ఈ భూమిపైన పుట్టిన ప్రతివ్యక్తి మరణిస్తాడు. కాలమా జననమరణాలకు సాక్షిగా నిలుస్తుంది. అయితే వ్యక్తి తన జీవితకాలాన్ని గడిపిన విధానమే అతను బ్రతికాడా, జీవించాడా అన్నది నిర్ణయిస్తుంది. ఆహార నిద్రాభయ మైధునాదులకు లోబడి, విషయ లాలసతయే జీవిత పరమావధిగా, ఆశల వలయంలో ఏ లక్ష్యమూ లేక పశుపక్ష్యాదుల వలె, భూమిపై లభిస్తున్న సుఖాలే శాశ్వతమనే భ్రమలో, వాటినే సమాదరిస్తూ.. తన విజయాలన్నింటికీ తానే కర్తనని భావిస్తూ, పరాజయాలకు ఇతరులను నిందిస్తూ… తన జన్మమూలాన్ని పట్టించుకోని వ్యక్తిది బ్రతుకు. అలాకాక, తనకు లభించిన జీవితాన్ని సమాజహితంగా, సదుపయోగం చేసుకుంటూ… ప్రయోజన భరితమైన జీవితాన్ని సార్ధకం చేసుకోవాలనే భావనతో ఉద్యమించే వ్యక్తి జీవిస్తున్నట్లుగా భావించాలి. బ్రతికే వ్యక్తి బంధనాలలో చిక్కుకుంటాడు.. జీవించేవ్యక్తి నేను చేస్తున్నాననే కర్తత్వ భావనకు అతీతుడై స్వేచ్ఛగా జీవిస్తాడు. బ్రతకడం మిథ్యాజీవితం కాగా జీవించడం సత్యజీవితంగా చెప్పుకోవచ్చు.
గతకొన్ని శతాబ్దాలుగా తేజస్వంతమైన సనాతన ధార్మికచింతనలో సార్థపరత, ఉదాసీనత చోటుచేసుకున్నాయి. ఫలితంగా స్వప్రయోజనాల ప్రాధాన్యత ఇచ్చి, సామాజిక చైతన్యం లోపించింది. వక్రభాష్యాలు అనేకం మతబోధలుగా పరిణమించి.. భౌతిక జీవన ప్రగతికీ, ఆధ్యాత్మిక సుగతికీ, సమాజకళ్యాణానికి పనికిరాకుండా పోయాయి. అలవిమాలిన భయాలు, సంకుచిత మనస్తత్వాలు వ్యక్తిలో స్థిరపడి, నడతలో కుటిలత్వాన్ని పెంచుతున్నాయి. దానితో సునాయాసంగా బ్రతికేందుకు విచ్చలవిడితనం ఇచ్చింది.
బ్రతకడ మెలాగైనా బ్రతకవచ్చు.. జీవించడానికి దృఢసంకల్పం కావాలి. నైతికబలం కావాలి. జిజ్ఞాస కావాలి. ఉదాత్తమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు శ్రమించాలి… తపించాలి. సాధించిన ఫలితాన్ని సమాజానికి అంకితంచేయాలి. అయితే ఆ మార్గం సులువైనది కాదు. పదునైన కత్తి అంచువంటిది. దానిపై పయనించడం ప్రమాదకరమని, లక్ష్యం చేరడం కష్టసాధ్యమని పెద్దలు చెపుతారు. అలాగని బెదిరిపోతే స్వప్నం చెదిరిపోతుంది. పిరికివాని జీవితానికి అర్థం, పరమార్థం ఉండదు. కాబట్టి లే, మేల్కొను.. ఇదివరకా మార్గంలో ప్రయాణించిన వారినుండి జ్ఞానాన్ని పొందు.. స్పష్టను సాధించి నీదంటూ ప్రత్యేకమైన మార్గంలో లక్ష్యాన్ని సాధించు, అంటుంది కఠోపనిషత్తు. అనుభూతి శిఖరాగ్రాన్ని చేరుకోవాలి, జన్మను సాఫల్యం చేసుకోవాలి అంటే సోమరితనాన్ని జయించాలి. ధైర్యసాహసాలు అవసరం.. అత్యంత గహనమైన లక్ష్యాన్ని చేరేందుకు మానసిక సన్నద్ధతయే ముఖ్యమైనది. భయం లక్ష్యసాధనకు పరమశత్రువు. సాధించాలనే సాహసవంతులకు ఎవరి చేయూతా అవసరం లేదు. ఏ శక్తీ వారి ప్రయత్నాన్ని ఆపజాలదు. అంతర్గత శక్తిసామర్ధ్యాలను జాగ్రతం చేసుకున్న వ్యక్తులు జయాపజయాలకై వెంపర్లాడకుండా తమ మార్గాన తాము ముందుకు సాగుతారు.
వ్యక్తి బ్రతికినా, జీవించినా చివరగా యమసదనాన్ని దర్శించాల్సిందే. సాహసులైనా, సంశయాత్మకులైనా, దుర్బలులైనా, బలవంతులైనా మత్యువు కరాళదంష్ట్రలకు చిక్కాల్సిందే. మర్త్యులంటేనే మృత్యువు దగ్గరికి వెళ్ళేవారు. ఆశానిరాశలు, గెలుపోటముల భయాలు వ్యక్తిలో క్షుద్రత్వాన్ని నింపుతాయి. క్షుద్రం హృదయదౌర్బల్యం అంటుంది, గీత. మేల్కొని ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తించండి, సుషుప్తిలో ఉన్నవారు మేల్కొనండి.. లక్ష్యాన్ని సాధించేదాకా విశ్రమించకండి, సమాజానికి కావలసింది ధీరులు, ఇనుప నరాలు, ఉక్కు కండరాలు కలిగిన వ్యక్తులు మాత్రమే, అంటారు వివేకానంద. అమరము, అజేయము, సర్వశక్తివంతము, సర్వశుద్ధమునైన ఆత్మశక్తిని గుర్తించండి.. బలమే బలాన్ని గౌరవిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని మించినదేదీ లేదు. నిర్భయత్వం, ప్రేమ, సేవాతత్పరత ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు. సాంసారిక హృదయాలు సంసారాన్ని చూచి బెదురుతూ బ్రతకడం నేర్పుతాయి. ఆధ్యాత్మికత మానవీయ భావాలతో.. ఐహిక పారమార్థిక జీవితాన్ని రసమయం చేసుకోవడానికి ప్రేరణనిస్తుంది, మార్గం చూపుతుంది.. శరీరాన్ని దానికొక ఉపకరణంగా చూపుతుంది. జీవితంలో సహజమైన ద్వంద్వాలను సమతాబుద్ధితో స్వీకరించే స్థైర్యాన్ని ప్రసాదిస్తూ.. సాధనాపర్వంగా తీర్చిదిద్దుతుంది. అలాంటి స్థైర్యం మనలో ఆవిష్కృతమై జీవించడానికి ప్రేరణనివ్వాలని ప్రార్థిస్తూ..
- పాలకుర్తి రామమూర్తి