గోదావరిఖనిలో బుల్లితెర తారల సందడి

గోదావరిఖనిలో బుల్లితెర తారల సందడి

  • పాల్గొన్న రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో దీపావళి సందర్భంగా రామగుండం ఏరియా సింగరేణి బొగ్గు పరిశ్రమ యాజమాన్యం పెద్ద ఎత్తున సంబరాలను నిర్వహించింది. ఆదివారం రాత్రి స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఈ వేడుకలకు వేదికైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బుల్లితెర అగ్రతారాలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రామగుండం శాసన సభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బుల్లితెర తారలు పెద్ద ఎత్తున సందడి చేశారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… దీపావళి సందర్భంగా వేలాది కార్మిక కుటుంబాలను ఉత్తేజపరిచేందుకు సింగరేణి యాజమాన్యం సంబరాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్, ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, మినిమం వేజ్ చైర్మన్ జన ప్రసాద్, రామగుండం జీఎం డి లలిత్ కుమార్ తో పాటు సినీ నటుడు, హాస్య హీరో అలీ, నటులు శివారెడ్డి, సాగర్, గీతా మాధురి, జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్, రచ్చ రవి వంటి ప్రముఖ బుల్లితెర తారలు హాస్యాన్ని, సందడిని పండించారు. రాత్రి 9 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులలో జోష్ నింపాయి.

పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వేలాది కార్మిక కుటుంబాలు, ప్రజలు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడంతో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కిక్కిరిసిపోయింది. సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply