Surrender | 41మంది మావోయిస్టుల సరెండర్
డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో..
జనజీవన స్రవంతిలోకి..
Surrender | హైదరాబాద్, ఆంధ్రప్రభ : నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి తెలంగాణలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన 41 మంది మావోయిస్టు (41 Maoists) క్యాడర్ ఇవాళ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరారు. ఈ లొంగుబాటు (Surrender) తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని నష్టం వాటిల్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
లొంగిపోయిన వారిలో దాదాపు 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ (DVCM), 21 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కోర్సా లచ్చు (CYPCM), కనికారపు ప్రభంజన్, అర్బన్ ఏరియా, పీడీఎస్‌యూ సభ్యుడితో పాటు ఆరుగురు డివిజనల్ కమిటీ సభ్యులు (DVCMs), 12 మంది ఏరియా కమిటీ సభ్యులు (ACMs) 23 మంది పార్టీ సభ్యులు (PMs) ఉన్నారు. ఈ మేరకు వారి నుంచి ఒక INSAS LMG గన్స్, మూడు AK-47 రైఫిల్స్, ఐదు SLR రైఫిల్స్, ఏడు INSAS రైఫిల్స్, ఒక BGL గన్, నాలుగు UBGL తుపాకులు, ఒక 303 రైఫిల్, రెండు సింగిల్ షాట్ రైఫిల్స్, 24 ఎయిర్ గన్స్, 733 BGL షెల్స్, 08 షెల్స్ సహా భారీ మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల మొత్తం విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) మాట్లాడుతూ.. మిగిలిన మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారకికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. ప్రతి ఒక్కరికీ పునరావాసం ప్యాకేజీ (Rehabilitation package) కింద లొంగిపోయిన 41 మందికి కలిపి ప్రభుత్వం తరఫున మొత్తం రూ.1.46 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్లుగా తెలిపారు.

