హామీలు ఎక్కడ?

హామీలు ఎక్కడ?

  • రైతులకు న్యాయం చేయాలి!
  • తాసిల్దార్‌కు బీజేపీ వినతి.
  • ప్రభుత్వంపై మంకిడి స్వామి ఫైర్.

రాయపోల్, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు మంగళవారం రాయపోల్ మండల తాసిల్దార్‌ కృష్ణ మోహన్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు మంకిడి స్వామి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ,వాటి అమలులో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పి మాట తప్పిందని విమర్శించారు.

రైతుబంధు పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయిందని, రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోందన్నారు.ముఖ్యంగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు ఒక్క రైతుకూ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని స్పష్టం చేశారు.
పొద్దుతిరుగుడు పంటలు కోసి రైతులు రోడ్ల వెంట, కల్లాలల్లో కుప్పలు పోసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నా, ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో పాటు రైతులకు హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులను రోడ్లపైకి తీసుకువచ్చి బీజేపీ తరఫున భారీ స్థాయిలో నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు స్వామి,. ప్రధాన కార్యదర్శి గణేష్,. సీనియర్ నాయకులు వెంకట్ గౌడ్,ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు సత్యం,భూత్ అధ్యక్షులు కరుణాకర్,నాయకులు చెవుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply