల వరకు పెట్టుబడి పెట్టించి మోసం (fraud) చేశారని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన సత్యనారాయణపురం పోలీసులు పలు సెక్షన్ల కింద విచారణ ప్రారంభించారు. ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఆదేశాలతో డి.సి.పి. కె.తిరుమలేశ్వర రెడ్డి ఆద్వర్యంలో విచారణ అధికారి నార్త్ ఏ.సి.పి. డా.స్రవంతి రాయ్, నలుగురు ఇన్ స్పెక్టర్లు, సిబ్బందితో ప్రత్యేకమైన సీట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక సీట్ బృందం వారు ఆధునిక సాంకేతికతను ఆధారంగా చేసుకుని ధర్యాప్తును ప్రారంభించి క్షుణ్ణంగా తనిఖీ చేసింది.
నిందితులు వీరే…
యుపిక్స్ భారీ మోసంపై కేసు ధర్యాప్తులో బాగంగా శనివారం ప్రత్యేక బృందాలకు వచ్చిన సమాచారంతో ఈ కేసులలో నర్సారావు పేట ఏరియాలో నిందితులైన ఇద్దరు వ్యక్తులను, విజయవాడ (Vijayawada) లో ప్రధాన నింధితుడిని అదుపులోనికి తీసుకుని విచారించి వీరి వద్ద నుండి సుమారు 90లక్షల రూపాయల విలువైన 354 గ్రాముల బంగారు ఆభరణాలు, 21 కె.జి.ల వెండిని ఆభరణాలు, ఒక కారుని, ఒక బి.ఎం.డబ్ల్వూ బైకును, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంక్ అక్కౌంట్ లను ఫ్రీజ్ ఫ్రీజ్ చేసి అరెస్టు చేశారు. ఇవి కాకుండా నింధితులకు సంబంధించిన సుమారు 23కోట్ల రూపాయల విలువైన ఆస్తుల అటాచ్ మెంట్ (Assets Attachment) కు పెట్టడం జరుగుతుందని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. పోలీసుల అరెస్టు చేసిన వారిలో విజయవాడ, సత్యనారాయణ పురం కు చెందిన నిడుమోలు వెంకట సత్య లక్ష్మి కిరణ్,గుంటూరు జిల్లా, కృష్ణా నగర్ కు చెందిన మిట్టపల్లి రాజేంద్ర బాబు, గుంటూరు జిల్లా, కృష్ణా నగర్ కు చెందిన మిట్టపల్లి రాజీవ్ కృష్ణ లు ఉన్నారు.
సీపీ ప్రత్యేక అభినందనలు…
యుపిక్స్ సంస్థ పలువురు బాధితులను మోసం చేసి కోట్ల రూపాయల కొల్లగొట్టిన కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సిట్ అధికారులను (SIT officers), సిబ్బందిని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే వారికి నగదు రివార్డులతో సత్కరించి అభినంధించారు.