Delhi |ఆరు శాస‌నాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి : చంద్ర‌బాబు

న్యూ ఢిల్లీ : మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుంటుంబం’లోని ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామన్నారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని తెలిపారు. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో… రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించామన్నారు. ప్రజలతో నాయకులు మరింత మమేకమవ్వడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని సూచనలు చేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న నేడు పార్టీ ముఖ్య నేత‌ల‌తో, కార్య‌క‌ర్త‌ల‌తో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

కడప మహానాడు అద్భుతంగా జరిగిందని.. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారన్నారు. సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు, కార్యకర్తలకు హ్యాట్సాఫ్ తెలిపారు సీఎం. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో నిరూపితమైందన్నారు. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చింది.

కాగా, తాను ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని నిర్ణ‌యించుకోవ‌డ‌మేన‌ని అన్నారు చంద్ర‌బాబు. ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తామని… ఆగస్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ కేలండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

రేపు కోనసీమ జిల్లాలో పర్యటన..
మరోవైపు కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం 12:50 గంటలకు ముమ్మిడివరం మండలం సి.హెచ్.గున్నేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో సీఎం దిగనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:05 గంటలకు కాట్రేనికోన మండలం చెయ్యారులో ఉపాధి హామీ పథకంలో పూడికతీత తీసే ఉపాధి కూలీలతో మాటామంతి నిర్వహిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు అర్హులకు పింఛన్ పంపిణీ చేయనున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి.

అక్కడే జిల్లాకు సంబంధించి పేదల సేవలో – బంగారు కుటుంబ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సీహెచ్‌ గున్నేపల్లి గ్రామంలో 3:35 గంలకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొననున్నారు. 5:15 గంటలకు గున్నేపల్లి హెలిప్యాడ్ నుంచి తిరిగి ప్రయాణం కానున్నారు. జిల్లాలో సుమారు ఐదు గంటల పాటు సీఎం పర్యటన జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *