స్వీయ పర్యవేక్షణలో సుప్రీం విచారణ..

ఆంధ్రప్రభ, కోల్కతా : కోల్‌కతాలోని ఆర్‌.జి. కార్ మెడికల్ కాలేజీలో మెడికో పై హత్యాచారం-హ‌త్య‌ కేసులో, దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత పై వ్యవస్థాపర లోపాలపై చేపట్టిన సుమోటో కేసు విచారణను సుప్రీం కోర్టు నవంబర్ నెలకు వాయిదా వేసింది.

గత ఏడాది ఆగస్టు 9, 2024న, ఆసుపత్రి సెమినార్ హాల్లో ఒక పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికో మృతదేహం లభించడంతో ఈ అత్యంత హేయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆసుపత్రిలోని సివిక్ వలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కు అప్పగించారు. విచారణానంతరం, సీల్దా సెషన్స్ కోర్టు జనవరి 20, 2025న నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించి, అతనికి జీవిత ఖైదు శిక్షను విధించింది. ఈ తీర్పుపై సంతృప్తి చెందని CBI, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఈ శిక్షను మరణశిక్షకు పెంచాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి.

సుప్రీంకోర్టు జోక్యం

సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను ఆగస్టు 19, 2024న స్వయంగా (సు మోటోగా) పర్యవేక్షణ ప్రారంభించింది. ఈ కేసులో వెలుగు చూసిన వ్యవస్థాపర లోపాలను సరిదిద్దడమే లక్ష్యంతో ఈ నోటీసు జారీ చేసి.. విచారణ మొదలెట్టింది.

కోల్‌కతా ఘటన దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలకు దారితీయడంతో, సుప్రీంకోర్టు ఆగస్టు 20, 2024న జాతీయ టాస్క్ ఫోర్స్ (National Task Force – NTF) ను ఏర్పాటు చేసింది. దేశంలోని వైద్య నిపుణులందరి భద్రత, రక్షణ, పని పరిస్థితులపై ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను (ప్రోటోకాల్) రూపొందించడానికి ఈ టాస్క్ ఫోర్స్‌ను ఆదేశించింది.

Leave a Reply