VILLAGE| మేడిపల్లి, ఆంధ్రప్రభ : జాతీయ గీతం ఆలపించడం ద్వారా దేశభక్తి, క్రమశిక్షణ, సమైక్యత కోసం గ్రామ యువకులు మొదలుపెడితే.. దానికి గ్రామ ప్రజలు సహాయ సహకారాలు అందించారు. జగిత్యాల జిల్లాలోనే మొట్టమొదటిగా నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఆ గ్రామం. మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో నిత్య జాతీయ గీతాలపన కార్యక్రమం ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ ఉదయం గ్రామస్తులు కలిసి జాతీయ గీతం ఆలపించడం ఇప్పుడు మొత్తం రాష్ట్రానికి స్ఫూర్తిగా మారుతోంది. అప్పటి జమ్మికుంట సిఐ ప్రశాంత్ రెడ్డి స్ఫూర్తితో మొదలైన జాతీయ గీతాలాపన కార్యక్రమం మొక్కవోని దీక్షతో ఎనిమిదేళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. జాతీయ గీతాలాపనతో పిల్లల్లో దేశభక్తి, గ్రామస్తుల్లో ఐక్యత బలపడుతుంది.
ఎనిమిది వసంతాల జాతీయ గీతాల కార్యక్రమానికి మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి పాల్గొని జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న యువతను వారికి అండగా నిలుస్తున్న గ్రామస్తులను అభినందించారు. కట్లకుంట గ్రామం ప్రతి రోజూ జాతీయ గీతాన్ని ఆలపించడం దేశానికి ఆదర్శంగా ఉందనీ.. ఇలాంటి కార్యక్రమం దేశ వ్యాప్తంగా విస్తరించాలన్నారు. ప్రశాంత్ రెడ్డి ప్రారంభించిన ఈ ఉద్యమం ఎంతో గొప్పది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం కట్లకుంటకే కాదు, తెలంగాణ గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నల్ల ఆదిరెడ్డి, యువకులు, గ్రామస్తులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

