పలమనేరులో వివాహిత దారుణహత్య…

పలమనేరులో వివాహిత దారుణహత్య…
చీటీల లావాదేవీలే కారణమా?
పెద్దపంజాణి, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గ పరిధిలో వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. పెద్దపంజాని మండల కేంద్రానికి చెందిన చంద్రమ్మ (సుమారు 33-35 సంవత్సరాలు) అనే మహిళను పథకం ప్రకారం హత్య చేసి, మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దపంజాని మండలం ముద్దేపల్లి గ్రామానికి చెందిన చంద్రమ్మ టైలరింగ్ వృత్తి నిర్వహిస్తూ, అదనంగా చీటీల వ్యాపారం, వడ్డీ లావాదేవీలు చేసుకుంటూ జీవనం సాగించేది. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

అయితే భర్తతో మనస్పర్ధల కారణంగా గత నాలుగు సంవత్సరాలుగా వేరుగా నివసిస్తోంది. ఇటీవల గ్రామానికి చెందిన శంకరప్ప కుమారుడు సుబ్రహ్మణ్యం (20) వద్ద చంద్రమ్మ కొంత నగదు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేయడంతో, సుబ్రహ్మణ్యం పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. నిడుగుంట గ్రామంలో నగలు తీసుకురావాల్సి ఉందని నమ్మబలికి, తన ద్విచక్ర వాహనంపై ఆమెను తీసుకెళ్లాడు. మార్గమధ్యలో లింగాపురం సమీపంలో చంద్రమ్మపై దాడి చేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
అనంతరం తన ఇద్దరు స్నేహితుల సహాయంతో మృతదేహాన్ని పలమనేరు రూరల్ మండలం జగమర్ల అటవీ ప్రాంతంలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. హత్య అనంతరం గ్రామానికి చేరుకున్న సుబ్రహ్మణ్యం, తెలియని వ్యక్తులు తనపై దాడి చేసి చంద్రమ్మను సుమో వాహనంలో తీసుకెళ్లారని అబద్ధపు కథ చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే చంద్రమ్మ రెండు రోజులుగా కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చంద్రమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుబ్రహ్మణ్యంతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చీటీల లావాదేవీలు, డబ్బు వ్యవహారాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసును సిఐ పరశురాముడు, ఎస్సై మారెప్పలు దర్యాప్తు చేస్తున్నారు.
