రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

  • న్యూ ఇయ‌ర్ ని ఇలా సెలబ్రేట్ చేసుకోండి..

ఈ నూతన సంవత్సర వేడుకలను కేవలం తియ్యని రుచులతోనే కాదు, ఆరోగ్యకరమైన పోషకాలతోనూ జరుపుకోండి. బాదం పిండి, గాఢమైన డార్క్ చాక్లెట్, తాజా నారింజ తొక్క తురుము (జెస్ట్), మేపుల్ సిరప్‌ల అద్భుత కలయికతో రూపొందించిన ‘డార్క్ చాక్లెట్ బాదం ఆరెంజ్ కేక్’ మీ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రముఖ చెఫ్ కబితా సింగ్ రూపొందించిన ఈ రెసిపీ, పండుగ వేళల్లో నోరూరించే రుచిని అందిస్తూనే శరీరానికి మేలు చేసే బేకింగ్ విధానాన్ని పరిచయం చేస్తుంది.

పోషక విలువలు – రుచుల కలబోత

ఈ కేక్‌లో నెయ్యి, గుడ్లు, బాదం పిండిని వాడటం కార‌ణంగా ఇది ఎంతో మెత్తగా, తేమగా (Moist) ఉంటుంది. చాక్లెట్, తియ్యని రుచికి, నారింజ పండులోని సిట్రస్ ఘాటు తోడై ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అతి తక్కువ సమయంలో, సులభంగా తయారు చేసుకోగలిగే ఈ డెజర్ట్ పండుగపూట మంచి మూడ్ ని సెట్ చేస్తుంది.

మ్యాక్స్ హెల్త్‌కేర్ డైటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమద్దార్ ఈ కేక్ ప్రత్యేకత గురించి వివరిస్తూ.. “పండుగ ఆహారం అంటే అతిగా తినడం కాదు, తెలివైన ఎంపికలు చేసుకోవడం. బాదంలో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్-ఇ, హెల్తీ ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయి. ఇది తిన్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల వేడుకల్లో అతిగా తినే అలవాటును అదుపు చేయవచ్చు. బేకింగ్‌లో బాదం వాడటం వల్ల రుచితో పాటు సంపూర్ణ పోషణ లభిస్తుంది” అని పేర్కొన్నారు.

డార్క్ చాక్లెట్ బాదం ఆరెంజ్ కేక్ – రెసిపీ:

  • తయారీ సమయం: 60 నిమిషాలు
  • సర్వింగ్: 8 అంగుళాల కేక్ (సుమారు 10 ముక్కలు)

కావలసిన పదార్థాలు:

  • బాదం పిండి: 2 కప్పులు (180 గ్రాములు)
  • గుడ్లు: 4 (మధ్యస్థ పరిమాణం)
  • డార్క్ చాక్లెట్: 1/2 కప్పు (100 గ్రాములు)
  • మేపుల్ సిరప్: 1/2 కప్పు (113 మి.లీ)
  • నెయ్యి: 1/4 కప్పు (40 మి.లీ)
  • ఆరెంజ్ జెస్ట్ (నారింజ తొక్క తురుము): 1 టేబుల్ స్పూన్
  • ఆరెంజ్ జ్యూస్: 1/4 కప్పు (47 మి.లీ)
  • వెనిల్లా ఎసెన్స్: 1 టీస్పూన్
  • బేకింగ్ పౌడర్: 1 టీస్పూన్
  • ఉప్పు: ఒక చిటికెడు

తయారీ విధానం:

  • పొడి మిశ్రమం: ముందుగా ఒక గిన్నెలో బాదం పిండి, బేకింగ్ పౌడర్ మరియు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచండి.
  • తడి మిశ్రమం: మరొక గిన్నెలో గుడ్లను తీసుకుని బాగా గిలకొట్టండి. అందులో మేపుల్ సిరప్, వెనిల్లా ఎసెన్స్ మరియు ఆరెంజ్ జ్యూస్ వేసి కలపండి.
  • చాక్లెట్ తయారీ: డార్క్ చాక్లెట్‌ను మైక్రోవేవ్‌లో లేదా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరిగించండి. ఇందులో ఆరెంజ్ జెస్ట్ మరియు నెయ్యి వేసి బాగా కలపండి.
  • బ్యాటర్ సిద్ధం చేయడం: ఇప్పుడు పైన చెప్పిన మూడు మిశ్రమాలను (పొడి, తడి మరియు చాక్లెట్) ఒకదానితో ఒకటి కలిపి, ఎక్కడా ఉండలు లేకుండా మెత్తని పిండిలా (Batter) సిద్ధం చేసుకోండి.
  • బేకింగ్: ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన కేక్ టిన్ మౌల్డ్‌లోకి మార్చండి. లోపల గాలి బుడగలు లేకుండా ఒకసారి టిన్‌ను నేలకేసి తట్టండి.
  • ముందుగా వేడి చేసిన (Preheated) ఓవెన్‌లో 180°C వద్ద సుమారు 45 నిమిషాల పాటు బేక్ చేయండి.
  • కేక్ పూర్తిగా ఉడికిన తర్వాత బయటకు తీసి, కాసేపు చల్లారనివ్వండి.

అంతే! ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన డార్క్ చాక్లెట్ బాదం ఆరెంజ్ కేక్ రెడీ. దీనిపై కొన్ని బాదం పలుకులను చల్లి మరింత ఆకర్షణీయంగా అలంకరించుకోవచ్చు.

Leave a Reply