వికారాబాద్ కూరగాయల మార్కెట్‌పై ఆకస్మిక తనిఖీ

వికారాబాద్, ఆంధ్రప్రభ : రైతులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం వికారాబాద్ కూరగాయల మార్కెట్ (బీట్లు)ను ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ కూరగాయల ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించి, క్రయవిక్రయాల వివరాలను మార్కెట్ కమిటీ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.

అదేవిధంగా వెజిటేబుల్ మార్కెట్ కమిషన్ దారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రైతుకు సరైన ధర వచ్చేలా సహకరించాలని, ముట్టిలు మరియు హమాలీ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం నిర్వహించాలని, ప్రభుత్వం నిర్ణయించిన కమిషన్ మాత్రమే వసూలు చేయాలని హెచ్చరించారు.

ప్రతి విక్రయానికి సంబంధించి తడ్‌పట్టి (రసీదు) తప్పనిసరిగా రైతులకు ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కమిషన్ దారుల లైసెన్సులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు లాభపడే విధంగా అందరూ కృషి చేయాలని సూచించారు.

త్వరలో కూరగాయల మార్కెట్‌లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో వెజిటేబుల్ మార్కెట్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిష్టారెడ్డి, కమిషన్ ఏజెంట్లు మరియు మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది రాజు, ఆనంద్, రవి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply