తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మరింత వేగం పెంచాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా యుద్ధ ప్రతిపాదికన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
రెండు, మూడు రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఆదివారం రాత్రి మంత్రి తన నివాసంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ…
‘‘ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల ను నిర్మించి ఇవ్వడమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ లక్ష్యాలకు, ఆలోచనల ప్రకారం కలెక్టర్లు పనిచేయాలి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కలెక్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఇందిరమ్మ ఇండ్ల పథకం పై కలెక్టర్లకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలి. కాలయాపన చేయకూడదు. లబ్ధిదారుల ఎంపికలో స్థానిక శాసన సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని కలెక్టర్ లే తుది నిర్ణయం తీసుకోవాలి. ఎంపికలో నిరుపేదలకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలి. నిర్మాణం పూర్తి అయిన 2 బిహెచ్కే ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అసంపూర్తిగా ఉన్న వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని సాగునీరు, త్రాగునీరుకు ఎలాంటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. వరంగల్ జిల్లాలోని ఎయిర్ పోర్ట్, ఔటఠ్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగురోడ్డు కు భూసేకరణ ను వేగవతం చేయాలని’’ మంత్రి పొంగులేటి ఆదేశించారు.