చిరు వ్యాపారులతో మాటా మంతి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడలోని ప్రముఖ బీసెంట్ రోడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులతో కలిసి మాట్లాడారు. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేవారు, చిన్న జనరల్ స్టోర్‌లు, చెప్పుల దుకాణాల యజమానులతో ఆయన ముచ్చటించారు.

కేంద్ర ప్రభుత్వం వస్తువులపై తగ్గించిన జీఎస్టీ (GST) కారణంగా ధరలు ఎంతవరకు తగ్గాయి, దాని వల్ల వినియోగదారులకు, వ్యాపారులకు కలిగిన ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన చింతజపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో మాట్లాడి, ప్రమిదలు, జనపనార (Jute) సంచులు అమ్ముతున్న ఆయన సమస్యలను తెలుసుకున్నారు.

అలాగే, మరో వీధి వ్యాపారి యక్కలి బాలకృష్ణతో, చెప్పుల షాపు యజమాని చదలవాడ వెంకటకృష్ణారావుతో మాట్లాడారు. చెప్పులపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం, వ్యాపారం తీరు గురించి ఆరా తీశారు. బట్టల షాపులోకి వెళ్లి అక్కడ సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్న గొడవర్తి లక్ష్మీతోనూ మాట్లాడారు.

ఆ తర్వాత కిరాణా షాపు నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్‌తో నిత్యావసర వస్తువుల ధరలు, జీఎస్టీ తగ్గింపు తర్వాత వచ్చిన మార్పుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా బీసెంట్ రోడ్‌లో కొనుగోలుకు వచ్చిన సాధారణ పౌరులతో కూడా చంద్రబాబు మాట్లాడి, వారితో ఫోటోలు దిగారు.

ఈ సంద‌ర్భంగా వారికి అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చిరు వ్యాపారుల సమస్యలు, ధరల తగ్గింపు వంటి ఆర్థిక అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఈ పర్యటన చేశారు.

Leave a Reply