Tarakarama | శాశ్వత సాగునీటి లక్ష్యంగా ప్రాజెక్టు…

Tarakarama | శాశ్వత సాగునీటి లక్ష్యంగా ప్రాజెక్టు…

  • రైతులకు లభించని భరోసా నేడు నిర్వీర్యం!..
  • మూలకు చేరిన ఏడు లిఫ్టులు, 23 మోటర్లు..
  • ధ్వంసమైన ప్రధాన పైపులైన్లు…
  • 13,500 ఎకరాల ఆయకట్టు..
  • వేలాది కుటుంబాల జీవనాధారం ప్రశ్నార్థకం..
  • కాలుష్య కొరలతో కుదించుకపోతున్న కాలువలు..
  • నిర్వహణపై నిర్లక్ష్యం నీడలు…
  • మరమ్మత్తులు చేయాలంటున్న రైతాంగం…

Tarakarama | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రైతులు వర్షాలపై ఆధారపడని శాశ్వత సాగునీటి భరోసా కల్పించడం, రెండు పంటల వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం అనే దూరదృష్టి ఆశయంతో ప్రారంభమైన తారకరామ ఎత్తిపోతల పథకం నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురై నిర్వీర్యమవుతోంది. ఒకప్పుడు వ్యవసాయానికి ప్రాణవాయువుగా నిలిచిన ఈ పథకం, ఇప్పుడు నిర్వహణ లోపాలు, కాలుష్యం, అక్రమ వినియోగంతో రైతుల పాలిటే సమస్యగా మారుతోంది. ఎంతో సంయున్నత ఆశయంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతులమీదుగా ప్రారంభమైన తారకరామా ఎత్తిపోతల పథకం నేడు నిర్లక్ష్యం, ఆక్రమం, తోడు కాలుష్య కొరలో నిర్విర్ ఏమవుతున్న పరిస్థితులలో తిరిగి పునర్ధరించి ఆ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్న విజ్ఞప్తులు పెరుగుతున్నాయి.

పశ్చిమ రైతాంగానికి మేలు చేసే…

Tarakarama

కృష్ణా నది జలాలను ఎత్తిపోసి ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, విజయవాడ రూరల్ మండలాల్లోని సుమారు 13,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించి వరి, చెరకు, కూరగాయ, వాణిజ్య పంటలు విస్తృతంగా సాగు చేసే అవకాశం కల్పించడమే ఈ పథక ప్రధాన లక్ష్యం. 7 లిఫ్టులు, 23 మోటార్లతో కుడి ఎడమ కాలువలను నిర్మించడంతోపాటు కొత్తూరు, తాడేపల్లితో పాటు అటు మాధవరం వరకు సాగునీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. దీని ద్వారా వేలాది రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత, ఉపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వాలన్నదే ప్రాజెక్టు మౌలిక ఆశయం.

Tarakarama

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, ధర్మాల విద్యుత్ కేంద్ర వినియోగ జలాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించిన ఈ పథకానికి 1988 ఫిబ్రవరి 20న నాటి ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) శంకుస్థాపన చేశారు. భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్మాణ పనులు వేగంగా సాగాయి. అప్పట్లో సుమారు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టి, విజయవాడ చుట్టుపక్కల వ్యవసాయ భూములను శాశ్వతంగా సాగునీటి పరిధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ దశలో ఈ పథకం రైతులకు వరప్రసాదంలా మారి, వర్షాలపై ఆధారపడే పరిస్థితి నుంచి విముక్తి కల్పించింది. వరి, చెరకు, కూరగాయ పంటలు విస్తారంగా సాగు చేసి, ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.

నాడు 23 మోటార్లు – నేడు నిర్వీర్యం…

Tarakarama

తారకరామా ఎత్తిపోతల పథకంలో మొత్తం 23 భారీ మోటార్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం వాటిలో సగానికి పైగా పూర్తిగా పనిచేయడం లేదు. ముఖ్యంగా ఎడమ కాలువపై ఉన్న మోటార్లు ప్రారంభం నుంచే తరచూ మొరాయిస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. సరైన విద్యుత్ సరఫరా లేకపోవడం, కాలానుగుణంగా యాంత్రిక మరమ్మతులు చేయకపోవడం వల్ల మోటార్లు శిథిలావస్థకు చేరాయి. దశాబ్దకాలంగా నిర్వహణపై అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో, ఒకప్పుడు సాగునీటి ప్రాణవాయువుగా ఉన్న వ్యవస్థ నేడు మూగబోయింది. దీంతో ఆ ప్రాంతంలో పంట పొలాలకు సాగునీటి లభ్యత కష్టంగా మారడం విపత్కర పరిస్థితులలో సాగునీరు సమయానికి అందక పంటల సైతం ఎండిపోయే పరిస్థితిలు ఏటా కనిపిస్తున్నాయి.

కాలువల్లో పూడిక, గుర్రపుడెక్కల ఆక్రమణ…

Tarakarama

తారకరామా పథకానికి అనుబంధంగా ఉన్న ప్రధాన, ఉప కాలువల్లో గుర్రపుడెక్కలు, ముళ్లకంపలు విపరీతంగా పెరిగి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. అండర్ టన్నెల్స్‌లో పేరుకుపోయిన పూడిక తీత జరగకపోవడంతో పంట పొలాలు తరచూ ముంపునకు గురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాలువల ఆనవాళ్లే కనిపించని స్థితి నెలకొంది. అధికారికంగా పూడిక తీత, లైనింగ్ పనులు చేపట్టాల్సిన శాఖలు కేవలం కాగితాలపైనే చర్యలు తీసుకుంటున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా మరమ్మత్తులు పుడితేతలు చేపట్టాల్సిన అధికారులు అది కేవలం కాగితాలకే పరిమితం చేయడంతో ఈ ప్రాంత రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఎన్నిసార్లు ప్రభుత్వాలకి అధికారులకు మొరపెట్టినప్పటికీ వీరిని పట్టించుకునే వారే కరువయ్యారు ప్రభుత్వాలు మారుతున్న పథకం నిర్వియానికి గురవుతూ వస్తోంది.

కాలుష్య కోరల్లో సాగునీరు..

Tarakarama

కొండపల్లి ఆటోనగర్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు కాలువల్లోకి చేరడంతో సాగునీరు తీవ్రంగా కాలుష్యమవుతోంది. ఈ నీటితో సాగు చేసిన పంటలు దెబ్బతినడమే కాకుండా, అదే నీటిని తాగిన పశువులు మృతిచెందుతున్న ఘటనలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. సాగునీటి పథకంగా రూపుదిద్దుకున్న వ్యవస్థ నేడు కాలుష్య కాలువగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషితమైన నీటి ప్రవాహం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్న భూగర్భ జలాలు సైతం కలుషితం కావడం బోర్లు పంపుసెట్లు ద్వారా వస్తున్న నీటిని కొన్ని ప్రాంతాలలో తాగుతుండడంతో తరచూ అనారోగ్య సమస్యలు సైతం తలెత్తుతున్నట్లు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.

అక్రమ వినియోగం – దిగువ రైతులకు నీరు గల్లంతు..

Tarakarama

తారకరామా ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కాలువ గట్ల సమీపంలో ఇటుక బట్టీలు, అక్రమ చేపల చెరువులు, రొయ్యల చెరువుల యజమానులు కాలువల నీటిని అనధికారంగా మళ్లించుకోవడంతో దిగువ ప్రాంత రైతులకు సాగునీరు అందడం లేదు. నీటి నియంత్రణ గేట్లు ధ్వంసమైపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని, అక్రమ వినియోగంపై చర్యలు లేకపోవడంతో పథకం ఉద్దేశమే నిర్వీర్యమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రారంభంలో వేల ఎకరాలకి సాగునీరు అందించే ఈ పథక లక్ష్యం రాను రాను నీటి లభ్యత కొరవడం ఆ ప్రాంత రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురై పంటలు పండించలేక చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు.

రూ.5 కోట్లతో నే పునరుద్ధరణ సాధ్యం..

Tarakarama

రైతులు, స్థానిక నిపుణుల అంచనాల ప్రకారం కనీసం రూ. 5 కోట్ల నిధులు కేటాయిస్తే తారకరామా ఎత్తిపోతల పథకానికి సంబంధించి పూడిక తీత, మోటార్ల మరమ్మతులు, కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టి 2026–27 ఖరీఫ్ నాటికి మళ్లీ సాగునీరు అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వమైన స్పందించి ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో అవసరమైన ఈ పథకానికి నిధులను మంజూరు చేసి మరమ్మత్తులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బుడమేరు వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఎడమ కాలువను పూర్తిగా పునర్నిర్మించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రిజర్వాయర్ భవిష్యత్తుకు భరోసా..

తారకరామా ఎత్తిపోతల పథకానికి అనుబంధంగా శాంతినగర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఒక రిజర్వాయర్ నిర్మిస్తే భవిష్యత్తులో నీటి నిల్వ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని రైతులు సూచిస్తున్నారు. అలాగే 2025 వరదల్లో ముంపునకు గురైన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని, అక్రమ చేపల చెరువులు తొలగించి కాలువల లైనింగ్ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే కాలువ పరిధిలో ఎన్నో ఆక్రమణలు గురికావడంతో చిట్టచివరి పొలాలకు సాగునీరు లభ్యత తగ్గుతోంది. దీంతో వర్షాలు లేని సమయంలో సాగునీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంటుంది.

ఎన్టీఆర్ ఆశయాలకు పునర్జీవం కావాలి…

ఒకప్పుడు ఎన్టీఆర్ దూరదృష్టితో ప్రారంభమైన తారకరామ ఎత్తిపోతల పథకం, నేడు అధికారుల నిర్లక్ష్యానికి బలై రైతుల పాలిట శాపంగా మారుతోందని స్థానికులు వాపోతున్నారు. ఎంతో ఆశయంతో వేల ఎకరాలు సాగు కోసం రైతాంగానికి అన్ని ప్రయోజనాలు చేకూరే ఈ పథకం పై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ పథకాన్ని పునరుద్ధరించకపోతే, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వేలాది ఎకరాలు రానున్న రోజుల్లో పూర్తిగా సాగునీటి ఎడారిగా మారే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఎన్టీఆర్ కలగన్న సాగునీటి స్వప్నానికి నేటి పాలకులు మళ్లీ ప్రాణం పోయాలా? లేక ఈ చారిత్రక పథకాన్ని కాలగర్భంలో కలిసిపోవడానికి వదిలేయాలా? అన్న ప్రశ్నే నేడు ఈ ప్రాంత రైతుల నోట వినిపిస్తున్న ప్రధాన ఆవేదన.

తక్షణ మరమ్మత్తులు అవసరం..

Tarakarama

ఈ పథకానికి అన్ని వైపుల నుండి తక్షణ మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుడి ఎడమ కాలువల ద్వారా చివరివరకు నీరు అందించడంతోపాటు మిగులు జలాలు కూడా దిగువుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. అసంపూర్ణంగా పనులతో పాటు పగిలిన పైప్ లైన్లు లిఫ్టులు మోటార్లకు మరమ్మత్తులు చేయిస్తే సుమారు 15 వేల ఎకరాలకు తక్షణ సాగునీరు అందించే అవకాశం లభిస్తుంది.

పి జమలయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం

Leave a Reply