హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గ్లామర్ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తన విపరీతమైన ప్రవర్తన, పక్కదారి పట్టిన ప్రాధాన్యతలు, రాజకీయ నిజాయతీ లోపం కారణంగా రాష్ట్రాన్ని నడిపించడానికి అనర్హుడని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ భవన్ లో నేడు జరిగిన నిర్మల్ నియోజకవర్గ నేతల, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని పెద్దలు అంటారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పోయిన మాజీ మంత్రి ఇంద్రకరన్ రెడ్డిని చూస్తే ఈ సామెత నిజమే అనిపిస్తుంది. పదవితోను అధికారంతో మనిషికి గౌరవం దక్కదు రాదు. కష్ట కాలంలో కూడా తల్లి లాంటి పార్టీని నమ్ముకొని ఉన్నోడే నిజమైన నాయకుడు అవుతాడు.నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉన్న ఓ నాయకుడు కాంగ్రెస్ లోకి పోతామంటే ఆ పార్టీ వాళ్లు వద్దని ధర్నాలు చేశారు, అయినా ఆ నాయకుడికి సిగ్గు రాలేదు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు జిల్లా మంత్రిగా అపారమైన గౌరవాన్ని ఆ నాయకుడు పొందాడు. ఇప్పుడు కాంగ్రెస్ లో కనీసం కూర్చోమని చెప్పే వాళ్ళు లేరు.
మనం చేసే పనులతో, మన క్యారెక్టర్ తోనే మనకు గుర్తింపు వస్తుంది తప్ప పదవులతో అధికారం తో రాదు. పోయినోళ్ళు పోనీ ఉన్న వాళ్ళతోనే పార్టీని బలోపేతం చేసుకుందాం. నిర్మల్, ముధోల్, ఖానాపూర్లో తిరిగి గులాబి జెండా రెపరెపలాడించాలి. రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం హైదరాబాద్ నుంచి అబ్జర్వర్లను పంపుతాము. ఒక్క ఊరుని, ఒక్కో నియోజకవర్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గెలిచాక పార్టీ నమ్ముకుని ఉండే వాళ్లకు టికెట్లు ఇస్తాం, గెలిపించుకుందాం. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మండలాల్లో మళ్లీ పార్టీని పటిష్టం చేసుకుందాం.

ఇవ్వాళ తెలంగాణలోని ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని చెప్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తమ ప్రభుత్వ పాలనను ఇష్టపడడం లేదు. రైతులు అయితే ప్రతి ఊర్లో బాధపడుతున్నారు. 100% రుణమాఫీ ఎక్కడ అయ్యిందో చూపెట్టాలని అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే సైలెంట్ గా ఉన్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. రేవంత్ సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో గాని, సొంత నియోజకవర్గం కొడంగల్ లో గాని ఆయనకు పిల్లనిచ్చిన నియోజకవర్గం కల్వకుర్తిలో గాని ఎక్కడైనా సరే ఒక్క ఊర్లో 100% రుణమాఫీ అయిందంటే రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఛాలెంజ్ చేస్తే ఇప్పటిదాకా కాంగ్రెస్ నుంచి జవాబు లేదు.
రుణమాఫీకి రూ. 49,500 కోట్లు కావాలని అధికారంలోకి వచ్చిన మూడు రోజులకు భట్టి విక్రమార్క చెప్పిండు. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు. క్యాబినెట్ సమావేశంలో రూ. 31 వేల కోట్ల రుణమాఫీ అన్నరు. అసెంబ్లీలో రూ. 26 వేల కోట్ల రుణమాఫీ అన్నారు. రూ. 11,000 కోట్లు ఇచ్చాము రుణమాఫీ చేయండి అని బ్యాంకర్లకు భట్టి విక్రమార్క చెప్పాడు. రూ. 49,500 కోట్ల రుణమాఫీ చివరకు రూ.11వేల కోట్లకు వచ్చింది. అది కూడా పూర్తిగా కాలేదు. ఇచ్చింది చారానా వంతు అయితే బిల్డప్ మాత్రం బారానా వంతు చేసుకున్నారు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే అందాల పోటీల్లో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు.

వానలు పడుతుంటే కల్లాలలో వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. మొలకలు వస్తే రైతు ఆగమై రోడ్డుమీద పడే పరిస్థితి ఉంది. అడిగే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఊర్లో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జడ్పీటీసీ లేడు, ఎమ్మెల్యే లేడు. కాంగ్రెస్ నేతలందరూ సెక్రటేరియట్ చుట్టూ పైరవీలు కోసం తిరుగుతున్నారు. ఈ ప్రభుత్వం 20%-30% కమిషన్ల చుట్టూనే తిరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు కావాలంటే పైసలు ఇవ్వాల్సిందేనని మంత్రి సురేఖ చెప్పారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఒకతను మా మంత్రులంతా 30% కమిషన్ తీసుకుంటున్నారని బహిరంగంగానే చెప్తున్నారు. 20%, 30% కమిషన్ మీకు ఇస్తే మాకే మిగిలిది ఏంటని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేశారు.17 నెలల కాలంలోనే కాంగ్రెస్ చేస్తున్న దోపిడీ బాగోతం తెలంగాణలోని ఊరూరుకీ చేరింది.
చరిత్రలో ఇప్పుటిదాకా చూడని విధంగా వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది. ఆ సభ తర్వాత, అక్కడ కేసీఆర్ ని చూసిన తర్వాత ఆయన ప్రత్యర్థులకు గజ్జుమంది. అందుకే తమ అవినీతి బాగోతం, కమీషన్ల దందాల నుంచి ప్రజల దృష్టినీ మరల్చడానికి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. పాతబస్తీ అగ్ని ప్రమాద బాధితులను కలవడానికి రేవంత్ రెడ్డికి తీరికలేదు. ఆయన అందాల పోటీల్లో బిజీగా ఉన్నారు. మింగ మెతుకు లేదు గానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టుకున్నాడట వెనుకటికి ఎవరో. రాష్ట్రం దివాలా చేసిందని చెప్పే ముఖ్యమంత్రి అందాల పోటీలకు కోట్ల కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. అపరిచితుడు సినిమాలోని రెమోలాగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పు పుట్టడంలేదు, అందరూ దొంగల్లాగా చూస్తున్నారని చెపుతున్నాడు. కానీ అదే రేవంత్ రెడ్డి రూ. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా అని అపరిచితుడు రాము లెక్క అసెంబ్లీలోనే ఒప్పుకుంటాడు.
సంవత్సరానికి రూ. 40 వేల కోట్ల చొప్పున 9 సంవత్సరాల పాటు కేసీఆర్ అప్పు చేస్తే తప్పట. కానీ రేవంత్ రెడ్డి ఒక సంవత్సరంలోనే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్పు కాదట. కానీ కేసీఆర్ అప్పుచేసి ప్రజలకు పంచాడు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. రూ.73 వేల కోట్ల రూపాయలతో రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసల్ని వేశాడు. రైతుల ఖాతాల్లో టకి టకీమని డబ్బులు పడట్లేదు గానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలో కాంగ్రెస్ అగ్రనేతల ఖాతాల్లో ఠంచన్ గా పైసలు పడుతున్నాయి.
ఇక్కడ దోచుకున్న పైసలు అక్కడ ఢిల్లీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు పంచుతున్నాడు. లేకుంటే తనకు పదవి ఉండదన్న సంగతి ఆయనకు తెలుసు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తూనే ఆయన హయాంలో జరిగిన నియామకాలకు ఈయన పత్రాలు ఇస్తున్నాడు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానని చెపుతున్న రేవంత్ రెడ్డి, అందాల పోటీలకు వచ్చిన వారికి కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటర్, టీ-హబ్, బుద్దవనం, యాదగిరిగుట్టకు తీసుకుపోతాడు.
55 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ఒక్క ఘనత కూడా లేదు. నిజాం కట్టిన చార్మినార్ నైనా చూపించాలి లేదంటే కేసీఆర్ కట్టించిన అద్భుతాలనైనా చూపించాలి. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధితో రేవంత్ రెడ్డి బాధపడుతున్నాడు. ఒకటే మనిషి నలుగురు లెక్క నటించడమే ఈ వ్యాధి లక్షణం. ఓవైపు కాళేశ్వరం కూలిందని చెప్పే రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తీసుకొస్తారని చెప్పుకుంటాడు ఇందులో ఏది నిజం. నిజంగానే కాళేశ్వరం కూలిపోతే కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి.

సంవత్సరానికి రూ. 40 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్ రైతుబంధు ఇచ్చిండు. 24 గంటలు ఫ్రీగా కరెంట్ ఇచ్చిండు. మిషన్ భగీరథతో మంచినీళ్లు ఇచ్చిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిండు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిండు. మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమవుతుంది? అక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటాడు కదా అని చాలామంది తెలంగాణ ప్రజలు అనుకోవడంతోనే ఫలితాలు ఇలా వచ్చాయి. కేసీఆర్ ను దొర దొర అని తిట్టినవాళ్లే ఇప్పుడు రేవంత్ రెడ్డిని దొంగ దొంగ అంటున్నారు. స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశాన్ని ఏలుతున్న వారికి ఈ ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో తెలియడం లేదు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్ల కాలంలో అటు పల్లె ప్రజలకు ఏం కావాలో, ఇటు పట్నంలో ఉండే వాళ్లకు ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలుసుకొని పనులు వారికి చేశారు.
దసరా పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చిండు. క్రిస్టియన్ లకు క్రిస్మస్ కానుకలు ఇచ్చిండు. కులం మతం పంచాయతీ పెట్టకుండా ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ప్రజల చిరకాల కోరికలైన నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిర్మల్ లో మెడికల్, నర్సింగ్ కాలేజ్ వస్తాయని ఎవరు అనుకోలేదు. కానీ కేసీఆర్ చేసి చూపించారు. తెలంగాణ రాకముందు ఐదు మెడికల్ కాలేజ్ మాత్రమే ఉండేవి కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా 33 మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు.
ఇన్ని మంచి పనులు చేసిన తర్వాత కూడా కేసీఆర్ కి అనుకున్న ఫలితం రాలేదు. అందుకు పార్టీ పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లోనే కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. అలాంటిది లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే. అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి అధిష్టానం ఎవరికీ టికెట్ ఇస్తే వారికి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలి. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆగ్రహం ఉన్న మాట నిజమే కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి పని చేయకుంటే అనుకున్న ఫలితాలు రావు.
లొట్ట పీసు కేసులతోని అయ్యేది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి కథ ముగిసింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు పైసల సంపాదన మీద పడ్డాడు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి ముందుగా ఆడబిడ్డలకు ఇస్తానన్న నెలకు రూ. 2500 రూపాయలను వెంటనే ఇవ్వాలి. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్ లో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలంటే ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు విభేదాలను పక్కన పెట్టుకొని కష్టపడి పని చేయాలి. పదేళ్లు అధికారం అప్పజెప్పిన ప్రజలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండమని అంటే ఆ పాత్రను కూడా బీఆర్ఎస్ అద్భుతంగా పోషిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నాము. జూన్, జూలైలో పార్టీ మెంబర్ షిప్ కార్యక్రమం ఉంటుంది. నిర్మల్ జిల్లాలో మెంబర్ షిప్ డ్రైవింగ్ లో విజయవంతం చేయండి. కాంగ్రెస్ బీజేపీలను ఎండబెట్టి తెలంగాణకు గుండె ధైర్యం అయిన గులాబీ జెండాను మరొక్కసారి ఎగిరేయాలని కోరుకుంటున్నానని అన్నారు .