TG | శరవేగంగా మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో కారిడార్ల స‌ర్వే ప‌నులు

  • మార్చి నెలాఖరులోగా ప్ర‌భుత్వానికి మూడు మెట్రో లైన్ల డీపీఆర్‌లు

మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో కారిడార్లలో సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఈ మార్గంలో ట్రాఫిక్ సర్వే, గ్రౌండ్ కెపాసిటీ పరీక్షలు పూర్తవుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. జేబీఎస్ – మేడ్చల్ (24 కి.మీ), జేబీఎస్ – శామీర్ పేట్ (21 కి.మీ) మెట్రో కారిడార్‌ల డీపీఆర్‌ల తయారీకి అవసరమైన వివిధ రకాల సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణించే విధంగా ఈ మెట్రో కారిడార్లను నిర్మించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా, డిపిఆర్‌ల తయారీకి ప్రత్యేకంగా మూడు రకాల అధ్యయనాలు (ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు, ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ స్టడీ) అవసరమవుతాయన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్‌, సమీర్‌పేట్‌ మెట్రో కారిడార్లు, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ – ఫ్యూచర్‌ సిటీ రూట్‌తో సహా మూడు మెట్రో లైన్ల డీపీఆర్‌లను మార్చి నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *