TG | మహిళలకు వడ్డీ లేని రుణాలు….

ఆసిఫాబాద్, (ఆంధ్రప్రభ) : రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఈ నెల 25వ తేదీన ఘనంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ములుగు జిల్లా నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సృజన, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా DRDA అధికారులు, మహిళా సమాఖ్య ప్రతినిధులతో సమావేశం జరిగింది.

ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ నెల 25న జరిగే చీరల పంపిణీ కార్యక్రమంతో పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను శాసనసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

జిల్లా కేంద్రంలోని ఐడీసీ భవనంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల సమన్వయంతో సజావుగా నిర్వహిస్తామని తెలిపారు.

అదే రోజు కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్ కేంద్రాల్లో శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో వడ్డీరహిత రుణాల చెక్కుల పంపిణీని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply