T.F.I | నిర్మాతలతో ఎగ్జిబిటర్ల భేటీ.. బంద్ నిర్ణయం వాయిదా !

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్‌లో నేడు (బుధ‌వారం) కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొని తమ సమస్యలను, డిమాండ్లను స్పష్టంగా వ్యక్తపరిచారు.

థియేటర్ లాభాల పంపిణీ, ప్రస్తుత అద్దె వ్యవస్థను రద్దు చేసి షేరింగ్ వ్యవస్థను అమలు చేయడం, మొదటి వారం కలెక్షన్లలో అద్దె వ్యవస్థకు బదులుగా వాటా ఇవ్వాలనే ఆలోచనపై చర్చలు జరిగాయి.

ఈ సందర్భంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చేయాలని ప్రాథమికంగా భావించిగా, నిర్మాతలు అలాంటి నిర్ణయాన్ని ఈ దశలో తీసుకోవద్దని కోరారు.

పరిశ్రమ సమగ్రాభివృద్ధికి అందరికీ అనుకూలంగా ఉండే నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో నిర్మాతలు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో థియేటర్ బంద్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని తీర్మానించారు.

కాగా, రేపు మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్మాత‌లు నిర్ణయించారు. రేపటి సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయని, సమస్యలకు ఓ తుది పరిష్కారం వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply