Nara Bhuvaneswari | అదే.. రాష్ట్రాన్ని నిలబెట్టింది..

Nara Bhuvaneswari | అదే.. రాష్ట్రాన్ని నిలబెట్టింది..
Nara Bhuvaneswari, కుప్పం,ఆంధ్రప్రభ: యువత దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దే శక్తి అని ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్శిటీ విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియాను మంచి పనులకు వినియోగించి సమాజహితం కోసం ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ రక్షణ, సమాజ అభివృద్ధి ప్రతి పౌరుడి బాధ్యత అని, ఇది పోలీసులు చూసుకుంటారనే నిర్లక్ష్య భావన వద్దని విద్యార్థులకు సూచించారు. కళాశాల రోజులను గుర్తు చేసుకుంటూ, ఆ అనుభవాలు జీవితంలో ఎంత ముఖ్యమో వివరించారు.
ద్రావిడ భాషలు, సంస్కృతుల ఐక్యతకు ప్రతీకగా ఉన్న ద్రావిడ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ (NTR) గారి దూరదృష్టితో ఏర్పడిందని ఆమె గుర్తు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల మధ్య అనుబంధాన్ని బలపరచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆశలు, అభివృద్ధి కోసం నాలుగు దశాబ్దాలకు పైగా కష్టపడ్డారని తెలిపారు.
రాష్ట్రంలో కఠిన పరిస్థితులు ఉన్నా చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) చూపిన ధైర్యం, కష్టకాలంలో ఆయన ప్రదర్శించిన సహనం రాష్ట్రాన్ని నిలబెట్టిందని భువనేశ్వరి అన్నారు. రాజమండ్రి జైలు ఘటన సమయంలో దేశ వ్యాప్తంగా వచ్చిన మద్దతు తమ కుటుంబానికి అపార ధైర్యం ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. నాయకుడిని విజయాలు కాక, కష్టాల్లో చూపిన విలువలు, వ్యక్తిత్వమే నిర్వచిస్తాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పెట్టుబడుల వర్షం కురుస్తోందని చెప్పారు. సీఐఐ సదస్సు విజయవంతంగా జరిగి మూడు రోజుల్లోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటితో లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు. విశాఖలో (Vizag) గూగుల్ భారీ ఏఐ సిటీ, మిట్టల్ గ్రూప్ స్టీల్ ప్లాంట్, బీపీసీఎల్ రిఫైనరీ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. కుప్పంలో ఏడు పరిశ్రమలకు రూ.2,203 కోట్ల పెట్టుబడులు రావడంతో 22,330 ఉద్యోగావకాశాలు కలుగుతున్నాయని తెలిపారు.
టెక్నాలజీ మనుషుల్ని దగ్గర చేసేందుకు వచ్చిందని అనుకున్నా, అది వారిని నిశ్శబ్దంగా దూరం చేస్తోందని ఆమె అన్నారు. ఒకే ఇంట్లో ఉన్నవారు ముఖాముఖి మాట్లాడకుండా మొబైల్ మెసేజ్‌ల్లోనే మునిగిపోతున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను చెడు కోసం కాకుండా మంచి పనులకు వినియోగించాలని సూచించారు.
మనసులో సేవాభావం, మానవత్వం, గౌరవం ఉండాలి అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మనసుతో చేసిన మంచి పని ఎప్పటికైనా తిరిగి వస్తుందని చెప్పారు. విభజన పెరుగుతున్న ఈ సమయంలో సమాజాన్ని మళ్లీ ఐక్యంగా నిలబెట్టే బాధ్యత యువతదేనని సూచించారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు మనల్ని మరింత బలంగా మారుస్తాయని, పట్టుదల, నమ్మకం ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు ప్రజల కోసం అలుపెరగకుండా పని చేస్తారని, పదవులు వచ్చినా.. పోయినా.. ఆయన విలువలు, పని తీరు మాత్రమే ప్రజల మనసుల్లో నిలిచిపోతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే.. ఆయన ధ్యేయమని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో రాష్ట్రం తిరిగి పురోగతిపథంలో నడుస్తోందని భువనేశ్వరి పేర్కొన్నారు. సమాజ సేవ, శ్రమ, నిజాయితీ, ఐక్యత.. ఇవే యువత ముందుకు నడవాల్సిన దిశ అని ఆమె సందేశమిచ్చారు.



