Temperatures | జిల్లాలో ఎలినోవా ప్రభావం అధికం..

Temperatures | జిల్లాలో ఎలినోవా ప్రభావం అధికం..

వేసవిలో 50 డిగ్రీలు దాటే అవకాశం..
అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
జిల్లా కలెక్టర్ రాజకుమారి…

Temperatures | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఈ ఏడాది వెళ్లినవా ప్రభావంతో జిల్లాలో 50 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత దాటి అవకాశం లేని ప్రజల్లో అప్రమత్తంగా ఉండాలని,వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. వడదెబ్బ నివారణకు సంబంధించిన పోస్టర్ ను జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, డిఆర్ఓ రాము నాయక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాగిరి వెంకటరమణ లు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. వడదెబ్బ నుంచి రక్షణ కోసం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నీరు, పళ్లరసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. లేత రంగుల, తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం మంచిదని, రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రోజుకు రెండు సార్లు స్నానం చేయడాం మంచిదన్నారు.

అత్యవసరం ఉంటేనే ఎండవేళ బయటకు వెళ్లాలని, వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగు లేదా టోపీ వంటివి ఉపయోగించాలని సూచించారు. ఇంటిలో గాలి ప్రసరణ ఉండేలా కిటికీలు తెరిచి ఉంచి ఫ్యాన్ ఉపయోగించడం ద్వారా చల్లదనాన్ని పొందవచ్చన్నారు. తీవ్ర ఎండ సమయంలో అవసరం లేకుండా బయట తిరగకూడదని కలెక్టర్ సూచించారు. సూర్యకిరణాలు, వేడిగాలులకు నేరుగా గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రోడ్లపై విక్రయించే చల్లని రంగు పానీయాలు లేదా కలుషిత ఆహారం తీసుకోవద్దని హెచ్చరించారు. వేసవిలో మాంసాహారం మితంగా తీసుకోవడంతో పాటు మద్యం సేవించరాదన్నారు. ఎండ వేళల్లో శరీరానికి అధిక శ్రమ కలిగించే పనులు చేయకూడదని సూచించారు. నలుపు లేదా మందమైన దుస్తులు ధరించడం కూడా నివారించాలని తెలిపారు.

వడదెబ్బ లక్షణాలు..

చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు రావడం, మగత లేదా గందరగోళం కలగడం, ఫిట్స్ రావడం లేదా అపస్మారక స్థితికి చేరే అవకాశం ఉండటం వడదెబ్బ లక్షణాలని తెలిపారు.

వడదెబ్బ తగిలిన వ్యక్తికి ప్రథమ చికిత్స..

వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడగల ప్రదేశానికి తరలించాలని సూచించారు.చల్లని నీటిలో తడిపిన గుడ్డతో శరీరాన్ని తుడవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. ఫ్యాన్ గాలి లేదా చల్లని గాలి తగిలేలా చూడాలని తెలిపారు. ఉప్పు కలిపిన మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిగిన గ్లూకోజ్ ద్రావణం లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం ఓఆర్‌ఎస్ పాకెట్స్ ఇవ్వవచ్చన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు లేదా ద్రావణాలు త్రాగించకుండా, వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు.

అదేవిధంగా వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్ల వద్ద పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply