మహిళ రైతు కంట కన్నీరు..

మహిళ రైతు కంట కన్నీరు..
చిట్యాల, ఆంధ్రప్రభ : అరక పట్టి ఆరుగాలం శ్రమించి, కన్నబిడ్డలా సాదుకున్న పంట కళ్లముందే ఎండిపోతుంటే.. ఆ గుండెకోత వర్ణనాతీతం. చిట్యాల మండలం రైతాంగం పరిస్థితి, చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన మహిళా కౌలు రైతు ఆనంతుల పార్వతమ్మ పరిస్థితి ఇందుకు నిదర్శనం.
ట్యాంకర్ల నీళ్లు పోసినా దక్కని పంట
పార్వతమ్మ తనకున్న ఒకటిన్నర ఎకరాల పొలంలో వరి సాగు చేపట్టారు. కంకి దశకు వచ్చి, చేతికి అందుతుందనుకున్న తరుణంలో భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లు వట్టిపోవడంతో చేసేది లేక, పంటను కాపాడుకోవాలనే తపనతో ట్యాంకర్‌కు 800 రూపాయలు వెచ్చించి మరీ నీరు కొనుగోలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. లక్షల పెట్టుబడి కళ్లముందే బుగ్గిపాలవడంతో, ఆ పంటను పశువుల మేతగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. “పెట్టిన పెట్టుబడి పోయింది.. అప్పులే మిగిలాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలే శరణ్యమనిపిస్తోంది” అంటూ ఆమె వ్యక్తం చేస్తున్న ఆవేదన ఆ ప్రాంత రైతాంగ పరిస్థితికి అద్దం పడుతోంది.
రైతును వేధిస్తున్న సమస్యలు:
నీటి ఎద్దడి : భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పచ్చని పొలాలు నెర్రెలుగా మారుతున్నాయి. ఒక వైపు పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు, మరో వైపు నీటి కోసం అదనపు ఖర్చులతో రైతు నడ్డి విరుగుతోంది. ఆపద కాలంలో ఆదుకోవాల్సిన రైతు భరోసా నిధులు సకాలంలో అందకపోవడం వల్ల రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
సమస్యకు పరిష్కారం ఏంటి..?
కూత వేటు దూరంలో ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టు నీటిని స్థానిక చెరువులకు మళ్లించడమే ఈ సమస్యకు ఏకైక శాశ్వత పరిష్కారమని చుట్టుపక్కల గ్రామాల రైతులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాప్రతినిధులు చొరవ ముఖ్యం..
అధికారులు తక్షణమే స్పందించి కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తేనే.. ఈ ప్రాంత రైతాంగం గట్టెక్కుతుందని వారు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు, సాగునీటి వనరుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

