తిరుమల : హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలోని వసంతపురి కాలనీకి చెందిన టి. సునీతా దేవి, టి. కనక దుర్గా ప్రసాద్ దంపతులు మంగళవారం శ్రీవారికి రూ.18.75 లక్షల విలువైన 250 చదరపు గజాల ఇంటిని విరాళంగా ఇచ్చారు.
హైదరాబాద్‌కు చెందిన మాజీ ఐఆర్‌ఎస్ అధికారి స్వర్గీయ భాస్కర్ రావు ఇటీవల తన మరణానంతర వీలునామా ద్వారా టిటిడికి రూ.3 కోట్ల విలువైన ఇంటిని, రూ.66 లక్షల విలువైన బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
భాస్కర్ రావును స్ఫూర్తిగా తీసుకున్న టి. సునీతా దేవి, టి. కనక దుర్గా ప్రసాద్ దంపతులు, తమకు సంతానం లేకపోవడంతో తమ తదనంతరం తమ ఆస్తి శ్రీవారికి చెందేలా వీలునామా రాసి స్వామివారిపై అపారమైన భక్తిని చాటుకున్నారు.
మంగళవారం తిరుమలలోని అదనపు ఈఓ కార్యాలయంలో అదనపు ఈఓ సి.హెచ్. వెంకయ్య చౌదరికి ఆస్తికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ దాతలను అభినందించారు. స్వామి పట్ల అపారమైన భక్తితో తమ ఇంటిని దానం చేయడం ఇతర భక్తులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు.