కరీంనగర్ ఆంధ్రప్రభఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సోమవారం స్ట్రాంగ్ రూముల నుండి బ్యాలెట్ బాక్స్ లను కౌంటింగ్ టేబుల్ వద్దకు తీసుకువచ్చారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజాంబాద్ జిల్లాలో పట్ట బధ్రులు, ఉపాధ్యాయుల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 2,50,106 మంది పట్ట భద్రులు ఓటు హక్కు వినియోగించుకోగా, 24,895 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మొదట బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కట్టిన అనంతరం చెల్లని ఓట్లు తీసివేసిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు.
పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్, బిజెపి, బిఎస్పీల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం బిజెపి అభ్యర్థితో మహేందర్ రెడ్డి పోటీ పడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారిని పమేలాసత్పతి పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణలో గ్రాడ్యుయేట్లపైనే అందరి దృష్టి
తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ మూడు స్థానాల్లోనూ పోటీ చేసిన బీజేపీ తన బలాన్ని ప్రదర్శించబోతోంది. ఇక రాష్ట్రంలో ఒక స్థానంలోనే పోటీచేసిన అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక్కడ ఓడిపోతే ఎన్నికలకు రిఫరెండంగా భావించాలని బీజేపీ సవాల్ విసిరింది. ఈ స్థితిలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాలనను పట్టభద్రులు వ్యతిరేకించారా? మరో చాన్స్ ఇచ్చారో తేలాల్సి ఉంది.
ఇక రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీకే టీచర్లు మద్దతు పలుకుతారని ఒక అంచనా. ఈ సందర్భంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ సహా ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్రపోటీ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. మూడో ప్రాధాన్యత ఓటుతోనే గెలిచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకుల అంచనా. 56 మంది అభ్యర్థులు ఉన్నా.. నాలుగు, మూడు స్థానాల్లో నిలిచే అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియతోనే విజేత తేలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీచేశారు. ఈ ఇద్దరి విజయంపై ధీమాగా ఉన్నారు.
పార్టీ కేడర్‌తో పాటు ఆర్థికంగా బలవంతులు కావడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నాయి.బీఎస్పీ మద్దతుతో పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ సైతం పట్టభద్రులు తనను గెలిపిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్ ముగిసినప్పటికీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపారనేది ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల టీచర్ల ఎమ్మెల్సీ స్థానంలో , వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ల స్థానాల్లో రాజకీయ పార్టీలు పోటీ చేయలేదు. దీంతో పట్టభద్రుల స్థానంపైనే ఉత్కంఠ నెలకొంది.