పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం

పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం
99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు ప్రతిజ్ఞ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా పురపాలక సంఘాలలో అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అచ్చంపేట మునిసిపాలిటీ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ మొదటి రోజుల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు మార్చి 6 నుంచి మార్చి 15, 2026 వరకు మునిసిపాలిటీ చేపట్టే పరిశుభ్రత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ప్రతిజ్ఞ చేశారు.
“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అచ్చంపేట మునిసిపాలిటీ నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొంటామని, మనసా–వాచా–కర్మణా మునిసిపాలిటీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని” ప్రతిజ్ఞ చేశారు. అచ్చంపేట పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో ప్రజల సహకారం కీలకమని కౌన్సిలర్లు, అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కానోజు మనోహర్ ప్రసాద్, రమేష్ రావ్, గోపిశెట్టి శివ, మేనేజర్ రమేష్ నాయక్, రాజు నాయక్, సానిటరీ ఇన్స్పెక్టర్ గణేష్, టిపిఓ మనోజ, మండల మహిళా సమాఖ్య సభ్యురాల్లు, మునిసిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
