హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మూడు నెలలు సన్న బియ్యాన్ని 7.24 లక్షల మంది రేషన్ కార్డుదారులు తీసుకోలేదని, ఆ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కార్ (Congress government) కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అనుమానం వ్యక్తం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో జూన్‌లో మూడు నెలల రేషన్ పంపిణీ జరిగిందని తెలిపారు. అనివార్య కారణాలతో రేషన్ తీసుకోని 7.24 లక్షల కుటుంబాలు ఉన్నాయని, రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపుతూ ఏడు లక్షలకు పైగా కుటుంబాల రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.
అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తామని.. అవసరమైతే 30 లక్షల, 40 లక్షల కార్డులు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నా.. కార్డుల ఏరివేతకు ప్రయత్నాలు చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. రేషన్ (Ration) తీసుకోని వారికి మరోసారి బియ్యం పంపిణీ చేయాలని, రేషన్ కార్డుల రద్దు ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు (New ration cards) ఇవ్వాలని డిమాండ్ చేశారు.