TG | మ‌హిళ‌ల చేతికే గురుకులాలు – సీఎం రేవంత్ కీలక నిర్ణయం

మహిళా సంఘాలకు నిర్వ‌హ‌ణ బాధ్యతలు
విద్యా సంస్థ‌ల్లో కాంట్రాక్ట‌ర్ల వ్యవస్థ రద్దుకు చ‌ర్య‌లు
కుళ్లిన కూర‌గాయ‌లతో వంట చేస్తున్నట్టు ఆరోప‌ణ‌లు
అందుకే అస్వ‌స్త‌త‌కు గుర‌వుతున్న విద్యార్థులు!
ఫుడ్ స‌ప్ల‌య్‌లో అవాంత‌రాల‌కు చెక్ పెట్టే ఆలోచ‌న‌లు
వ‌చ్చే ఏడాది నుంచి మ‌హిళా సంఘాల‌కు అప్ప‌గింత‌?
సీఎస్ శాంతికుమారి, సెర్ఫ్ సీఈవో దివ్యా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు
ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న అధికార యంత్రాంగం

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ‌లోని చాలా గురుకులాల్లో కాంట్రాక్ట‌ర్లు కుళ్లిన కూరగాయలను స‌ప్ల‌య్ చేస్తున్నార‌నే అప‌వాదు ఉంది. పాడైన ఆకు కూర‌లు, కూర‌గాయ‌ల‌తో వండి ఆహారాన్ని తిన్న‌ స్టూడెంట్స్‌కి హెల్త్ ఇష్యూస్ వ‌స్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు ప్ర‌భుత్వం స‌రికొత్త నిర్ణ‌యాన్ని తీసుకుంటోంది. కాంట్రాక్ట‌ర్ల విధానానికి స్వస్తి పలికి.. స్థానికంగా ఉన్న మహిళా సంఘాల ద్వారా కూరగాయలు, పప్పులు, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదే ప్రభుత్వ లక్ష్యం..

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా కూరగాయలు, పండ్లు, పప్పుల సరఫరా బాధ్యతను మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్ర‌భుత్వం ఆలోచన‌గా ఉంది. జాతీయ పౌష్టికాహార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆహార పదార్థాలతో పాటు చిరుధాన్యాలకు ప్రాధాన్యమిస్తారు.

గతంలోనే అమలు చేసిన దివ్యా దేవ‌రాజ‌న్‌..

సెర్ప్‌ సీఈవో దివ్యా దేవరాజన్‌ వికారాబాద్‌, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసినప్పుడు.. స్థానిక అంగన్‌వాడీ కేంద్రాలకు మహిళా సంఘాల ద్వారా చిరుధాన్యాల ఆహారాన్ని పంపిణీ చేయించారు. ఇదే తరహాలో గురుకులాలు, వసతిగృహాలు, పాఠశాలలకు కూడా అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.

రైతులకూ ఎంతో మేలు..

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పండించే కందులు, వేరుశ‌నగకు సరైన ధరలు రావడం లేదు. కూరగాయలనూ రైతులు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోంది. వాటిని మహిళా సంఘాలు కొనుగోలు చేయడంతో రైతులకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని గురుకులాలు, వసతిగృహాలు, పాఠశాలలు, వాటిలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మహిళా సంఘాలను ఎంపిక చేసి.. సరుకుల సరఫరా బాధ్యతలను అప్పగించేందుకు వీలుగా సెర్ప్‌ ప్రణాళిక రూపొందిస్తోంది..

నెలాఖ‌రులోగా నిర్ణయం..

2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్ర‌ణాళిక ప్ర‌కారం మ‌హిళా సంఘాల‌తో గురుకులాల‌ను ర‌న్ చేయాల‌ని, ఒకేసారి రాష్ట్రం అంతా ప్రారంభించాలా.. లేకుంటే దశలవారీగా చేపట్టాలా అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కొత్త కార్యక్రమం రూపకల్పన కోసం త్వరలో సీఎస్‌ శాంతికుమారి అధ్యక్షతన సెర్ప్‌ సీఈవో, అన్ని గురుకుల విద్యాలయాల సంస్థలు, విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశం జ‌ర‌గ‌నుంది. దీనిపై మార్చి నెలాఖరులోగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వడానికి సెర్ప్‌ కృషి చేస్తోంది. ఈ కార్యక్రమం అమలైతే అటు మహిళలకు, ఇటు రైతులకు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ప‌రిశీలకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *