హైదరాబాద్ – గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమిని దాదాపు పాతిక సంవత్సరాల క్రితం బిల్లారావు అనే ప్రైవేటు వ్యక్తికి, ఆయన సంస్థకు నాటి ప్రభుత్వం ఆ భూమిని కేటాయించిందని, అప్పటి నుంచి హెచ్‌సీయూ వద్ద ఆ భూమి లేదని ముఖ్యమంత్రి తెలిపారు. 2006లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూకేటాయింపులను రద్దు చేసిందని ఆయన వెల్లడించారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఆ భూమిని దక్కించుకునే ప్రయత్నాలు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆ భూమిని రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగిస్తున్నామని వెల్లడించారు. అభివృద్ధికి కేటాయించిన భూమిలో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్లు, అందులో జీవరాశులు ఉన్నట్లు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అక్కడ పులులు, సింహాలేమీ లేవని, కొన్ని గుంటనక్కలు ఆ భూమి చుట్టూ చేరి రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఆ భూమిని అభివృద్ధి కోసమే వినియోగిస్తామని స్పష్టం చేశారు.
ఉప ఎన్నికలు రాబోవు
తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ అలాంటిదేమీ ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులెవరికీ ఉప ఎన్నికలు వస్తాయనే ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఇలాంటి అంశాల మీద దృష్టి సారించకుండా ప్రజా సమస్యలపై పని చేయాలని హితవు పలికారు. తాను రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించానని ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.