పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్..

పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్..

పనులు చేసి రెండేళ్లు…
బిల్లులు రాక కాంట్రాక్టర్ ఇబ్బందులు…
విద్యార్థులకు బయటకు పంపి గదికి తాళం…
పాఠశాల ముందు కూర్చున్న విద్యార్థులు…
తమ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ డిమాండ్….

బిక్కనూర్, ఆంధ్రప్రభ : తమకు రావలసిన బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్ పాఠశాల గది నుండి విద్యార్థులను బయటకు పంపి పాఠశాలకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు పాఠశాల ముందు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది .ఈ ఘటన బుధవారం మండలంలోని ఈసన్నపల్లి గ్రామంలో చోటుచేసుకుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో మన ఊరు మనబడి పథకం కింద సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో కాంట్రాక్టర్ పాఠశాల గది తో పాటు మూత్రశాలలను నిర్మించారు. వారికి కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది.

గత రెండు సంవత్సరాలుగా మిగతా బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులు చెల్లించలేక కాంట్రాక్టర్ ఇబ్బందులు పడుతున్నారు .తమకు రావలసిన పది లక్షల రూపాయల బిల్లులు చెల్లించాలని సంబంధిత అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసుగుచెందిన కాంట్రాక్టర్ పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో ఉన్న విద్యార్థులను బయటకు పంపించి గదికి తాళం వేశారు. దీంతో విద్యార్థులు గత్యంతరం లేక బయట. వరండాలో కూర్చున్నారు వారికి ఉపాధ్యాయులు అక్కడే పాఠాలు బోధించారు. తమకు రావలసిన బిల్లులు చెల్లించే వరకు తాళం తీసే ప్రసక్తి లేదని కాంట్రాక్టర్ సూచించారు. తాము అప్పులు చేసి పాఠశాల గది నిర్మించామని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమ ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వెంటనే తమకు రావలసిన బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply