TG | మేం హ‌రిత‌హారం చేస్తే… రేవంత్ హ‌రిత సంహారం చేస్తున్నారు – మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

హైదరబాద్ – త‌మ పాల‌న‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం చేస్తే, ఇప్పటి సిఎం రేవంత్ రెడ్డి హరిత సంహారం చేస్తున్నారని మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుతో ఆ ప్రాంగణంలోని జంతువులు చిత్రహింసలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ భవన్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అధికారులతో మాట్లాడి పోలీసులను అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ భూముల వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకమాడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోకి పోలీసులు రాకుండా అడ్డుకోవచ్చని వ్యాఖ్యానించారు. డ్రోన్ కెమెరాలతో జేసీబీ వీడియోలు తీసిన ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు.

బీజేపీ సహాయంతోనే రేవంత్ రెడ్డి 400 ఎకరాల భూమిని తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుందని, కానీ పార్కులను, అడవులను విక్రయిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలోని భూమిని ఇవ్వవచ్చు అన్నారు. 400 ఎకరాల భూముల వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల చీకటి కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గురువు చంద్రబాబు బాటలోనే శిష్యుడు రేవంత్ రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌లోని మంత్రులు పేమెంట్లతో పదవులు పొందారని.. పేమెంట్‌పై పేటెంట్‌ కాంగ్రెస్‌కే దక్కుతుందని, ఈ విషయం ప్రజలకు తెలుసునని జగదీశ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తె సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జిని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సోషల్ మీడియా, మీడియా, రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. విద్యార్థులు,యువత మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం 1969లో వచ్చాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందని, సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అంటేనే కేసులు, లాఠీఛార్జిలు మంత్రులు అక్కసు వెళ్లగక్కి విద్యార్థులను అవమానించి పెయిడ్ బ్యాచ్‌ అని మాట్లాడారన్నారు.

Leave a Reply