Jubilee Hills Bypoll | జూబ్లీహిల్స్ లో ముగిసిన ప్రచారం..

- పారామిలిటరీ బలగాలతో భారీ బందోబస్త్…
- ఎల్లుండి పోలింగ్, 14న లెక్కింపు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు ప్రధాన పార్టీలు…. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు గత రెండు వారాలుగా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ఈ రోజు సాయంత్రం ప్రచారం ముగిసింది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు.
ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత కఠినతరం చేశారు. పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపగా, మొత్తం 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. అదనంగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
పోలింగ్ ముగిసే వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
