Sunday Magazine 28 DEC 2025 | ఆదివారం సంచిక 28 డిసెంబర్ 2025

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్రభ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు..
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.
Sunday Magazine సంచికలో…
1.ముఖపత్ర కథనం – (I)
2.ముఖపత్ర కథనం- (II)
3.మనసు-మాట శీర్షిక
4.ధర్మం చేయండి బాబూ… (కథ)
5.కబుర్లు – శీర్షిక
6.సన్నిహితం… శీర్షిక
7.మెదడుకు మేత-సామెత.. శీర్షిక
8.వినరో భాగ్యము – శీర్షిక
Sunday Magazine 28 DEC 2025
1.ముఖపత్ర కథనం – (I)

అనంతమైన పాలపుంతలలో గల కోట్ల నక్షత్రాల చుట్టూ అనేక కోట్ల గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. అదే విధంగా మనం సౌర కుటుంబంలో గల నవగ్రహాలలో భూమిపై ఒక జీవిగా జన్మించాం. అయితే జ్ఞానం అనే మూడో నేత్రంతో అద్భుతమైన విశ్వ రహస్యాలను బహు క్రొద్దిగా తెలుసుకున్నాం. మనకు జీవాధారం ప్రత్యక్ష భగవానుడైన ఆదిత్యుడు.
ఆయన దక్షిణాయణం నుండి ఉత్తరాయణమున తన కిరణాలను ప్రసరింప చేయడానికి విచ్చేసే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సత్యయుగంలో దేవ,దాన, మానవులకు తపస్సు చేసే శక్తి, భగవంతుని ప్రత్యక్షపరచుకొని చూసే శక్తివంతమైన దృష్టి ఉండేది.
కానీ త్రేతా యుగము నుండి కలియుగమునకు అటువంటి చక్షువులు, దృష్టి క్రమంగా లోపిస్తూ వచ్చింది. ద్వాపరి యుగములోనే శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూడడానికి భీష్ముడు ధృతరాష్ట్రుడు అర్జునుడు మొదలైన వారికి దివ్యదృష్టిని ప్రసాదించాడు. కావున ఈ కలియుగంలో అల్పమానవులమైన మనకు ఒకవేళ భగవంతుడు ప్రత్యక్షమైనా, దర్శించే శక్తి లేదు.
అందుకే కలియుగంలో చిత్తశుద్ధితో ఒక్క భగవన్నామ స్మరణ చేస్తే చాలు ముక్తి, మోక్షము కలుగుతాయి అన్నారు. ఇక పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి సమస్త మానవులకు దర్శనమిస్తాడు. ఇక్కడ కోటి అంటే సంఖ్య కాదు, సమూహము అని అర్థం.
ముక్కోటి అనగా ముప్పది మూడు మందితో శ్రీమహావిష్ణువు కదలి వస్తాడు. వారే ఎనమండుగురు అష్టవసువులు. ఏకాదశ రుద్రులు. ద్వాదశ ఆదిత్యులు, ఇద్దరు అశ్వనీదేవతలు. వీరంతా సత్యలోకానికి ఆవల మకరరాశిలో నున్న వైకుంఠ లోకం నుండి సత్యవ్రతులై నిత్య భగవన్నామ స్మరణలోనున్న భూలోకవాసులను కటాక్షించడానికి విచ్చేస్తారు. ఆ నిత్య భగవన్నామ స్మరణ భూలోక దేవాలయాల్లో సదా నిలిచి ఉంటుంది. అటువంటి వైకుంఠము వైపు ఎవరైతే దృష్టిని నిలుపుతారో వారు నిత్యానందులై ఉంటారు.
“తద్విష్ణో పరమ పదం సదాపశ్యంతి సూరయా”
ఋగ్వేదం
దేవతలు సదా ఆ వైకుంఠం వైపు దృష్టి నిలిపి ఉంటారు. ఇక మానవమాత్రులమైన మనం పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఆ ముక్కోటి దేవతలను దర్శించుకునే మార్గమును వేద అంతర్గతమైన సనాతన వాజ్మయం విపులపరిచింది. త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతిలో మానవుడు శుచిర్భూతుడై నామ స్మరణ చేయడం కూడా చాలా కష్టతరము.
బియ్యపు రాశిలో దాగున్న ముర అనే రాక్షసుని విస్ణువు నుండి జనించిన శక్తి సం హరించిన రోజున ఈ వైకుంఠ ఏకాదశి. దేవదానవుల సముద్ర మధనంలో హాలహలం, అమృతం రెండూ జనించిన రోజున ముక్కోటి ఏకాదశి. మహాశివుడు పదునాలుగు లోకాలను రక్షించడానికి హాలాహలమును మ్రింగిన రోజు. ఇటువంటి వైకుంఠ ఏకాదశి రోజున తామస, రాజస, గుణాలను జయించి సత్త్వ గుణ సంపన్నుడై తమ మనోనేత్రాలతో ముక్కోటి దేవతలతో బాటు శ్రీమహావిస్ణువును దర్శించాలి.
దానికి మార్గం ఏకాదశి ఉపవాసం. ఈ రోజున అన్నం భుజించరు. బియ్యంలో ముర అనే అసుర అంశ దాగుని ఉందని మనం తెలుసుకున్నాం. అందుకే బియ్యంతో చేసే ఏ పదార్థం కూడా తినరు. ఒక్క తులసి తీర్థం మాత్రమే సేవిస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమైనా దానిని మితిగా భుజించకపోతే తమోగుణం ఆవహించి అజ్ఞానం ప్రబలుతుంది.
ఈ ముక్కోటి ఏకాదశిన పూర్తిగా ఉపవసించి, ద్వాదశిన అతిథులతో బాటు భుజించాలి. ఇక ఉపవాస దీక్షలో పురాణ పఠనం, గురువుల ద్వారా ఉపదేశం పొందిన మంత్రజపం, ధ్యానం చేయాలి. ముఖ్యంగా విష్ణు సహస్ర నామ పారాయణం పవిత్రతను చేకూర్చుతుంది. ఈ పుత్ర ఏకాదశి రోజున దంపతులు ఉపవాసం చేసి జప, తపములు ఆచరిస్తే సంతానం కలుగుతుంది. మానవులు దేహాత్మ భావన వల్ల తన స్వస్వరూప జ్ఞానము కోల్పోయి లౌకిక జీవ భావన కలిగి భగవంతుని చింతనకు దూరమగుచున్నారని విజ్ఞులు తెలియజేస్తున్నారు.
“జన్మానాం నరజన్మ దుర్లభం”
ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులలో నరజన్మ లభించడం పూర్వజన్మ సుకృతం. ఇటువంటి ఈ మనుష్య జన్మ బహు స్వల్పమైన కాల పరిమితి కలిగి ఉంది. కావున దైవ రూపమైన కాలమును అనుక్షణం సద్వినియోగం చేసుకోవడం వివేకి లక్షణం. ఆ సద్వినియోగం లోని భాగమే ఏకాదశి ఉపవాస దీక్షలు. ఇటువంటి దీక్షలు ధర్మాచరణకు దారి చూపుతుంది. ధర్మాచరణ వలన మనం ఆనందం పొందడమే కాక సమస్త జీవులకు ఆనందాన్ని కలుగజేస్తాం.
శ్రీ ఆదిశంకరుల అద్వైతం ప్రకారం మనసు అనే పదార్థం పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, వాటి వ్యాపారము, విషయములు, ఇవన్నియు కలిపి ప్రపంచము అని తెలుసుకుంది. ఈ ప్రపంచమే ఆత్మ చైతన్యము కలిగి ఉంది. ప్రతి జీవియందు ప్రపంచమును గుర్తించే ప్రకాశ శక్తియే చైతన్యమనే “ఆత్మ”.
ఆ ఆత్మ శక్తియే “నేను” ఈ నేను లేకపోతే ఇవి ఏవియూ ప్రకాశింపజాలవు. ఆ ప్రకాశమే “బ్రహ్మ” అనగా ఆ బ్రహ్మమే ప్రతి జీవిలోనూ ఉన్నదని అర్థం. అందువలన ఆ బ్రహ్మ స్వరూపమైన శ్రీ మహావిస్ణువును, ముక్కోటి దేవతలను చిత్తశుద్ధితో ఉపవాస దీక్షతో మన హృదయమనే అంతరాత్మలో దర్శించవచ్చు అని శాస్త్రాలు విశదపరుస్తున్నాయి.
మయ్యేవ సకలం జాతం
మయి సర్వం ప్రతిష్టితం
మయి సర్వం లయం యాత
తద్బ్రహ్మాద్వయం పస్మ్యహం
-కైవల్యోపనిషత్తు
నాయందే గల అధిష్టాన బలము వలన, సర్వము సృష్టి పొందుచున్నది. అన్నీ నాయందు నిలిచి యుండును. నాయందే లీనమైపోవుచున్నవి. ఆ అద్వితీయబ్రహ్మము నేనే. కన్ను చూసేదే స్థితి. కన్ను మూస్తే లయం. ఈ సృష్టి క్రియను గమనించేదే “ఆత్మ”.
-వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు
2.ముఖపత్ర కథనం- (II)

మరో మూడు రోజుల్లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది. అందరిలో ఉగ్జయిట్ మెంట్ ! ఎలా జరుపుకోవాలో యూత్ ప్లాన్ లు వేయడం ప్రారంభించేశారు. మందు ప్రియులు నాలుకలతో తమ పెదవులు తడుపుకొంటున్నారప్పుడే. రోజూ తాగినా, న్యూ ఇయర్ రోజు అర్థరాత్రి త్రాగితే, ఆ కిక్కే వేరప్పా!
చాలా దేశాలు ప్రపంచంలో జార్జియన్ క్యాలెండర్ ను తమ సివిల్ క్యాలెండర్ గా పరిగణిస్తాయి. అందులోని తొలినెల, తొలిరోజు(అదేనండీ జనవరి ఫస్ట్)ను న్యూ ఇయర్ డే గా జరుపుకొంటాయి. మెక్సికో, న్యూజిలాండ్ లాంటి చోట్ల బాణాసంచా కాల్చడానికే కోట్లు ఖర్చు పెడతారు. వారి సంప్రదాయంలో ఆరంభాలకు, ప్రవేశద్వారాలకు అధి దేవత ‘ జానస్ ‘ ఆయన పేరు నుండే ‘ జనవరి ‘ (దాన్ని జాన్యువరి అని పలకాలేమో) ఏర్పడింది. అలా ప్రతినెల పేరు వెనక ఒక చరిత్ర ఉంది. రావు గోపాల రావు గారన్నట్టు ‘ చరిత్ర అడక్కు, చెప్పేది విను ” యూత్ జనవరిని జాన్ అంటారండీ!
ఇక మన కొత్త సంవత్సరం ‘ ఉగాది ‘ . ఉగం అంటే నక్షత్రం. ఉత్తరాయణం, దక్షిణాయనముల ద్వయం యుగాది. వాటి ప్రారంభమే యుగాది. ఈరోజే వేదాలను దొంగిలించి పారిపోతున్న సోమకాసురుడిని మహావిష్ణువు చంపి, వాటిని బ్రహ్మ దేవుడికి ఇచ్చాడని ఐతిహ్యం. మనకిదంతా ట్రాష్! ఇంగ్లీషు వాడి న్యూ ఇయరే జోష్. ఉగాది రోజు పొద్దున ఎవరూ నిద్ర లేవరండోయ్. ఎవరైనా చాదస్త శిఖామణులుంటే శుభాకాంక్షలు చెబుతారు పాపం.! కొందరు దీనినీ ఆంగ్లీకరించి ” విష్ యూ హ్యాప్పీ యుగాడీ” అని చెబుతారు.
మనకు ఉగాది పచ్చడి తినాలంటే, యాక్…! అదే న్యూ ఇయర్ కేకయితే కేక! ఇదంతా ఒక ప్రహసనం. సరిగ్గా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు (ఒక్క సెకను కూడ అటు ఇటు కాదు..) “హ్యాప్పీ న్యూ ఇయర్…” అని గొంతులు చించుకుని అరుస్తారు. మన సోకాల్డ్ సివిలైజ్డ్ పీపుల్. మందు బాటిళ్ళు, మూతలు ఎగరేయబడి, బుస్సున పొంగుతాయి.
ఇక నగరాల్లో ఫ్లై ఓవర్ల మీద బైకు రేసులు.. రయ్యి రయ్యిన దూసుకు పోతారు (కొత్త సంవత్సరంలోకి) కొందరు ఉత్సాహవంతులు, సరిగ్గా అర్థరాత్రి ఫోన్ చేసి మనకు శుభాకాంక్షలు…! ఇక సోషల్ మీడియా అంతా ఇవే ! ముఖ పుస్తక మహాశయుడు నూతన సంవత్సరం సంఖ్య అందంగా డిజైన్ కలిపి, రెడీమేడ్ శుభాకాంక్షలు తయారు చేసి ఇస్తాడు మనకు శ్రమ లేకుండా.
న్యూ ఇయర్ నాడు ప్రైవేట్ సెక్టార్ లో కాదు) ప్రభుత్వ అధికారులు వారి బాస్ లను కలిసి గ్రీటింగ్స్ చెప్పాలి. ఆయన దృష్టిలో పడాలి. మంత్రుల పేషీల్లో పడిగాపులు పడుతుంటారు పాపం. అందుకేనేమో, ఆరోజు సెలవు దినం కాదు. సెలవిస్తే, సెలబ్రేషన్ ఎట్లా? అదీ ఒక అనధికారిక ప్రోటోకాల్ అయి కూర్చుంది.
మా చిన్నప్పుడు ‘ గ్రీటింగ్ కార్డ్స్ ‘ అని ఉండేవి. రూపాయి నుండి వెయ్యి రూపాయల వరకు. దానికి చక్కని కవర్ నీలి రంగులో. దానిమీద స్టాంపులంటించి అడ్రస్ రాసి బుక్ పోస్ట్ లో పంపేవారు. బంధుమిత్రులకు. ఇప్పుడు బుక్ పోస్ట్ తీసేసారు. బుక్ షాపుల వాళ్ళు బోలెడు సంపాదించేవారు. స్మార్ట్ ఫోన్ వచ్చి ఇలాంటివన్నీ సం హరించింది.
మన గృహిణీమణులు ఉగాది నాడు ఇంటి ముందు ముగ్గు వేస్తారో లేదో, తెలీదు గానీ, న్యూ ఇయర్ రాత్రంతా చలిలో కూర్చుని రంగురంగుల రంగవల్లులేస్తారు. స్టార్ హోటళ్ళ వాళ్ళు డిసెంబరు 31 సాయంత్రము నుండి జనవరి ఒకటి మధ్యాహ్నము వరకు తిండీ తిప్పలూ..ఏర్పాటు చేసి వినోదాల విందు చేస్తారు. ఆరోజు టేబుల్ దొరకాలంటే కష్టం.
విచిత్రం ఏమిటంటే చాలా మంది ఆ రోజు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు వెళ్ళి దైవదర్శనం చేసుకుని తరిస్తారు. ఉగాది నాడు మాత్రం అంత సీన్ ఉండదు. పాపం శ్రీ కృష్ణ పరమాత్మకివన్నీ తెలియక గీతలో స్వధర్మేనిధనంశ్రేయ: పరధర్మోభయావహ: అని చెప్పారు. మన స్వంత ధర్మం కోసం చనిపోయినా పరవాలేదు గానీ పరధర్మాన్ని అనుసరించడం భయాన్ని కలిగిస్తుందని దానర్థం.
ఇప్పుడది రివర్స్ అయింది. పరధర్మం కోసం చస్తున్నాం. స్వధర్మం ఎప్పుడో వదిలేశాం. ” ఏమయ్యా! ఇన్ని నీతివాక్యాలు చెబుతున్నావ్, నీవు జీతం/ పెన్షన్ తీసుకొనేది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమే కదా! డేట్ల ప్రకారమే మనం అన్నీ చేస్తాం కానీ తిథుల ప్రకారం కాదు కదా?” అని కోప్పడకండి సారూ… న్యూ ఇయర్ జరుపుకోవద్దని నేను అనను. కానీ, మరీ అతి చేయకండి అని నా హంబుల్ రిక్వెస్టు. మీ అందరికీ ” నూతన ఆంగ్ల సంవత్సరాది శుభకామనలు” అదేమిటో, తెలుగులోనైనా చెబితే అదోతుత్తి !
–పాణ్యం దత్తశర్మ
3.మనసు-మాట శీర్షిక

రష్మీ మనసు మాట: నా పేరు రష్మీ. నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు పదవ తరగతిలో మంచి మార్కులు రావడంతో నా తల్లితండ్రులు చాలా ఆనందంగా వున్నారు. ఇక మీదట కూడా నేను అలాగే చదువు కొనసాగించాలి అన్న కోరికతో నాకు చదుకోవటానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు.
నాన్న ప్రైవేట్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్, అమ్మ గవర్నమెంట్ కళాశాలలో కామర్స్ టీచర్. నేను అమ్మ-నాన్నకు ఒకత్తె సంతానం కావడంతో నన్ను అల్లారు ముద్దుగా పెంచారు. అలాగే వాళ్ళ కలలు నా ద్వారా తీర్చుకోవాలి అన్న శంకల్పంతో వున్నారు. చిన్నప్పటి నుంచీ అమ్మ మరియు నాన్న నేను ఇంజనీర్ అవ్వాలి, IIT’sకి వెళ్ళాలి అన్నది వాళ్ళ కోరిక. అందుకే ఇంకేదీ ఆలోచించకుండా ఎంపీసీ తీశారు.

నాకేమో ఎంపీసీ/సైన్సస్ కన్నా కామర్స్ తీసుకోవాలనుoది. నాన్న-అమ్మ ఇది మాత్రం వృధా ఆలోచన, ఎక్కువ రాబడి ఉండదు, తద్వారా ఆనందం ఉండదంటారు. ఇంజనీరింగ్లో IT చేస్తే మంచి జీతంతో పాటు విలాసవంతమైన జీవితం ఉంటుందంటారు.
నేను ఏమైనా చెప్పటానికి ప్రయత్నిస్తే నీకేది మంచిదన్నది నీకు తెలియదు మేము చెప్పింది విను అంటారు లేదా మిగిలిననవాళ్లతో పోల్చి వాళ్ళ ఆనందానికి కారణం IT ఫీల్డ్ అనంటారు. నాకు మాత్రం నాకు నచ్చింది చదవాలని వుంది. ఇది వాళ్లకు ఎలా తెలియజేయాలో నాకు తెలియట్లేదు.
సైకాలజిస్ట్ మాట: రష్మీ, నీ మనసులోని బాధ నాకు అర్ధమవుతోంది. నీ తల్లిదండ్రులు నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ, నీకు నీ ఆసక్తులు, కోరికలు ముఖ్యం అని వాళ్ళకి తెలియజేయాలనుంది.
నీ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు, నీ భావాలను, ఆసక్తులను స్పష్టంగా చెప్పాలి. వాళ్ళు చెప్పే కారణాలను వినాలి, కానీ నీ నిర్ణయాన్ని కూడా వాళ్ళకి తెలియజేయాలి. మీరందరు ఇలా చర్చించుకోవాలంటే మీ అందరికి కెరీర్ అసెస్మెంట్ మరియు గైడెన్స్ మీద అవగాహన ఉండాలి.
కెరీర్ గైడెన్స్ అంటే:
- వ్యక్తి యొక్క కెరీర్ గురించి అన్వేషించడంలో మరియు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే విస్తృత ప్రక్రియ.
కెరీర్ గైడెన్స్ అన్నది కెరీర్ అసెస్మెంటతో మొదలవుతుంది. ఒక వ్యక్తి యొక్క బలాలు, ఆసక్తులు, వ్యక్తిత్వ లక్షణాలు బట్టి వాళ్ళకి తగిన విద్యా మార్గాలు మరియు వృత్తులను నిర్దేశించడమే కెరీర్ అసెస్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
కెరీర్ అసెస్మెంట్ పరీక్షలు:
- ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు: సమస్య-పరిష్కారం, భాష లేదా సంఖ్యా నైపుణ్యాలు, వ్యక్తి యొక్క సహజ సామర్థ్యాలు మరియు ప్రతిభలను కొలుస్తాయి.
- వ్యక్తిత్వ అంచనాలు: ఇంట్రోవర్షన్ లేదా ఎక్స్‌ట్రోవర్షన్, నిర్ణయం తీసుకునే శైలి మరియు భావోద్వేగ మేధస్సు వంటి వ్యక్తిత్వ లక్షణాలను మూల్యాంకనం చేస్తాయి.
- ఇంటరెస్ట్ ఇన్వెంటరీలు: వ్యక్తి యొక్క ఆసక్తులు మరియు ప్రాధాన్యతలను గుర్తించే పరీక్షలు.
- వాల్యూస్ అసెస్మెంట్స్: వ్యక్తి యొక్క ప్రధాన విలువలు మరియు ప్రాధాన్యతలకు సరిపడా వృత్తి మార్గాన్ని ఎంచుకోవడం.
- ఇంటలిజెన్స్ టెస్ట్స్: వ్యక్తి యొక్క
•పదజాలం, పఠనం, మరియు భాష నైపుణ్యాలు
•దృశ్య గ్రహణం, స్పేషియల్ అవగాహన, మరియు సమస్య-పరిష్కారం
•మెథడులో సమాచారాన్ని నిలపగల్గడం మరియు మార్చగల సామర్థ్యం
•తార్కిక ఆలోచన, సమస్య-పరిష్కారం, మరియు నిర్ణయం తీసుకోవడం
•సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో వేగం మరియు ఖచ్చితత్వం
గుర్తిస్తాయి తల్లిదండ్రులకు సూచనలు:
రష్మీ వృత్తి నిర్ణయించుకోవడానికి ఇన్ని అవసరమా అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవసరమే. ఎవరో IT చేసారనో, ఇంకెవరో డాక్టర్ అయ్యారనో మన పిల్లలకి అదే కెరీర్ నిర్ణయిస్తే రేపు చదువు పూర్తయ్యాక వాళ్ళకి ఆ రంగంలో స్కిల్ ఉండదు, అప్పుడు ఉద్యోగము వస్తుందన్న గారంటీ వుందా? ఉద్యోగం వచ్చాక అందులో స్కిల్ లేకపోతె ఎదుగుతారన్న గారంటీ వుందా? ఆ ఉద్యోగం నిలుపుకోగలగుతారా? ఖచ్చితంగా లేదండి.
కెరీర్ అసెస్మెంట్ పరీక్షల ఆధారంగా కెరీర్ అసెస్మెంట్ రిపోర్ట్ వస్తుంది. ఈ రిపోర్ట్ మీ పిల్లల ఇంటలిజెన్స్, అప్టిట్యూడ్, విలువలు, ఇంటరెస్ట్స్, వ్యక్తిత్వం, ఇష్టాలు బట్టి వారికి నప్పే కెరీర్స్ మరియు ఎడ్యుకేషన్ పాత్ చెప్పుతుంది తద్వారా సరైన నిర్ణయం తీసుకోగల్గుతారు. ఆ తర్వాత కెరీర్ గైడెన్స్ తీసుకోవడం వలన ఒక ప్రణాళికతో పనిచేయటం వలన, వాళ్ళు అనుకున్న వృత్తుల్లో విజయం సాధించగల్గుతారు.
ది మైండ్ వాయిస్:
- తల్లితండ్రులగా మీ కలలు పిల్లలు సాకరం చెయ్యాలన్న ఆలోచనా విధానం మారాలి.
•తల్లితండ్రులంటే పిల్లలకు ఆల్ ఇన్ వన్ సలహాదారులుగా అన్ని మనమే చెప్పేయాలి, చేసేయాలన్నది మన అపోహ. - వాళ్ళ ఆసక్తులు, కోరికలను గుర్తించి సరైన మార్గదర్శకులను చూపించడం తల్లితండ్రులుగా మనం చేయాల్సిన పని.
- కెరీర్ గైడెన్స్ మరియు అసెస్మెంట్‌లను పరిగణనలోకి తీసుకోండి. తగిన చదువును మరియు వృత్తిని పిల్లలు ఎంచుకునేలాగా ప్రోత్సహించండి
4.ధర్మం చేయండి బాబూ… (కథ)

ఆ శిల్పకళా సౌందర్యాలను తిలకిస్తూ మంత్ర ముగ్ధులు అవుతున్నారు పర్యాటకులు. గర్భగుడిలో నిలువెత్తు చెక్కిన దేవతా విగ్రహం భక్తులను మరో లోకంలోకి తీసుకు వెళ్తోంది. అది మారుమూల గ్రామం, ఒకనాటి పల్లెటూరు. ఈ రోజు ప్రముఖ పర్యాటక కేంద్రంగా వేలాదిమంది పర్యాటకులను ఆకర్షించడానికి ప్రధాన కారణం అక్కడ నిర్మాణం గావించుకున్న ఆ ‘గుడి’. అంతకు మించి చుట్టూరా చెక్కిన శిల్ప సంపద.
సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ కట్టడం ఆ నాటి పాలకుల చొరవతో గుర్తింపు పొందింది. బాగా ప్రచారం కల్పించడం వలన ఆ కేంద్రానికి పర్యాటకుల తాకిడి ఎక్కువయింది. ముఖ్యంగా వారాంతంలో అయితే మరీను.. కిక్కిరిసి పోతుంది ఆ ప్రాంతం. టూరిజం ను నిర్వహించే వారు ఆ ప్రాంతాన్ని తాము చూపించే ప్రదేశాల్లో విధిగా చేరుస్తారు.
ఆ గుడి ముందు ప్రవేశ దారిలో కుడి ఎడమల వేపు ఓ ఇరవై మంది యాచకులు, వారి ముందు ఒక పాత గుడ్డ పరుచుకుని యాచన చేస్తుంటారు. అందరూ శక్తి ఉడిగిన వ్యక్తులే! మగవాళ్ళు పెరిగిన తెల్ల గడ్డం, గుబురు జుట్టుతో, ఆడవాళ్ళు చినుగులు పడిన బ్లౌజు, చీకిన చీరతో నడుం వంగిపోయి దీనంగా, చేతిలో సత్తు గిన్నె చప్పుడు చేస్తూ యాత్రీకుల దయ కోసం ప్రాధేయ పడుతుంటారు.
‘ ఛీ.. ఛీ.. ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుందామని వస్తే.. వీళ్ళ అంతరాయం చిరాకు తెప్పిస్తోంది. అసలు వీరి వృత్తిని ప్రభుత్వం ఎందుకు నిషేధించదు? ఈ ఆలయ కమిటీ వీరిని ఎందుకు అనుమతిస్తోంది? ‘ సూటు వేసుకున్న ఒక పెద్ద మనిషి ప్రక్కనున్న వ్యక్తికి ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నాడు.
వంద రూపాయల ప్రవేశ రుసుమైనా బారులు తీరి లోపలకు ప్రవేశిస్తున్న టూరిస్ట్ లు, సందర్శన అనంతరం ఎంతో ఆనందంతో బయటకు వస్తున్నారు. కానీ, బయట “బాబ్బాబూ’ అంటూ దీనంగా వేడుకుంటోన్న వారిని పట్టించుకున్న వారు బహు స్వల్పం. ఎవరో దయ తలచి కాయిన్స్ విసిరి వేస్తున్నారు. ‘మానవ సేవనే మాధవ సేవ’ అనే నానుడికి ఇటువంటి ప్రదేశాల్లో ఉనికి ఉండదు. అదే చిత్రం.
అక్కడ ఆ అభాగ్యుల్లో ఉన్న ఒక వ్యక్తి కళ్ళల్లో ఆనందం ఒకవైపు, నైరాశ్యం మరో వేపూ తారట్లాడుతోంది. అతని పేరు ‘వీరాచారి’. బక్కచిక్కిన దేహం. లోపలకు వెళ్లిన ఉదరం. అతనికి ఒక కథ ఉంది. లోతుగా పరికిస్తే ఆ కథనే అతనికి వ్యధను మిగులుస్తోంది. వీరాచారి పూర్వీకులు శిల్పకళను ఆరాధిస్తూ జీవనం గడిపారు. వారు తమ పనిలో మమేకం అయ్యేవారు. ఇంతకూ ఈ వీరాచారి ఎవరంటే, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ఆ అద్భుత కట్టడం సృష్టికర్తల వారసుడు.
అతను ప్రతిరోజూ అక్కడకు వస్తాడు. ఆ పర్యాటకులు, వారి వదనాల్లో కదలాడే కాంతిని చూసి ఎంతో సంతృప్తి చెందుతాడు. అనూచానంగా వస్తోన్న కుల వృత్తిగా శిల్పకళను స్వీకరించిన వీరాచారి పూర్వీకులు త్రికరణశుద్ధిగా, అత్యంత నైపుణ్యంగా, ఓరిమితో సంవత్సరాల పాటు ఈ దేవాలయ శిల్పకళకు మెరుగులు దిద్దారు.
వీరాచారి తాతయ్య సుగుణాచారి ఆ దేవాలయ శిల్పకళకు ఆద్యుడు. గర్భగుడిలో దేవతా శిల్పాన్ని చెక్కేటప్పుడు కుడిచేయి చూపుడు వేలు వంకరగా రూపు దిద్దుకుంది అని మనో వ్యధతో పది రోజులు అన్న పానీయాలు మాని వేశాడు. నిర్వాహకులకు నచ్చచెప్పి మరలా కొత్త రూపు రేఖలు ఇచ్చాడు.
ఆ విధంగా ఇరవై సంవత్సరాలు ఆ దేవాలయ శిల్పకళకు రూపు రేఖలు సంతరింప చేస్తూ, వృద్ధాప్య దశకు వచ్చాక, ఉలి కూడా సరిగ్గా పట్టుకోలేని దశలో, అతని కుమారుడు పూర్ణాచారి వారసత్వ బాధ్యతలను స్వీకరించి, మరో పదేళ్లు అలుపెరగకుండా మిగిలిన కార్యక్రమాన్ని సంపూర్ణం చేశాడు. అలా రూపు దిద్దుకున్నదే ఆ దేవాలయ పరిసరాల కళా నైపుణ్యం.
బాల్యం నుంచి వీరాచారి అంతా గమనిస్తూనే ఉన్నాడు. తండ్రి కుటుంబాన్ని పట్టించుకునే వాడే కాదు. కళ మీదనే అతని దృష్టి. వీరాచారి కూడా తండ్రికి తోడుగా వెళ్లేవాడు. అందుకే అతనికి విద్య అబ్బలేదు.
ఆ దేవాలయానికి ఆగమ శాస్త్ర పండితులతో దర్శనాలకు ముహూర్తం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూర్ణాచారికి దక్కింది కేవలం శాలువా సత్కారం. కళాకారుడు తన పనికి చప్పట్లు లేకపోతే బ్రతుకే వ్యర్థంగా భావిస్తాడు. ప్రభుత్వ కృషిని, పోషకులను, ఆలయ కమిటీని స్తుతించడానికే వక్తలు పోటీ పడ్డారు.
ఇవన్నీ గమనిస్తోన్న వీరాచారికి తమ వృత్తి మీదనే అసహ్యం కలిగిన క్షణాలు అవి… అక్కడ ప్రతిష్టించిన శిలా ఫలకంపై తన తాత, తండ్రుల పేర్లు ఉంటాయనే భ్రమలో వెతికాడు వీరాచారి. ఆ శిల్పకళ, గర్భగుడిలో మూల విరాట్టు అంత అద్భుతంగా, ఏ లోపమూ లేకుండా చూపరులను విస్మయ పరచడానికి గల కారకులను తలచుకున్న వారు లేరు.
సందర్శకులు సైతం.. ‘ ఆహా! ఎంత అద్భుతం.. ఆ పోషకులు ఎంత గొప్ప వారో కదా! ‘ అంటూ అబ్బుర పడుతున్నారు. కారకులు ఎవరు? అని లేశమంత అయినా ఆలోచన లేకుండా పోయింది.
పూర్ణాచారి గతించాక ఆ కుటుంబం ఏ ఆధారమూ లేకుండా, దిక్కులేని స్థితిలో…వీరాచారి ఆలయ కమిటీ చైర్మన్ ను కలిశాడు. “అయ్యా! ఈ ఆలయ శిల్పకళ సృష్టికర్తలు మా తాత, నాన్న గార్లు. ఇప్పుడు వారి వారసుడిగా ఇక్కడ ఏదైన కొలువు ఇస్తే, మా పూర్వీకుల శిల్పకళను తనివి తీరా ఒక జ్ఞాపకంగా మలచుకుంటూ వచ్చిన పర్యాటకులకు వివరిస్తూ జీవనం గడుపుకుంటాను..” చేతులు జోడించి ప్రార్థించాడు.
ఆయన వీరాచారిని ఎగాదిగా చూసి.. “చూడు బాబూ! ఆ రోజుల్లో మీ పూర్వీకులు చేసిన కృషి గురించి నాకేమీ తెలియదు. అయితే, నా చేతుల్లో ఏమీ లేదు.. నీకు నేను ఏ విధమైన సహాయం చేయలేను..” ఖచ్చితంగా చెప్పాడు. ఆయనకు తనకు ఉపాధి చూపించే అవకాశం లేదని అనుకున్నాడు వీరాచారి. కాలక్రమేణా వీరాచారి భార్యా పిల్లలు అతడిని వదలి పెట్టి వెళ్లి పోయారు. ఎక్కడికి వెళ్లారో తెలియదు. తన అసమర్థతను చూసి వాళ్లే ఎక్కడికో వెళ్లిపోయారని అనుకున్నాడు.
వీరాచారి మాత్రం ఆ ప్రాంతాన్ని వదలి వెళ్ళలేక పోయాడు. ఉదర పోషణ కోసం అదే ఆలయం ముందు ‘యాచన’ జీవితం వినా మరో మార్గం లేకుండా పోయింది అతనికి. ఆలయ శిల్పకళ గొప్పతనాన్ని సందర్శకులు పొగుడుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది వీరాచారికి. తానే గొంతెత్తి అరవాలనుకుంటాడు, ఈ శిల్పకళా వైశిష్ట్యానికి ఆద్యుడు తన తాత గారని, వారసుడిగా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడని, అసలు వారసుడైన తాను చివరకు ఇలా బ్రతుకును వెళ్లదీస్తున్నాను అని.
అలా ప్రవర్తిస్తే, ఏమి జరుగుతుందో తాను ఊహించగలడు. పిచ్చివాడి క్రింద జమకట్టి రాళ్ళతో తరుముతారు. అందుకే, ఆ జ్ఞాపకాల నీడలో సేద తీరుతున్నాడు వీరాచారి. అప్పటికప్పుడు నాలుగు టూరిస్ట్ బస్ లు ఆగాయి ఒకేసారి ఆ ప్రాంతంలో. “బాబ్బాబు..ధర్మం చెయ్యండి..వచ్చే సందర్శకుల ముందు చేతిలోని సత్తు గిన్నెను ముందుకు చాపాడు వీరాచారి.
5.కబుర్లు – శీర్షిక

జీవిత పాఠాలు
థామస్ ఎడిసన్ విద్యుత్ బల్బు తయారీలో వేలసార్లు విఫలమయ్యారు. అయినా “నేను విఫలం కాలేదు. చేయకూడని మార్గాలను తెలుసుకొన్నాను.” అన్నాడు. ఎన్నిసార్లు ఓడినా నిరాశ చెందకుండా ఆశావహ దృక్పథంతో కృషి చేస్తేనే అంతిమంగా విజయం దక్కేది.
ఓప్రా చిన్నప్పుడు చాలా కష్టా లు ఎదుర్కొంది. పేదరికం, సాటివారి దురుసుతనం, తిరస్కారం నిత్యం వేధించేవి. ఆమె తన మొదటి టీవీ ఉద్యోగం- యాంకర్ – పదవి నుండి సామర్ధ్యం లేదనే వంకతో తొలగించబడింది. అయినా ఓప్రా ఈ కష్టాల ముందు తలవొంచలేదు. పట్టుదలతో ముందుకు సాగి ప్రపంచం గుర్తించిన ‘మీడియా మొగల్’ స్థాయికి ఎదిగింది. ఆత్మవిశ్వాసం జీవితాలను ఎలా మార్చగలదో ఓప్రా నిరూపించింది.
ప్రఖ్యాత భౌతికవిజ్ఞాన శాస్త్రవేత్త ఐన్స్టీన్ చిన్నప్పుడు చదువుల్లో వెనుకబడి ఉండేవాడు. నాలుగేళ్ళు వచ్చే వరకు స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తి భవిష్యత్తులో ” ఈ= ఎమ్ సి స్క్వేర్” అనే గొప్ప సూత్రం ఆవిష్కరిస్తాడని ఉహించగలమా? తమ లోపాలను గుర్తించి సందిద్ధుకొనే తత్వం కలిగి వుంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా సునాయాసంగా అధిరోహించవచ్చు.
పన్నెండు ప్రచురణ సంస్థలు తిరస్కరించినా పట్టుదల వదలకుండా మరింత కసిగా కృషి కొనసాగించింది ‘హ్యారీ పోటర్ ‘ సిరీస్ రచయిత్రి జె.కె. రౌలింగ్. ఏ దశలో నిరాశపాలయినా కేవలం ఓ మామూలు పిల్లల తల్లిగా ఆమె మిగిలుండేది. స్వీయ శక్తుల మీద గాఢవిశ్వాసం గలవాళ్ళను ఏ అవరోధమూ నిరోధించలేదు.
నల్లజాతుల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన యోధుడు నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. అయినా విడుదలయిన తరువాత పగతో కాకుండా శాంతి ఆయుధంతో ప్రపంచాన్ని జయించాడు. మహాత్మునిగా మారటానికి అహింస, క్షమ గుణాలు ఎంత అవసరమో భారతీయుల స్వాతంత్ర్య సమర సారధి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జీవితమూ ఒక నిదర్శనమే.
‘ఆపిల్’ సంస్థ కో- ఫౌండర్ స్టీవ్ జాబ్స్ సొంత కంపెనీ ‘ఆపిల్’ నుంచే ప్రారంభంలో ఉద్వాసన పలకాల్సొచ్చింది. పంతం కొద్దీ కొత్త కంపెనీలు స్థాపించి, కాలక్రమేణా తిరిగి ఆపిల్ సంస్థ నిర్వహణ బాధ్యతలను చేపట్టే స్థాయికి ఎదిగాడాయన. స్వీయ ప్రేరణ కలిగి ఉన్నంత కాలమూ ఏ వైఫల్యమూ వైఫల్యంగానే మిగిలిపోదు.
బాలికల విద్యకోసం పోరాడిన మలాల తాలిబాన్ల దాడిలో గాయాలపాలయినా తన పోరాటం ఆపలేదు. అవాంతరాలు ఎదురైనప్పుడు గుండె ధైర్యం కొల్పోకుండా ముందుకు సాగినప్పుడే అంతిమంగా అనుకొన్నది సాధించేది.
హెలెన్ కెల్లర్ బాల్యం నుంచే అంధురాలు, బధిరురాలు. అయినా ఆ దివ్యాంగురాలు గురువు సాయంతో విద్య నేర్చుకొని ప్రసిద్ధ రచయిత్రి, ఉద్యమ కారిణిగా ప్రపంచమంతా పర్యటించింది. సమున్నత లక్ష్యం, సాధించే ధృఢ దీక్ష ఉన్నవి కాబట్టే హెలెన్ కెల్లర్ ‘లిండన్ బి. జాన్సన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ‘ పతకం సాధించే స్థాయికి ఎదిగింది.
ఎవరికీ రాత్రికి రాత్రే గుర్తింపు రాదు. అలా వచ్చినా కలకాలం నిలవదు. ఎల్లకాలం అందరి దృష్టిలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపబడాలంటే స్వీయ బలహీనతలను గుర్తించి, అడ్డంకులకు వెరవకుండా పట్టుదలతో కృషి కొనసాగిస్తేసే పైన చెప్పిన ప్రసిద్ధుల జాబితాలో చేరటం సాధ్యం.
6.సన్నిహితం… శీర్షిక

ఒక్కసారి మాట్లాడి చూడు
సాధారణంగా మన చుట్టూ ఉన్న వ్యక్తుల మీద మనకు ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. ఇది ఆ వ్యక్తులతో మనకు ఉన్న పరిచయం వల్ల లేదా అబ్జర్వేషన్ వల్ల ఏర్పడి ఉంటుంది. ఇది మనందరికీ సర్వసాధారణం. అయితే కొత్త వ్యక్తుల మీద మనకు మన సొంత అభిప్రాయం ఉండదు. వాళ్లూ వీళ్ళు చెప్పిన అభిప్రాయం తప్ప.
అయితే ఆ అభిప్రాయం కరెక్ట్ కావచ్చు లేదా తప్పు కావచ్చు. ఇలాంటి అనుభవమే నాకు ఒకటి జరిగింది. నేను అభిమానించే ఒక రచయిత చాలా పరుషంగా మాట్లాడతారు అని, అహంభావి అని అందరూ చెప్పేవారు. నేను కూడా అది నిజమే అనుకునే వాడ్ని. కానీ ఆయనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆ అభిప్రాయం తప్పు అని తెలుసుకున్నాను.
తన అనుభవాల దృష్ట్యా కొత్త వాళ్ళతో అలా ఉంటారని అర్థం చేసుకున్నాను. అలాగే నా కింద పని చేయడానికి కొత్తగా వచ్చే కుర్రాళ్ల గురించి కూడా వేరే వాళ్ళు నెగెటివ్ గా చెప్పినపుడు నేను వెంటనే నమ్మకుండా వాళ్ళను పిలిచి కాసేపు మాట్లాడతాను. అప్పుడు నా అభిప్రాయం తప్పు అని తెలుస్తుంది.
అలాగే మన బంధువుల్లో కొంత మంది మంచివాళ్ళు కారు అని ఎవరైనా చెప్పినా వాళ్ళతో ఒకసారి మాట్లాడాకే వాళ్ళ మనస్తత్వాన్ని నిర్థారించుకుంటాను . ఇలా మనం కనీసం ఒకసారి అయినా వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళ అసలు మనస్తత్వం తెలుస్తుంది.
వారిపై సరైన అభిప్రాయం కలుగుతుంది . కేవలం వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళ మెంటాలిటీ ను ఊహించుకుంటే కమ్యూనికేషన్ గేప్ వల్ల తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంది . అంతే కదా ఫ్రెండ్స్ !!!!
7.మెదడుకు మేత–సామెత.. శీర్షిక

గజం మిథ్య పలాయనం మిథ్య
‘మిథ్య’ అన్న పదం వేదాంత పరిభాషకు చెందింది. దీనర్థం ‘భ్రాంతి’. ‘లేనిది ఉన్నట్లు కనపడడం’, ‘నిజం కానిది’ అని అర్థాలు చెప్పుకోవచ్చు. ‘బ్రహ్మ సత్యం, జగన్మిథ్య’ ఈ తాత్త్విక ప్రకటన అద్వైత సిద్ధాంతానికి మూలం. దీనిని సిద్ధాంతీకరించినవారు జగద్గురువులు ఆదిశంకరులు. ఇంకా “జీవో బ్రహ్మైవ నాపరః” అని కూడా అన్నారాయన. అంటే జీవియే బ్రహ్మము. ఇతరులు కాదు. ఇద్దరికీ అభేదాన్నే ఈ అద్వైతం సూచిస్తుంది. ‘రెండు కానిదే’ అద్వైతము.
శుష్కవేదాంతమని ఒకటుంది. క్రియాశీలంగా ఉండకుండా ఈ మిథ్యావాదాన్ని ఆశ్రయిస్తుంటారు కొందరు. దానినుండి పుట్టిందే ఈ సామెత. ఈ ప్రపంచాన్ని శంకరులు మిథ్య అని ఎందుకన్నారంటే, దీనిలో ఏదైనా తాత్కాలిక ఆనందాన్నే ఇవ్వగలదు. డెల్ఫీ లోని అపోలో ఆలయంలో ఒక పురాతన గ్రీకు సూక్తి చెక్కబడి ఉంటుంది. దానర్థం “నిన్ను నీవు తెలుసుకో” అని. దీనికీ మూలం అద్వైతమే.
‘రజ్జుస్సర్పభ్రాంతి’ అని ఇలాంటిదే ఒకటుంది. ‘తాడును చూసి పాము అనుకోవడం’. దీన్ని illusion అనవచ్చు. ఇది వేరు. ఇక్కడ భ్రాంతికి మూలంగా ఒక వస్తువు ఉంది. అదే తాడు. కాని ‘గజం మిథ్య పలాయనం మిథ్య’లో రెండూ లేవు. మాయ మనసును ఆవరించడం వలన అన్నీ రెండుగా కనిపిస్తాయి. కానీ ఉన్నది ఒకటే.
జనశ్రుతంలో ఒక కథ ఉంది. దానికి ప్రమాణం లేదు. కానీ ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి మిథ్యావాద ధురీణులైన ఆదిశంకరులు శిష్యగణంతో ఒక రాజవీధిలో వెళుతున్నారట. ఇంతలో “మదపుటేనుగు ఒకటి గొలుసులు తెంచుకొని వీధిన పడింది. అందరూ దూరంగా పారిపోండి” అన్న అరుపులు వినబడ్డాయట. వెంటనే శంకరాచార్యులవారు ఒక్క ఉదుటున పక్కకు తొలగి, తప్పుకున్నారట.
కొంటెకోణంగి శిష్యడొకరు ప్రతి గురువుకూ ఉంటాడు కదా! అలాంటి వాడొకరు స్వామిని ఇలా అడిగాడట – “గురూత్తమా! అంతా పరబ్రహ్మ స్వరూపమే కదా! అని మీరే మాకు బోధించారు కదా! ఆ ఏనుగు వస్తూందని మీ అంతటి వారు భయపడినారెందుకు? మా సందేహం తీర్చండి” అని వినయంగా అడిగాడట. దానికి శంకరుడు “అదే నేను చెప్పింది! ఏనుగూ లేదు పారిపోవడమూ లేదు.
గజం మిథ్య పలాయనం మిథ్య” అని చిద్విలాసంగా నవ్వారట. అంటే దృశ్యమానమైన ప్రపంచం, అందులో మనం చేసే పనులు వాస్తవం కాదు అని ఏనుగు అనే దృశ్యం మనకు ఎంతవరకు ‘సత్యం’గా కనిపిస్తుందో, పారిపోవాలనే చర్య కూడా సత్యంగానే అనిపిస్తుంది.
మనం నిజజీవితంలో చూస్తుంటాం. ‘ఫోన్ ట్యాపింగ్’ లాంటి మెగా నేరాలు గత ప్రభుత్వాలను కుదిపేస్తుంటాయి. ముఖ్య నిందితుడు విదేశాలకు పారిపోతాడు. ఒక్కొక్కరూ ఇరుక్కుంటుంటారు. సి.బి.ఐ విచారణకు కూడా కోరడం జరుగుతుంది. పత్రికలకు, ఛానళ్లకు, యూట్యూబర్లకు కావలసినంత పని. ప్రేక్షకులకు, వీక్షకులకు కావలనంత వినోదం. ఇంతా చేసి చివరకు అంతా తుస్సుమంటుంది.
అదే ‘గజం మిథ్య పలాయనం మిథ్య!’. ఫోన్ టాపింగు మిథ్య, ఎంక్వయిరీ మిథ్య. భైరవశర్మగారని మా పెదనాన్నగారుండేవారు. మా నాన్నగారికి కజిన్. ఆయన భోజనప్రియుడు. ఆ బలహీనతను వేదాంతంతో మేళవించేవాడు. ఆయనకు తిండిపుష్టి కూడా ఎక్కువే. “మా రామయమంత్రి భోజన పరాక్రమమేమని చెప్పవచ్చు?, తత్కబళ చాతురి తాళఫళ ప్రమాణముల్” అని శ్రీనాథుడొక చాటువులో చెప్పాడు.
తాటిపండ్లంత ముద్దలు చేసుకొని తింటాడట ఆ రామయమంత్రి. మా భైరవ పెద్దనాన్న తద్దినాలకు భోక్తగా కూర్చుంటే మినపగారెలు, నువ్వుల పచ్చడితో రెండు డజన్లు అవలీలగా తినేసేవాడు. ఆయన తింటుంటే మేం వింతగా చూసేవాళ్లం. తిని ఆయన, “ఒరేయ్! ఈ జఠరాగ్ని (ఆకలి) అనేది ఉందే, ఇది అంతా మిథ్య రా! తింటే తీరినట్లనిపిస్తుంది. తర్వాత మళ్లీ పుడుతుంది. కాబట్టి ఈ గారెలు మిథ్య, నేను తినడం మిథ్య” అనేవాడు నవ్వుతూ! కాబట్టి, మరీ మిథ్యాప్రపంచంలో విహరించడం మనబోటి వారికి సూటవదండీ బాబు! రియాలిటిలోనే బతుకుదాం. ఏమంటారు?
8.వినరో భాగ్యము – శీర్షిక

వైకుంఠ వైభవము… అన్నమయ్య సంకీర్తనార్చన
తిరుమలేశుని పద కీర్తనలతో అర్చించి తరించిన భక్తుల్లో తాళ్ళపాక అన్నమాచార్యులు అగ్రగణ్యులు. నందకాంశతో జన్మించిన అన్నమయ్య 1408 – 1507 మధ్యకాలంలో తిరుమల వెంకటేశ్వర స్వామికి 30 వేల సంకీర్తనలతో అర్చించారు. సాధు సుబ్రమణ్య శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి వంటి పరిశోధకుల కృషి ఫలితంగా 14 వేల కీర్తనలు మాత్రమే ఆధునికులు అందుబాటులో వచ్చాయి.
వారి సేకరించిన సంకీర్తనల రాగిరేకులను తిరుమలేశుని ఆలయంలోని హుండీ కి ఎదురుగా ఉన్న అన్నమయ్య భాండాగారంలో నిక్షిప్తం చేసి ఉంచారు. అందులో అన్నమయ్య రచించిన 2281 సంకీర్తనలు, ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్య రచించిన 205 సంకీర్తనలు, చిన తిరుమలయ్య రచించిన 37 సంకీర్తనలు ఉన్నాయి.
80వ దశకం ఆరంభంలో అప్పటి టి టి డి కార్యనిర్వహణాధికారి పి వి ఆర్ కె ప్రసాద్ సంకల్పబలంతో ఏర్పాటైన అన్నమాచార్య ప్రాజెక్టు నేతృత్వంలో 31 సంపుటాలుగా అన్నమయ్య సంకీర్తనలు అందుబాటులో ఉన్నాయి. అన్నమయ్య భక్తితత్వానికి గుర్తింపుగా ఇప్పటికీ శ్రీవారి ఆలయంలో ఉదయం సుప్రభాతం సందర్భంగా తాళ్ళపాక వంశీకులచే సంకీర్తనాగానం చేయించే సంప్రదాయం కొనసాగుతోంది.. ఓం నమో వెంకటేశాయ.
మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

