క్రీడా పాఠశాల ఎంపికలు పారదర్శకంగా నిర్వహించాలీ..

క్రీడా పాఠశాల ఎంపికలు పారదర్శకంగా నిర్వహించాలీ..

సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలం

మక్తల్ , ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలలో 4వ తరగతిలో ప్రవేశం పొందుటకు, ప్రస్తుతము 3వ తరగతి చదువుచున్న బాలబాలికలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న93 మంది బాలబాలికలకు , ఈనెల 31న నారాయణపేట జిల్లా కేంద్రం స్టేడియం గ్రౌండ్లో, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ జిల్లా క్రీడల అధికారి ఆధ్వర్యంలో జరుగనున్న క్రీడా పాఠశాలలకు సంబంధించిన 9 క్రీడాంశాలయిన(ఎత్తు, బరువు, ఫ్లెక్సబిలిటీ, వర్టికల్ జం ప్, స్టాండింగ్ జంప్ ,6 + 10 షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, 30 మీ. రన్, 800 మీ. రన్ ) జిల్లాస్థాయి ఎంపికలను పారదర్శికంగా నిర్వహించి, క్రీడా ప్రతిభను, క్రీడా నైపుణ్యతను ప్రదర్శించిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయాలని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, విశ్రాంత పీఈటి బి.గోపాలం విజ్ఞప్తి చేశారు.

క్రీడా పాఠశాలలకు సంబంధించిన తొమ్మిది క్రీడ అంశాలలో అవగాహన, అనుభవము కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పిడి, పిఈటిల ద్వారా ఎంపికలను నిర్వహించాలని, ప్రతి ఈవెంట్ దగ్గర నారాయణపేట నియోజకవర్గం నుండి ఒకరిని, మక్తల్ నియోజకవర్గం నుండి ఒకరిని, పి డి, పి ఈ టి లను నియమించి ఎంపికలు, పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగే విధంగా చూడాలని జిల్లా క్రీడల అధికారిని ఆయన కోరారు. అదేవిధంగా ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని క్రీడలలో పాల్గొను, బాలబాలికలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కనీస సౌకర్యాలు మంచినీటి వసతి, అక్కడక్కడ నీడ కొరకు షామియానాలు, అవసరం అయితే మధ్యాహ్నం భోజనం వసతి కూడా కల్పించాలని బి.గోపాలం విజ్ఞప్తి చేశారు.

Leave a Reply