Temple | ముక్కోటి ఏకాదశికి స్వర్ణగిరి సిద్ధం
.. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి
.. నేడు స్వర్ణగిరికి రానున్న ప్రముఖుల
Temple | భువనగిరి (రూరల్), ఆంధ్రప్రభ : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం(Sri Venkateswara Swamy Temple)లో నేడు ప్రముఖుల సందడి నెలకొననుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ పవిత్ర వేడుకల్లో ప్రభుత్వ సలహాదారుడు వేమ్ నరేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbham Anil Kumar Reddy) తదితర ప్రముఖులు పాల్గొననున్నట్లు వెల్లడించారు.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున, దర్శన సౌకర్యాలు, క్యూలైన్లు, భద్రత, త్రాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో పాటు సామాన్య భక్తులకు కూడా స్వామివారి దర్శనం సజావుగా కలిగే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే పుణ్యఫలాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఉన్న నేపథ్యంలో, భక్తులు భక్తి శ్రద్ధలతో వేడుకల్లో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.




