కలెక్టర్ స్పెషల్ ఫోకస్… అధికారులు అలర్ట్

కలెక్టర్ స్పెషల్ ఫోకస్… అధికారులు అలర్ట్
ఆకస్మిక తనిఖీలతో అలర్ట్ అయిన జిల్లా అధికారులు
విద్యాశాఖ పై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
ఆర్జీదారులతో ఆప్యాయంగా పలకరింపు
జనగామ, ఆంధ్రప్రభ : ప్రభుత్వ సూచనల మేరకు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక దృష్టి సారించడంతో ఒక్కసారిగా అధికారుల పనితీరు సైలెంట్ కు దారితీసింది. అధికారులు తప్పు చేస్తే ఆర్జీదారుల ముందే నిలదీసి సమస్యకు పరిష్కారం చూపుతాడని పేరున్న కలెక్టర్ జనగామ జిల్లా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి అధికారులందరూ అలర్ట్ అయ్యారు.
తప్పు చేస్తే ఎక్కడ ఏం జరుగుతుందోననే భయం అధికారులకు టెన్షన్ మొదలయ్యింది. ఇప్పటికే వారం నుండి జిల్లాలో వివిధ పాఠశాలలు పర్యటించి విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత తో పాటు చదువుపై దృష్టి మళ్లించేందుకు ఇన్ని రోజులు జరిగిన విద్యాబోధనపై ప్రశ్నలు వేసి విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించడమే కాకుండా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలని లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ఆకస్మిక తనిఖీలతో చెప్పకనే చెబుతున్నారు.

ఆర్జీదారుల తో ఆప్యాయంగా పలకరింపు
పలు సమస్యలపై గ్రీవెన్స్ కు వచ్చిన ఆర్జీదారులను ఆప్యాయంగా పలకరిస్తూ తమ సమస్యలు ఏంటని క్లుప్తంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులను పిలిపించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో అధికారులు పెండింగ్ ఫైళ్లను సరిచేసుకునే పనిలో పడ్డారు. గత కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో పరిష్కారం కానీ పెండింగ్ ఫైళ్లపై ప్రత్యేక దృష్టి సారించడంతో అధికారులందరూ అలర్ట్ అయ్యారు.
విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి
జనగామ జిల్లా విద్యాశాఖ ను అలర్ట్ చేసేందుకు ప్రతినిత్యం పాఠశాలలపై ఆకస్మిక తనిఖీ చేస్తూ ప్రత్యేక దృష్టి సారించారు. ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రస్తుతం ఆ శాఖను కలెక్టర్ పర్యవేక్షణ చేస్తూ ఆకస్మిక తనిఖీలు చేపడుతూ విద్యాశాఖ అధికారులను అలర్టు చేస్తున్నారు. పదవ తరగతి పరీక్షల సమయం దగ్గరికి రావడంతో రాష్ట్రం లో జనగామ జిల్లా ముందంజలో ఉండేందుకు కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
