హైదరాబాద్: తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నేడు నిర్వహించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ముందుగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు.. తెలంగాణ కోసం అమరులైన వారికి అంజలి ఘటించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాటం, రాజకీయ పటిమతో తెలంగాణ వచ్చిందని అన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అమరవీరులకు కనీసం నివాళులు కూడా అర్పించడం లేదని మండిపడ్డారు.
..’జాగృతి కొత్త కార్యాలయంలో మొదటి సారి జెండా ఎగురవేసినం. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తల్లులు బిడ్డలను కోల్పోయారు. అది మనం గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ పోరాటం రాజకీయ పటిమ తో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఉన్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అని కూడా అనడం లేదు. అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం నివాళులు కూడా అర్పించడం లేదు. అమరవీరులకు నివాళులు అర్పించే వరకు మా జాగృతి పోరాటం చేస్తుంది’ అని వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు -కవిత
స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితో పోరాడిన సకల జనులు, అన్ని వర్గాలకు ఉద్యమాభివందనాలు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ… పదేండ్ల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అభివృద్ధిలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని కోరుకుందాం. జై తెలంగాణ జై కేసీఆర్..