TG Politics: నోటీసులపై ఏం చేద్దాం… ఆ పది మంది ఎమ్మెల్యేల మల్లగుల్లాలు..

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : పార్టీ ఫిరాయింపుల‌పై సుప్రీంకోర్టు, అసెంబ్లీ కార్య‌ద‌ర్శి ఇచ్చిన నోటీసుల నేప‌థ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇవాళ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ఇంటిలో భేటి అయ్యారు.. ఈ స‌మావేశంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై వారు ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకోర్టుకు ఇచ్చే సమాధానంపై కూడా చర్చ జరిగింది.

ఇక ఎమ్మెల్యేలు అంతా వెంటనే ఢిల్లీకి వెళ్లి అక్కడ సమాలోచనలు చేయాలని యోచిస్తున్నారు. న్యాయ‌ప‌రంగా సుప్రీంకోర్టులో అంద‌రూ క‌ల‌సి పిటిష‌న్ వేయాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ స‌మావేశంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు..

కాగా, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి ఈనెల‌ 4న నోటీసులు జారీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ సెక్రటరీ.. పార్టీ మార్పు వ్యవహారంపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ మేరకు బీఆర్ఎస్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. మీపై అన‌ర్హ‌త వేటు ఎందుకు తీసుకోకూడ‌దో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆ నోటీస్ లో పేర్కొన‌డంతో ఎమ్మ‌ల్యేలు అల‌ర్ట్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *