TG | స‌న్న బియ్యం పోయే… దొడ్డు బియ్య‌మూ పోయే…రేవంత్ పై కెటిఆర్ ఆగ్రహం

హైదరాబాద్‌: ప్రజాపాలన అంటే పస్తులేనా అని, ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మండిపడ్డారు. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టు.. సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డుబియ్యం కూడా ఇయ్యలేదని విమర్శించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు.

రైతుల నుంచి సన్నాలు కొన్నది లేదు, సన్నాలకు బోనస్ రూ.500 ధర ఇచ్చిందీ లేదన్నారు. మార్చి నుంచి పేదలకు సన్నబియ్యం అని ప్రకటనలు చేశారని, పదో తేదీ దాటినా పేదలకు రేషన్ బియ్యం కూడా ఇవ్వని అసమర్థ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. గురుకులాల్లో విద్యార్థులకు బుక్కెడు బువ్వ పెట్టని కాంగ్రెస్ సర్కారు.. సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్‌ దుకాణాలకు లక్ష 54 వేల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసి ఇందిరమ్మ ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని చెప్పారు. కొత్త ఏడాది ఉగాదికి సన్నబియ్యం అని సన్నాయి నొక్కులు నొక్కి ఉన్న బియ్యం ఊడబీకారని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే పస్తులేనా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా అని నిలదీశారు.

రైతులకు రుణమాఫీ కట్, రైతులకు రైతుభరోసా, రైతుబీమా, ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్, గర్భవతులకు న్యూట్రిషన్ కిట్, విద్యార్థినులకు హెల్త్ కిట్, ఎలక్ట్రిక్ స్కూటీ, మహిళలకు నెలకు రూ.2500 మహాలక్ష్మి కట్.. ఆఖరికి పేదలకు రేషన్ బియ్యం కూడా కట్ అని విమర్శించారు. కాంగ్రెస్ అంటే కటింగ్ అని కాంగ్రెస్ అంటే కన్నింగ్ అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *