హెచ్‌సీయూ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు ఆయనే బాధ్యుడు
మరణానికి కారణమైన దత్తాత్రేయ, సుశీల్ కుమార్ కు ఉన్నత పదవులా
దళిత, ఆదివాసీ వ్యతిరేకులకు బిజెపి వ్యతిరేకం
రోహిత్ మరణంపై కొనసాగుతున్న విచారణ
హైదరాబాద్ – తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు (telangana BJP president ) రామచందర్ రావుపై (ramachandra rao ) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(deputy cm Bhatti vikramarka ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌సీయూ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల (rohit vemula ) ఆత్మహత్య (suicide) కు కారణమైన రామచందర్ రావును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఆయనకు ఆ పదవి ఇవ్వడంపై బీజేపీ అధిష్టానం పునరాలోచన చేయాలన్నారు. రోహిత్ వేముల మరణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా పదవులు ఇస్తున్న బీజేపీ.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు భట్టి.
రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. త్వరలోనే తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని.. న్యాయశాఖ దీనిపై పనిచేస్తోందని చెప్పారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి, ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్‌కు ఢిల్లీ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, రామచందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. 2016లో యూనివర్శిటీ యాజమాన్యం రోహిత్ వేములపై చర్యలు తీసుకునేలా యూనివర్శిటీ వద్ద రామచందర్‌రావు ఆందోళన చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం దళితులు భయపడేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దళితులు, ఆదివాసీలకు దేశంలో గౌరవం లేకుండా బీజేపీ ప్రవర్తిస్తోందని విమర్శించారు.
దేశంలో దళితులు, ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి బీజేపీ పదవులు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరమన్నారు ఉపముఖ్యమంత్రి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. దేశంలో వందల ఏళ్లుగా వెనుకబడిన వర్గాలు అణచివేతకు గురవుతున్నాయని తెలిపారు. దేశంలో ఉన్న ప్రతీ పౌరుడి హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అలాగే రోహిత్ వేముల చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించలేదని వ్యాఖ్యలు చేశారు. ఏ రోజు కూడా యూనివర్శిటీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.