t20 final| నేడు భారత్, న్యూజిలాండ్ తుది పోరు

t20 final| నేడు భారత్, న్యూజిలాండ్ తుది పోరు
టైటిల్‌పై కన్నేసిన ఇరు జట్లు
మ్యాచ్ సమయం: రాత్రి 7:00 గంటలకు
వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్
లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్ యాప్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన టీ- 20 వరల్డ్‌కప్ క్లైమాక్స్‌కు చేరుకుంది. 20 జట్ల సమాహారంతో మొదలైన వరల్డ్‌కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల వ్యవధిలో అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమ్ఇండియా సొంతగడ్డపై ఛాంపియన్‌గా నిలవాలని ఊవిళ్లూరుతుంది. మరోవైపు సుదీర్ఘ కాలంగా అందని ద్రాక్షగానే మారిన వరల్డ్‌కప్ టైటిల్ కోసం కివీస్ వేచిచూస్తున్నది. ఎలాగైనా తొలిసారి ఐసీసీ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడాలని కివీస్ ఆశిస్తుంది. ఇరుజట్లు సెమీస్‌లో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్‌కు వచ్చాయి. ఇక్కడా అదే జోరు ప్రదర్శించాలని భావిస్తున్నాయి. ప్రపంచంలోని రెండు మేటి జట్ల మధ్య పోరు కోట్లాది మంది ఫ్యాన్స్‌ను అలరించడం ఖాయంగా కనిపిస్తుంది.

బ్యాటింగ్‌లో..
ఈ టోర్నీ ప్రారంభించిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఘోరంగా విఫలమౌతున్నాడు. అతడిపై జట్టుగా భారీగానే ఆశలు పెట్టుకుంది. కీలకమైన ఫైనల్లోనైనా చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక అదిరే ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ సంజు శాంసన్ జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఫైనల్లోనూ తనదైన ముద్ర వేయాలి. ఇక తొలిమ్యాచ్ మినహా టోర్నీలో చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ అందుకోవాల్సి ఉంది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్‌తో బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది.

బౌలింగ్‌లో..
బౌలింగ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా బౌలర్లు విఫలమవుతుండటం భారత్‌ను కలవరపెడుతోంది. ప్రధానంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, పేసర్ అర్షదీప్ సింగ్‌లు రాణించాల్సి ఉంది. వరుణ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఫైనల్ నేపథ్యంలో తుదిజట్టులో మార్పులు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

కివీస్ డేంజరస్ టీమ్
తొలి సెమీస్‌లో పటిష్టమైన దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్ జట్టు కూడా ప్రమాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ భీకర ఫామ్‌లో ఉన్నారు. సెమీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన అలెన్‌తో భారత్‌కు ప్రమాదం పొంచి ఉంది. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్తో కివీస్ జట్టు బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. అటు బౌలింగ్ విభాగంలో మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ వంటి ప్రపంచస్థాయి మేటి బౌలర్లు ఆ జట్టు సొంతం. కెప్టెన్ మిచెల్ శాంట్నర్తోనూ భారత్ బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాలి.

మంచు ప్రభావం
నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ ఎర్ర, నల్ల మట్టి మిశ్రమంతో రూపొందించారు. ఇది బ్యాటింగ్‌కు స్వర్గధామంలా కనిపిస్తోంది, కాబట్టి పరుగుల వరద పారే అవకాశం మెండుగా ఉంది. అయితే, పిచ్ కంటే మైదానంలోని పరిస్థితులే మ్యాచ్ ఫలితాన్ని శాసించేలా ఉన్నాయి. రాత్రి వేళ మంచు (Dew) కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే చాలా మ్యాచ్‌ల ఫలితాలను మంచు ప్రభావితం చేసింది. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం దాదాపు ఖాయం. ఒక మెగా ఫైనల్ ఫలితం కేవలం టాస్‌పైనే ఆధారపడితే అది క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే అంశమే.

వేడి వాతావరణం..
అహ్మదాబాద్‌లో ఆదివారం వాతావరణం చాలా వేడిగా, పొడిగా ఉండనుంది. అక్యూవెదర్ నివేదికల ప్రకారం, వర్షం పడే అవకాశం అస్సలు లేదు. పగటి ఉష్ణోగ్రతలు 34 నుండి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. సాయంత్రం కూడా వాతావరణం 30 డిగ్రీల వరకు ఉంటూ కాస్త ఉక్కపోతగా అనిపించవచ్చు. వర్షం ముప్పు లేనందున అభిమానులు పూర్తి మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు.

