TG | “రోహిత్ వేముల చట్టం” పై రాహుల్ గాంధీ లేఖ‌ .. స్పందించిన రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు, విద్యాసంస్థల్లో వివక్షను రూపుమాపేందుకు ప్రత్యేకంగా ‘రోహిత్ వేముల చట్టం’ తీసుకురావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాసిన లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు పార్టీ అగ్రనేత రాసిన లేఖను ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా పంచుకున్నారు.

రాష్ట్రంలో యువతకు భద్రత కల్పించే దిశగా చట్టం అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ, దర్శన్ సోలంకి వంటి ఎందరో ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువకులు అర్ధాంతరంగా తనువు చాలించడం దురదృష్టకరమని రాహుల్ గాంధీ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మొదలు రోహిత్ వేముల వరకు ఎంతో మంది ఎదుర్కొంటున్న వివక్షకు చరమగీతం పాడేలా, భవిష్యత్తులో మరెవరికీ ఇలాంటి అన్యాయం జరగకుండా ఈ కొత్త చట్టం దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లేఖను ఎక్స్ వేదికగా పంచుకుని, తాను చారిత్రక హిరోషిమా నగరంలో ఉన్నానని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించే సమయంలో రాహుల్ గాంధీ లేఖను చదివానని తెలిపారు. రాహుల్ గాంధీ స్ఫూర్తిదాయకమైన పిలుపు తనను బలంగా తాకిందని, గర్వించదగిన భవిష్యత్తును రూపొందించడంలో ఆయన ఆలోచనలు, భావాల స్ఫూర్తితో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

దళిత విద్యార్థులకు విద్యాసంస్థల్లో వివక్ష ఎదురవకుండా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *