ఫిబ్రవరి 13, ఖమ్మం : అంగన్వాడీ కేంద్రానికి చదువు కోసం ఇరుగు కుషి అనే పాపను పంపితే చదువు చెప్పడం మాని పచ్చిబరెకతో వీపుపై వాతలు పడేవిదంగా కొట్టే హక్కు ఎవరిచ్చారు అంటూ బాధితురాలి తాత బండ్ల వెంకటనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. తన మనవరాలు స్థానిక గోపాలపురం సెంటర్ 1 నందు చదువుకునేందుకు పంపించగా, ఆ సెంటర్ ఆయా ఖాసింబీ విచక్షణ రహితంగా పసి పాప అని కూడా చూడకుండా పచ్చిబరెకతో కొట్టడంతో ఒల్లంతా వాతలు పడి జర్వం తగిలందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన మనవరాలిని కొట్టిన ఆయా సెంటర్ టీచర్లను తక్షణమే తొలగించాలని, లేదంటే సెంటర్ లో చదువుకోవడానికి పిల్లలు రావడానికి భయపడతారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసలు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను దండించి బెత్తంతో కొట్టే హక్కు ఎవరిచ్చారని, ఇటువంటి వారు పిల్లలకు చదువు చెప్పేందుకు పనికి రారని, సంబంధిత శాఖ అధికారులు వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే అంగన్వాడీ సెంటర్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లోనే పరిస్థితి ఇలా ఉంటే జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుందని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి సారించాలని కోరారు.