సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి..

- బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
పరకాల, ఆంధ్రప్రభ : హిందూ దేవతలను అవమానించే రీతిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతున్న వేళ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పరకాల పట్టణంలో బీజేపీ నిరసన చేపట్టింది. పట్టణ బీజేపీ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా గుమికూడి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
నిరసనలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ… సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల భక్తి భావాలను, హిందూ దేవతల గౌరవాన్ని దెబ్బతీయడం అత్యంత దురదృష్టకరమని, ఇది సీఎం బాధ్యతా రాహిత్యమైన ప్రవర్తన అని తీవ్రంగా మండిపడ్డారు.
హిందూ మతాన్ని అవమానించే వ్యాఖ్యలు చేయడం ఒకవైపు ప్రభుత్వ విధానాలకు, మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. “హిందువుల సెంటిమెంట్‌ను కించపరిచే ఏ ప్రయత్నాన్నైనా బీజేపీ అసలు సహించదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ భావాలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తాకట్టు పెట్టుబోతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి నాయకత్వం వహించే వ్యక్తి ఇలాంటి వ్యవహారం చేస్తే రాష్ట్రంలో మతసహనం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీ మరింత ఉగ్రరూపంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శులు సంఘ పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి జిల్లా నాయకులు బెజ్జంకి పూర్ణ చారి, మారేడుగొండ భాస్కరాచారి, దంచనాల సత్యనారాయణ, నాయకులు పావుశెట్టి శ్రీనివాస్, పైండ్ల రంజిత్, కానుగుల గోపీనాథ్, కోడల లింగమూర్తి ఆకుల రాజేందర్, సోమరాజ్, బూత్ అధ్యక్షులు సారంగ నరేష్, ముత్యాల దేవేందర్, సంఘ నరేష్, పెండెల రామకృష్ణ, బీజేపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
