దళిత ఎమ్మెల్యే కొలికపూడి పై దాడి దారుణం..

దళిత ఎమ్మెల్యే కొలికపూడి పై దాడి దారుణం..
తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు పట్టణంలోని ఎంఎస్ఆర్ లాడ్జి మినీ కార్యక్రమ మందిరంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరిగిన అవమానకర ఘటన పై పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) సమాధానం చెప్పాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు దళిత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అని, ఆయన పై జరిగిన అవమానకర ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కొందరు వర్గ విభేదాలను రెచ్చగొట్టి దళిత నాయకత్వాన్ని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితులకు ప్రాధాన్యం లేని పదవులు ఇచ్చి వారినే ముందుకు తెచ్చి ఎమ్మెల్యే పై విమర్శలు చేయించడం సిగ్గుచేటు విషయమని నాయకులు పేర్కొన్నారు. మన జాతికి చెందిన నాయకుడిని మనమే విమర్శిస్తే.. ఇతరులు ఆనందపడతారని, అలాంటి వారికి మద్దతు ఇవ్వడం మాదిగ సమాజానికి అవమానకరమని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ అధ్యక్షుడు మందా వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎలీషా మాదిగ మాట్లాడుతూ.. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధితులు స్పష్టత ఇవ్వాలని కోరారు. దళిత నాయకుల పై అనవసర విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. ఇటీవల కొందరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు కొలికపూడి శ్రీనివాసరావు పై మీడియా ముందు విమర్శలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ చర్యలు మాదిగ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపై మాదిగ నాయకుల జోలికి వస్తే.. సహించబోమని తీవ్ర హెచ్చరిక చేశారు. మానికొండ రామకృష్ణ పై స్పందిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నియోజకవర్గ స్థాయిలో మాదిగల బలం ఏమిటో చూపిస్తామని పేర్కొన్నారు. చెరుకూరి రాజేశ్వరరావు వయసుకు తగిన విధంగా మాట్లాడాలని, దళితులు ఎవరికి ఊడిగం చేయడానికి లేరని అన్నారు. కొలికపూడి శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఎస్పీ జాతీయ అధ్యక్షుడు మందా వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎలీషా మాదిగ, కోట దానియేలు మాదిగ, పరసా కృష్ణ మాదిగ, తిరువూరు మండల అధ్యక్షుడు గొలమందల శ్రీను మాదిగతో పాటు నియోజకవర్గంలోని ఎ.కొండూరు, గంపలగూడెం, విసన్నపేట మండలాలకు చెందిన ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
