హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో గత ప్రభుత్వం స్వార్ధం కోసం రెవెన్యూ వ్యవస్ధను దుర్వినియోగపరచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి మొత్తం వ్యవస్దను ప్రక్షాళన చేసి భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్తున్నామని రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం రెవెన్యూ సదస్సులపై సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కోరిన విధంగా రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. జూన్ 3వ తేదీ నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి చట్టంలో భాగంగా మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నీ రెవెన్యూ గ్రామాలకు తహశీల్దార్ తో కూడిన బృందం వెళ్తుందన్నారు. ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుందన్నారు.
ఆనాటి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో..
ఆనాటి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు వారి ప్రమేయం లేకుండానే భూ సమస్యల్లో చిక్కుకున్నారని, సమస్యల గురించి ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్ధితి ఉండేదని మంత్రి అన్నారు. ఏ సమస్యకైనా కోర్టు మెట్లు ఎక్కవలసిందేనని, కానీ ఈనాడు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వారి వద్దకే వెళ్లి ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే వారి సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. ఇప్పటికే ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని అన్నారు. మొదటగా నాలుగు పైలట్ మండలాల్లో 72 రెవెన్యూ గ్రామాలలో నిర్వహించిన సదస్సుల్లో 13 వేలకు పైగా దరఖాస్తులు రెండో విడతలో 28 మండలలో 421 రెవెన్యూ గ్రామాలల్లో నిర్వహించిన సదస్సుల్లో 42 వేల దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేసి ఇప్పటి వరకు 60 శాతం వరకు భూ సమస్యలు పరిష్కరించడం జరిగిందని అన్నారు. అధికంగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, దీనికి త్వరలో పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
ప్రభుత్వానికి, ప్రజలకు రెవెన్యూ శాఖ వారధి
ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉంటుందని, ఈ విభాగం సమర్ధవంతంగా పనిచేసినప్పుడే ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు ఆకాంక్షలు నెరవేరి ప్రభుత్వం కోరుకున్న ఫలితాలు లభిస్తాయని పొంగులేటి అన్నారు. ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్ద పనిచేయాలన్నారు. గత ప్రభుత్వంలో కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలు గ్రామ స్థాయిలో అందించడానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తుందన్నారు. ముఖ్యంగా కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్ధాయిలో పర్యటించి భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ప్రజల వద్దకు వెళ్లే రెవెన్యూ యంత్రాంగం మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రజలతో మమేకం కావాలని, వీలైనంతవరకూ వారి సమస్య పరిష్కారం చేసేలా వ్యవహరించాలన్నారు.