TG | సిరిసిల్ల జల్లాలో కొనసాగుతున్న పంటల సర్వే ..

సిరిసిల్ల జిల్లాలో 1.43 లక్షల రైతులు
95,449 ఎకరాల్లో పంటల పరిశీలన
ఇప్పటివరకు 32,707 ఎకరాల్లో సర్వే
యాసంగిలో 1.80లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు
1.76లక్షల ఎకరాల్లో వ‌రిపంట‌

క‌రీంన‌గ‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌:

సమృద్ధిగా వర్షాలు కురియడం.. నీటి లభ్యత ఆశతో యాసంగి పంటల సాగు వైపు రైతులు ముందడుగు వేశారు. జోరుగా వరినాట్లను పూర్తి చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో 1.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఆశాజనకంగానే భూగర్భ జలాలు ఉంటాయని రైతులు వరిసాగు వైపు మొగ్గు చూపారు. జిల్లాలో 1.76 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కూలీల కొరత ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన కూలీలతో నాట్లను పూర్తి చేసుకున్నారు. గతంలో ప్రభుత్వం క్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియను చేపట్టింది. ప్రస్తుతం యాసంగిలో పంటల సాగు వివరాలు ఖచ్చితంగా ఉండే విధంగా డిజిటల్‌ క్రాప్‌ సర్వేను ప్రారంభించింది.

జిల్లా వ్యాప్తంగా 95,449 ఎకరాల్లో సర్వే..

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పైలట్‌ ప్రాజెక్ట్‌గా 52 క్లస్టర్లలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వం మండల విస్తరణ అధికారులతో సర్వేను చేస్తోంది. వివిధ పంటల సాగు వివరాలను ఫోన్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. పంటల నమోదు ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూర్చే దిశగానే కేంద్రం డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విధానాన్ని తీసుకవచ్చింది. ఇందులో భాగంగానే డిజిటల్‌ సర్వే కొనసాగుతున్నా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. పంటల బీమాతో పాటు ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్న సమయంలో డిజిటల్‌ సర్వే ద్వారా నష్టాన్ని అంచనా వేసే అవకాశం ఉంటుంది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ సర్వేలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు 1,43,936 మంది రైతులకు సంబంధించి 95,443 ఎకరాల్లో సర్వే చేసే విధంగా లక్ష్యంగా పెట్టారు.

నెట్‌వర్క్‌తో ఇబ్బందులు..

గ్రామీణ ప్రాంతాల్లో పంటపొలాల వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఫోన్‌ యాప్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో సాంకేతిక సమస్యలతో వ్యవసాయ విస్తరణ అధికారులు ఇబ్బందులు పడడం కనిపిస్తోంది. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మారుమూల ప్రాంతాలకు వెళ్లడం ద్వారా నెట్‌వర్క్‌ కవరేజీ లేకపోవడంతో సర్వే నంబర్‌ వద్ద పంటల వివరాలు నమోదు చేసి ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సర్వే వేగంగా జరగడం లేదు.

వరివైపే మొగ్గు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో వరి వైపు రైతులు మొగ్గు చూపారు. 1.80లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో 1.76 లక్షల వరకు వరిసాగు చేసుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన లెక్క ప్రకారం గంభీరావుపేటలో 18వేల ఎకరాలు, ఇల్లంతకుంటలో 26,124 వేల ఎకరాలు, ముస్తాబాద్‌లో 20,006 వేల ఎకరాలు, సిరిసిల్లలో 3,803 ఎకరాలు, తంగళ్లపల్లిలో 18,060 ఎకరాలు, వీర్నపల్లిలో 6,520 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 16,359 ఎకరాలు, బోయినపల్లిలో 12,510 ఎకరాలు, చందుర్తిలో 16,545 ఎకరాలు, కోనరావుపేటలో 17,806 ఎకరాలు, రుద్రంగిలో 4,850 ఎకరాలు, వేములవాడలో 2,500 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 9,500 ఎకరాల వరకు వరిసాగు చేశారు. దీంతో పాటు మొక్కజొన్న 1,491 ఎకరాలు, గోధుమ 50 ఎకరాలు, కందులు 180 ఎకరాలు, పల్లి 25 ఎకరాలు, నువ్వులు 134 ఎకరాలు, పొద్దు తిరుగుడు 1,021 ఎకరాల వరకు సాగు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *