Sunday Magazine 21 DEC 2025 | ఆదివారం సంచిక 21 డిసెంబర్ 2025

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్రభ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు..
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.
Sunday Magazine సంచికలో….
1.జాతీయ గణిత దినోత్సవం – లెక్కలతోనే చిక్కులు
2.మనసు-మాట శీర్షిక
3.శిక్షణ – (కథ)
4.కబుర్లు – శీర్షిక
5.సన్నిహితం… శీర్షిక
6.మెదడుకు మేత-సామెత.. శీర్షిక
7.వినరో భాగ్యము – శీర్షిక

1.జాతీయ గణిత దినోత్సవం – లెక్కలతోనే చిక్కులు
డిసెంబరు 22న ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త, శ్రీనివాసరామానుజన్ గారి జయంతిని “జాతీయ గణిత దినోత్సవం”గా జరుపుకుంటారు. తమిళ అయ్యంగార్ల బీద కుటుంబంలో ఆయన జన్మించాడు. గణితశాస్త్రంలో ఎలాంటి శిక్షణను ఆయన పొందలేదు. కాని, గణిత సూత్రాల విశ్లేషణ, నంబర్ థియరీ, ఇన్ఫినిట్ సిరీస్ లాంటి అంశాల్లో ఆయన గణితానికి చేసిన సేవ చాలా గొప్పది. కొందరు కారణజన్ములుంటారు. వారు ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని లోకానికి అందించడానికే పుడతారు.
శ్రీనివాస రామానుజన్ అలాంటి మహనీయుడు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ ఆచార్యుడు జీ.హెచ్.హర్డీ కి ఆయన ఒక పేపర్ సమర్పించారు. హర్డీ గారికి ఈయన సామాన్యుడు కాడని అర్థమైంది. వెంటనే ఆయన కేంబ్రిడ్జికి పిలిపించాడు. అతన్ని చదివించాడు. అతి చిన్న వయసులోనే రాయల్ సొసైటీ సభ్యుడు, ట్రినిటీ కాలేజ్ సభ్యుడయ్యాడు. 32 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు.
ఏ.పీ.లోని కుప్పంలో ఆయన స్మారకంగా “రామానుజన్ మాత్ పార్క్” 2017లో ప్రారంభించబడింది. 1962లోనె ఆయన పేర ప్రభుత్వం తపాలా బిళ్ళ విడుదల చేసింది. గణితం అన్ని శాస్త్రాలకు మూలం అంటారు ఇప్పుడు దూసుకుపోతున్న కృతిమ మేధ, బిగ్ డేటా, మిషన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో గణితమే కీలకం.
మా స్కూలు రోజుల్లో, కంపోజిట్ మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్ అని రెండు ఉండేవి. మొదటిది ఎంచుకున్న వారు మేధావులుగా పరిగణించబడేవారు. మాలాంటి వాళ్ళు జనరల్ తీసుకునే వాళ్ళం. ఆల్జీబ్రా అంటే అప్పట్లో నాకు చాలా భయం. దాన్ని ‘మైండ్ గాబ్రా’ అనే వాళ్ళం. లెక్కల సారు గంభీరంగా ఉండేవాడు. అసలు నవ్వే వాడు కాదు. ఇంకా చిన్నప్పుడు రెండో తరగతిలో దస్కం తీసివేతలు ఉండేవి. ప్రక్కనుంచి ’10’ తెచ్చుకోమనేవాడు. మా లెక్కల సారు కొత్త మల్లయ్య గారు. నేను ఎప్పుడూ అవి తప్పే చేసి… ఆయనతో తొడపాషాలు పెట్టించుకునేవాడిని.
పెద్దయ్యాక ఇంటి ఖర్చులు ప్రతినెల లెక్క వ్రాసే వాడిని. అవి టయాలీ అయ్యేది కావు. నా కర్మ చాలక నాకు మొదట రాయలసీమ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. మంత్రాలయం బ్రాంచ్ లో వేశారు. అప్పుడు కంప్యూటర్లు లేవు. లెడ్జర్లలో అంకెలు ఎంటర్ చేసేటప్పుడు తప్పులు చేసేవాడిని. ఇది మన కప్ ఆఫ్ టీ కాదని ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. తర్వాత లెక్చరర్ ను అయ్యాను. ఇంగ్లీష్ నా సబ్జెక్టు. లెక్కలతో సంబంధమే లేదని సంబరపడినంతసేపు పట్టలేదు. ఇంటర్ ఆన్సర్ పేపర్లు దిద్దాలి కదా… అక్కడ ప్రశ్నలకు మార్కులు వేసి, ముందు పేజీలో పోస్ట్ చేసి, లోపలి టోటల్, బయటి టోటల్, టయాలీ చేస్తే ఖచ్చితంగా తేడా వచ్చేది. ఇవి లెక్కలతో నేను పడిన చిక్కులు.
సరే మనకు రాకపోయినంత మాత్రాన గణితం గొప్పతనం ఎక్కడికి పోతుంది.? ‘హ్యూమన్ కంప్యూటర్’ అని బిరుదు పొందిన శకుంతలా దేవి గారు అద్భుత ప్రజ్ఞ్యాశాలి. గణితావదనాలు కూడా చేసిన మేధావి. ఒక పోటీలో అత్యంత వేగంగా లెక్కించి ఆమె కంప్యూటర్ని ఓడించారట బాబోయ్.!!
ఈ కాలం పిల్లలకు అన్ని కాలిక్యులేటర్ల మీదే.! నాకు ఎక్కాలు అన్నింటిలో 10వ, 11వ, 20వ ఎక్కాలంటే మక్కువగా ఉండేది. సులభంగా ఉంటాయి కదా… 19 ఆర్లు ఎంత అంటే చెప్పడం ఎంత కష్టం.? 19 ఇంటూ ఆరు వేసుకొని చెప్పేవాడిని. సాహిత్యం అంటే ఎంత కష్టమైనా పడతాను గాని, లెక్కలు అంటే మాత్రం భయమే. ఆయన ఎవరో భాస్కరాచార్యులవారు ‘సున్నా’ ను కనిపెట్టారని తెలిసి, అది ఏమంత గొప్ప ? సున్నాను కూడా ఒకరు కనిపెట్టాలా అనుకునేవాడిని.
తర్వాత తెలిసింది అది ఎంత గొప్పదో. అది లేకపోతే గణిత శాస్త్రమే లేదని..
ఒక ఇల్లాలు మగడిని అడిగిందట “ఏమండీ ఒక వెయ్యి రూపాయలు అప్పు ఇవ్వండి ప్లీజ్ ! మీ జీతం రాగానే తీర్చేస్తాను” అన్నదట. లెక్కల్లో గడుసు తనమంటే ఇదే ! పోపుల పెట్టెలో దాచే డబ్బులకు లెక్కలు లేవు. ఏదైనా అధికంగా ఉంటే ‘లెక్కకు మిక్కిలిగా’ ఉందని కవులు వర్ణిస్తారు. ‘లెక్క డొక్కా’ చూసుకోవడానికి ఒక ఆయన్ని పెట్టుకున్నా అంటుంటారు. డొక్క ఏం చూస్తాడో మరి ! పాతకాలం నవలలో, కథల్లో, ఫాదర్స్ ఆఫీస్ అయిన తర్వాత కొట్లలో పద్దులు వ్రాసే పని చేసి తృణమో పనమో సంపాదించేవారు. లెక్కేలేదు అంటే అసలు లక్షపెట్టడు అని అర్థం. మా రాయలసీమలో డబ్బును ‘లెక్క’ అంటారు తెలుసా అండి. మరి లెక్క, జమా లెయకుండా పోయింది. అంటే ఖర్చులు ఒక ప్లాన్ ప్రకారం లేవని అర్థం. ఎవరికైనా వేరే కాన్సెప్ట్ ఉంటే వాడి ‘లెక్క’లు వేరులే అంటారు. కరెక్ట్ గా చెబితే ‘అది లెక్క’ అంటారు.
‘కృష్ణ శతకం’లో లెక్కలపై ఒక చక్కని పద్యం ఉంది.
చుక్కల నెన్నగవచ్చును
గ్రక్కున బూ రేణువులను గనుతింపనగున్
చొక్కపు నీ గుణజాలము
నిక్కమగును లెక్కపెట్ట నజునకు కృష్ణా..
ఈ శతకాన్ని శ్రీ నృసింహ కవి 18వ శతాబ్దంలో రాశాడు. శ్రీకృష్ణ పరమాత్మ గుణ సమూహం లెక్కపెట్టడానికి వీలుకాదట. నక్షత్రాలనైనా లెక్కపెట్టొచ్చట. మట్టిలోని రేణువులనైనా లెక్కించవచ్చట. కానీ, కృష్ణుని గుణాలు ఒకటా రెండా? అన్ కేరబుల్ ఈ కవికి లెక్కలు అంటే అసలు భయం లేదు. నా మాటలకు ఏం గాని గణితాన్ని అభ్యసించేవారు, దాన్ని లోతుగా పరిశోధించేవారు, చక్కగా బోధించేవారు, ఎందరో మహానుభావులు.!! వారందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభకామనలు.
- పాణ్యం దత్త శర్మ
2.మనసు-మాట శీర్షిక

రమ మనసు మాట..
మా అమ్మాయి పేరు శ్రేష్ఠ. తనకు 15 సంవత్సరాలు, 10వ తరగతి చదువుతుంది. ఇది వరకు బాగా చదువుకొనేది, మా మాటలన్నీ వినేది. కానీ ఇప్పుడు, మేము చదువుకోమన్నా తప్పే, జంక్ ఫుడ్ తినొద్దన్నా తప్పే, ఫ్రెండ్స్ తో ఎక్కువ మాట్లాడద్దన్నా తప్పే. ఎప్పుడు చూసినా ఫోన్లో చాటింగ్ చేస్తుంది మాతో అసలుండదు. సమయం వృధా అంటే వినదు. మీకు నా ఫ్రెండ్స్ అంటే ఇష్టం లేదు వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు అన్నది మీ ఇద్దరి ఉద్దేశ్యం, నన్ను అందరి నుంచీ దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారంటుంది.
హోమ్వర్కులు ఇంకంప్లీట్ ఉంటాయి, మార్కులు బాగా తగ్గిపోతున్నాయి, చదువుకో అంటే మాతో యుద్ధమే చేస్తుంది. ఉద్యోగం వచ్చాక మీకు నా బాధ ఉండదు ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంది. తనకి మా కంటే స్నేహితులు ముఖ్యము, మమ్మల్ని వదిలేసి వెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా వుందన్నది తట్టుకోవడం కూడా మా ఇద్దరికీ చాలా కష్టంగా వుంది. మా అమ్మాయిలో వున్న సమస్యలు మరియు మాలో వున్న సమస్యలు వివరించగలరా? మాకు పరిష్కారం చూపించగలరా?
సైకాలజిస్ట్ మాట:
మనం ప్రస్తుతం నివసిస్తున్న సమాజంలో పేరెంటింగ్ గురించి అందరూ సలహాలు చెప్పేవారే, అందరూ పేరెంటింగ్ కోచ్లే, మరి అలాంటప్పుడు మనము మంచి పేరెంట్సా కాదా అన్న సందేహం ఈ సలహాలు వలన మనము మంచి తల్లితండ్రులమా కాదా అన్న సందేహం తలెత్తుతూనే ఉంటుంది. సందేహాలే భయాలకు దారి తీస్తాయి. భయాలు నియంత్రణకు కారణమవుతాయి మరి నియంత్రణ వలన భావొద్వేగాలు వ్యక్తపరచలేక ఇటు తల్లితండ్రులు అటు పిల్లలు కష్టపడతారు అవే ఘర్షణలకు దారి తీస్తాయి. ఇలాంటి సమయాల్లో చేయాల్సినవి మరియు చెయ్యకూడనివి:
సందేహించడం లేదా నమ్మడం:
“మేం మంచి తల్లిదండ్రులం కాదేమో అందుకే మా పిల్లలకే అన్ని సమస్యలు వస్తున్నాయి. పిల్లలను సరైన మార్గంలో పెంచలేకపోతున్నాము “, ” మా పిల్లలను చూసి అందరూ మమ్మల్ని సరైన పేరెంట్స్ కాదంటారేమో ” అన్న సందేహాలు సరైనవి కాదు.
పేరెంటింగ్ లో మనల్ని మనం సందేహించుకున్నా, పిల్లలని సందేహించినా సమస్య పెద్దదవుతుంది తప్పితే పరిష్కారం దొరకదు . సమస్య మీ ఇద్దరిలోను లేదు, సమస్య మీరు సంభాషించుకునే విధానంలో వుందన్నది గుర్తించండి. దీని వలన పరస్పరం నిందించుకోవడం ఆపుతారు. సమస్యను శాంతియుత వాతావర్ణంలో సంభాషించుకోవడానికందరూ సిద్ధమవుతారు.
ప్రేమ లేదా నియంత్రణ?
నియంత్రణ (control) “నువ్వు మా మాట వినాల్సిందే, ఫోన్ చూడటానికి వీలేద్దు. మేము నీ మంచి కోసమే చెప్పుతున్నాము”, “నీకు ఏది మంచిదో మా అనుభవంతో చెప్తున్నాము, విను” ఇవన్నీ చెప్పడం వల్ల పిల్లలు వినరు ఇంకా వ్యతిరేకిస్తారు.
ప్రేమ (care): నియంత్రణ కోసం పోరాడకండి ప్రేమతో వాళ్ళ క్షేమం కోసం సంభాషించండి. పేరెంటింగ్ అన్నది ఒక బంధం. ఈ బంధంలో పిల్లలతో ఉన్న కనెక్షన్/అటాచ్మెంట్ ( Attachment ) ముఖ్యమన్నది గ్రహించండి. సెక్యూర్డ్ అటాచ్మెంట్ వున్నప్పుడే పిల్లలు మీ సలహాలు వింటారు. ప్రేమతో ఇలా చెప్పి చూడండి: “నువ్వు స్నేహితులతో ఆనందంగా ఉండడం చూసి మాకు కూడా ఆనందంగా వుంది.
నువ్వు సురక్షంగా ఉండడం కావాలి మాకు. ఫోన్ ఎక్కువ చూడడం వలన నీ ఆరోగ్యానికి, జీవిత లక్ష్యాలకు జరిగే నష్టాలు గురించి మేము ఆలోచిస్తున్నాము. ఇది నియంత్రించుకోవడం ఎలా అన్నదాన్ని గురించి మనం ఉమ్మడిగా చర్చించి చర్యలు తీసుకోవాలి. అలాగే నీ స్వేచ్ఛ బాధ్యతాయుతంగా వాడుతున్నావా అన్నది కూడా మాకు ముఖ్యమన్నది నువ్వు గ్రహించాలి”.
భావాలను పంచుకోవడం లేదా నిందించుకోవడం:
నిందలు వేసే భాష వాడకండి: “నువ్వు ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో ఉంటావు, మాకు కనిపించవు!” నిందలు వెయ్యడం/ ఇతరులతో పోల్చడం/ బల నిరూపణకి దిగడం – నువ్వు కరెక్టా నేను కరెక్టా అన్నవి చేయకండి.
భావాలను పంచుకోండి: “ఫ్రెండ్స్‌తో సమయం గడపడం నీకు ఆనందం ఇస్తుంది అన్నది మాకు అర్థమయ్యింది. నీ ఆనందమే మాకు ముఖ్యము. అలాగే ఇంట్లో కూడా కొంత సమయం మాతో పంచుకోవడం వలన మాకు కూడా ఆనందంగా ఉంటుంది. దీని గురించి నీ అభిప్రాయం ఏంటి?” అని అడగండి ఇలా చెప్పడం వలన మీరు వాళ్లతో సమయం పంచుకోవడానికి ఇష్టపడుతున్నారన్నది వాళ్ళకర్థమవుతుంది. పిల్లల ప్రవర్తన వలన ఆవేశం, ఆందోళన, దుఃఖం వచ్చినప్పుడు మీ భావొద్వేగాలను నియంత్రించుకొని సంభాషణ కొనసాగించినప్పుడే పిల్లలు మిమ్మల్ని చూసి భావొద్వేగ నియంత్రణ నేర్చుకుంటారు.
“మేము” vs “నువ్వు”:
“నువ్వు”తో మొదలయ్యే వాక్యాలు: “నువ్వు రోజూ లేవలేవు, నీకు చెప్పి చెప్పి అలిసిపోతున్నాము, నువ్వు ఒక పెద్ద సమస్య మాకు ” వంటివి వాడకండి.
“మేము” అని మాట్లాడండి: “మేము నీకు ఎలాంటి సహాయం చేయగలము, మా సహాయం ఎంత వరకు కావాలి, ఒక గడువు నిర్ణయించుకొని చెప్తావా?”. సమస్య వచ్చినప్పుడు నువ్వు Vs నేను అన్న తత్త్వము కాకుండా మనమందరము Vs సమస్య అన్నది మన చర్యల ద్వారా పిల్లలకి ఆచరణలో చూపించాలి.
పోటీపడడం లేదా కలుపుకోవడం:
పిల్లల స్నేహితులతో మరియు వాళ్ళ తల్లితండ్రులతో పోటీపడకండి, పోల్చుకోకండి, జడ్జ్ చెయ్యకండి: “వాళ్లతో కలిస్తే చెడిపోతావు, నీ స్నేహితులు నీకు తల్లితండ్రులు కంటే ఎక్కువయ్యిపోయారా?” లాంటివి వాడకండి.
వాళ్ల నిర్ణయాలకు ప్రాముఖ్యతనివ్వండి: “నీ స్నేహితులతో ఉండటం నీకు ఇష్టం కదా? నీకు నచ్చినట్టే చెయ్యు. వాళ్ళ వలన నీకు సమస్య వస్తే మేమున్నామన్నది మర్చిపోకు. వెంటనే మాకు చెప్పు మనమందరము కలిసి సమస్య పరిష్కరించుకొందాము. అలాగే నీ స్నేహితుల్లో నీ ఏదుగదలను ప్రోత్సాహించేవారున్నారా అన్నది చూసుకో. కలిసి ఎదగడం అన్నదే మంచి స్నేహానికి చిహ్నం.
నీ స్నేహితుల్లో ఉన్న చెడ్డ వలన ప్రభావితం అవుతున్నావు వాళ్లలో ఉన్న మంచి నేర్చుకుంటున్నావా మరి? దీని మీద నీ అవగాహనా ఏంటి?” ఇలా చెప్పడం/ ప్రశ్నించడం వలన పిల్లల్లో తన స్నేహితులను తను ఎంచుకొనే నిర్ణయ శక్తిని పెంచుతాము. వాళ్ళు మంచి స్నేహితులను ఎంచుకోగలరన్న నమ్మకం మనకి వుందని మన చర్యల ద్వారా చెప్తున్నాము.
వాళ్ళ స్నేహితులని అనుమానించడం వలన వాళ్లకు స్నేహితులను ఎంచుకొనే శక్తి లేదని చెప్తున్నాము అలాగే పిల్లల మీద మనకు నమ్మకం లేదని చెప్తున్నాము. ఇలా చేయటం వలన పిల్లలు స్నేహితులన్న కుటుంబం ఎలా ఏర్పర్చుకుంటారు? అవును,స్నేహితులు కూడా కుటుంబమే, మీ పిల్లలు ఎంచుకున్న కుటుంబం. వాళ్ళని గౌరవించండి మరియు కలుపుకోండి.
గౌరవం లేదా అగౌరవం:
“ఇంట్లోంచి వెళ్ళిపోతా లేదా వెళ్ళిపో” లాంటి బెదిరింపులు, చుల్కన చేసే మాటలు, టోన్ / గొంతు అగౌరవాన్ని సూచిస్తాయి, అవి వాడకండి.
పిల్లల పట్ల గౌరవం చూపించినప్పుడే వాళ్ళు గౌరవం అన్న విలువ నేర్చుకుంటారు మరియు ఆచరిస్తారు. పిల్లలు బెదిరింపులు వాడ్తున్నారు అంటే అవి తల్లితండ్రుల నుంచి నేర్చుకున్నారని అర్థం. అలాగే మీ తప్పులు మీరు అంగీకరించినప్పుడే పిల్లలు వాళ్ళ తప్పులు అంగీకరించడం నేర్చుకుంటారు. తప్పులు చేయడం మానవ సహజం.
తప్పులొప్పుకోవటం వలనే బంధంలో పరస్పర గౌరవం, నమ్మకం నిలుస్తాయి, తద్వారా బంధం బలపడ్తుంది. ఒక నదిలో బ్రిడ్జి కట్టేటప్పుడు ఆ బ్రిడ్జి ఎక్కడికి తీసుకెళ్తుంది అన్నది ఎంత ముఖ్యమో ఆ నది యొక్క లోతు పాతులు అర్థంచేసుకోవడము అంతే ముఖ్యము. ప్రతీ ఘర్షణ మీ పిల్లల గురించి తెలుసుకోవటానికి అవకాశమన్నది మీ దృక్పథం చేసుకొంటే ప్రతీ ఘర్షణలో మీరు సరైన వంతెన వెయ్యడానికి ప్రయత్నం చేస్తారు తద్వారా పిల్లలతో మంచి అటాచ్మెంట్ నిర్మించుకోగల్గుతారు.
ది మైండ్ వాయిస్: రమగారు ఈ మాటలు మీ మైండ్ వాయిస్ అయ్యేంతవరకు మీ మనసులో చెప్పుకుంటూనే వుండండి: “పిల్లలు తల్లితండ్రులు చెప్పేవాటి కన్నా వాళ్ళు ఆచరించేవాటిని సులువుగా ఆచరిస్తారు.”
3.శిక్షణ – (కథ)

అదొక పెద్ద భవనసముదాయము. దానిలో చాలా ఆఫీసులు ఉన్నాయి.అక్కడికి ఆటోలో దిగాడు ఒక అరవై ఏళ్లు దాటిన పెద్దాయన.ఆయన తెల్లని జరీ పంచ కట్టుకొని దాని మీద తెల్లని లాల్చి వేసుకున్నాడు.అతడి భుజం మీద జరీ కండువా మెరుస్తోంది. సెల్లుఫోనులో అతడికి కావలసిన చిరునామా కోసం వెతుకుతూ నడుస్తున్నాడు. కాసేపటికి అతడికి కావాల్సిన చిరునామా దొరికింది.
“ఇదే!” అనుకుంటూ ఆ ఆఫీసు దగ్గరికి వచ్చాడు.
పెద్దాయనను చూసి వాచ్ మాన్ “ఎవరు కావాలి సార్?”అని అడిగాడు. ఆ పెద్దాయన తన పర్సులో నుండి ఒక విజిటింగ్ కార్డు తీసి వాచ్ మానుకు చూపించాడు. “ఇతడు లోపల ఉన్నాడా?ఇతడు నా దగ్గర చదువుకున్నాడు. నా పేరు విశ్వనాథరావు. వెళ్లి నేను వచ్చానని ఇతడికి చెప్తావా? “
పెద్దాయన కళ్ళల్లో కనిపిస్తున్న రాజసం ఒక చక్రవర్తి కంటే మించిపోయి ఉంది. వెంటనే ఫోన్లో రిసెప్షనిస్టుకు విషయం చెప్పాడు వాచ్ మాన్.
రిసెప్షనిస్ట్ అతడు చెప్పింది విన్నది. కాసేపయ్యాక రిసెప్షనిస్ట్ చెప్పింది విని వాచ్ మాన్ వినయంగా
“లోపలికి రండి సార్!”అంటూ విశ్వనాధరావును ఆఫీసు లోపలికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద హాలు.దానిలో ఖరీదైన సోఫాలు ఉన్నాయి.అక్కడ విశ్వనాథరావును కూర్చోమని చెప్పి వెళ్ళిపోయాడు వాచ్ మాన్.
ఇంతలో ఆ హాల్లోకి వచ్చాడు భాస్కర్. గబగబా విశ్వనాథరావు దగ్గరికి వచ్చి “మాస్టారూ! ఎలా ఉన్నారు?”అంటూ విశ్వనాధరావు చేతులు పట్టుకున్నాడు.
భాస్కరును చూసి చిన్నగా నవ్వాడు విశ్వనాథరావు. ” మీరు ఇక్కడికి రావటం ఎందుకు మాస్టారూ! ఒక్క ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేవాడిని కదా!”గబగబా మాట్లాడుతున్న భాస్కరును చూసి మళ్ళీ నవ్వాడు విశ్వనాథరావు.
“నువ్వేమీ మారలేదు భాస్కర్!అప్పటి లాగే ఉన్నావు!” ” ఎలా మారుతాను మాస్టారు! మీరు క్లాసులో చెప్పిన పాఠాలు ఇంకా గుర్తున్నాయి. ఈరోజు ఒక టీవీ ఛానల్ పెట్టుకుని సక్సెస్ అయ్యానంటే దానికి కారణం మీ దగ్గర చదువుకోవటమే!…. ” భాస్కర్ గొంతు గద్గదికమైంది.అతడికి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి.
భాస్కరుది విజయవాడ దగ్గర నందిగామ. అక్కడ స్కూలులో తెలుగు మాస్టారు విశ్వనాథరావు. ఆయన తన శిష్యులకు పాఠాలు అర్థమయ్యేటట్లు చెప్పేవారు.ఫస్ట్ క్లాస్ తెచ్చుకొనే స్టూడెంట్స్ మీద కంటే ఆయనకు వెనకబెంచి స్టూడెంట్ల మీద శ్రద్ధ ఎక్కువగా ఉండేది. వాళ్ళకు ఉచితంగా ట్యూషన్లు చెబుతూ,అల్లరి పిల్లల్ని దారిలోకి తెచ్చేవారు. అందుకనే ఆయనంటే పిల్లలకు చాలా గౌరవం. ఈరోజు మాస్టారు తన ఆఫీసుకు ఎందుకు వచ్చారో తెలియటం లేదు భాస్కరుకు.
ఇంతలో ట్రేలో కాఫీలు, బిస్కెట్లు పట్టుకొని భాస్కరు అసిస్టెంట్ బృంద వచ్చింది. ” తీసుకోండి మాస్టారూ!” అంటూ మాస్టారుకు కాఫీ కప్పు అందించాడు భాస్కర్. ” విషయానికి వస్తాను భాస్కర్! నేను ఈమధ్య రిటైర్ అయ్యాను ముప్ఫయ్యేళ్లుగా పాఠాలు చెప్పుకుంటూ బ్రతికాను.ఇప్పుడు ఖాళీగా ఉండడం కష్టంగా ఉంది.అందుకని…. ” ఆగాడు విశ్వనాథరావు.
” ట్యుటోరియల్ ఒకటి పెడదామా! లేకపోతే నాకు తెలిసిన కాలేజీలో చూస్తాను!చేరుదురుగానీ!”అని ‘మాస్టారి ఉద్యోగం కోసం ఎవరిని కనుక్కోవాలా!’అని ఆలోచిస్తున్నాడు భాస్కర్. “కాదు భాస్కర్!నేనే ఉద్యోగం వెతుక్కున్నాను!… ఆ విషయమే నీతో మాట్లాడటానికి వచ్చాను!”అన్నాడు విశ్వనాథరావు.
‘మాస్టారుకు ఉద్యోగం దొరికిందన్న విషయం తనతో మాట్లాడటమేమిటి?’ ఆయన ఇంత దూరం రావటమేమిటి?’అంతుపట్టటం లేదు భాస్కరుకు.
“నీ ఆఫీసులోనే నాకు పని దొరికింది… అందుకే వచ్చాను!’ ఇప్పుడు ఇంకా అయోమయంగా ఉంది. “నా ఆఫీసులోనా? ఇది టివి ఛానల్ మాస్టారూ!”అన్నాడు భాస్కర్. విశ్వనాథరావు పెద్దగా నవ్వాడు. “తెలుసు భాస్కర్!నీకు తెలుసుగా!నేను స్కూలులో వెనుక బెంచీ స్టూడెంట్ల మీద ఎక్కువ శ్రద్ధ పెడతానని.. నీ ఆఫీసులో అలాంటి వాళ్ళు ఉన్నారని తెలుసుకున్నాను!.. వాళ్లకు పాఠాలు చెబుదామని!…”
నోరు తెరుచుకొని వింటున్నాడు భాస్కర్. “ఇంట్లో కూర్చుని టీవీలో చానల్స్ తిప్పుతూ ఉంటే నీ ఛానల్ కనిపించింది. నువ్వు నా శిష్యుడివి.నువ్వు ఇంత చిన్న వయసులోనే మంచి పేరు, డబ్బు సంపాదించటం ఒక గురువుగా నాకు సంతోషమే! కానీ నువ్వు నా శిక్షణని ఎలా మర్చిపోయావో నాకు అర్థం కావటం లేదు!… నీ ఛానలులో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్లు కానీ యాంకర్లు కానీ ఎలాంటి భాష మాట్లాడుతున్నారో విన్నావా? అది అసలు తెలుగేనా?.. నీ ఛానల్ అని కాదు రెండు రాష్ట్రాలలోఉండే తెలుగు టివి ఛానల్స్ అన్నీ ఇలాగే అఘోరిస్తున్నాయి.
వీటిల్లో పనిచేసే వాళ్ళల్లో ఒక్కరికి కూడా సరైన ఉచ్చారణ రాదు. ఎక్కడ వత్తి పలకాలో తెలియదు.’ళ’కారం పూర్తిగా ఎగిరిపోయింది. పెళ్లిని పెల్లిగా, కళ్ళని కల్లగా ఘోరంగా మాట్లాడుతుంటే నా లాంటి వాళ్లకు మండిపోతోంది… మహాప్రాణాలు అనేవి ఎలా పలకాలో తెలియదు. వాక్య నిర్మాణం అస్సలు తెలియదు. కర్త కర్మ క్రియలు ఉపయోగించటం తెలియదు.. ఈ అపభ్రంశపు భాషను వినలేక నీ సిబ్బందికి పాఠాలు చెబుదామని ఇలా వచ్చాను!అదీ నువ్వు నా శిష్యుడివి కాబట్టి… ఇంకో ఛానల్ అయితే నా ఘోషను ఒక వ్యాసంగా వ్రాసి పంపేవాడిని…. వాళ్ళు పట్టించుకొనే వాళ్ళు కారు…”ఆగాడు విశ్వనాథరావు.
విషయం అర్ధం అయింది భాస్కరుకు. “మాస్టారూ!”అంటూ మళ్ళీ విశ్వనాథరావు చేతులు పట్టుకొన్నాడు భాస్కర్. అతడికి సిగ్గుగా ఉంది. “రిటైర్ అయ్యాక నేను, మా ఆవిడ మా అబ్బాయి దగ్గరికి వచ్చి ఉంటున్నాము. కె. పి. హెచ్. బి. కాలనీలో ఇల్లు. నీ సిబ్బందికి తెలుగు నేర్పించటానికి వచ్చాను!నీ కిష్టమేనా?”
విశ్వనాథరావు గద్దించాడు.
ఆయన ముందు చిన్నపిల్లాడిలాగా తలవంచుకొని “తప్పకుండా మాస్టారూ!రోజూ మీ ఇంటికే మా సిబ్బందిని పంపిస్తాను! మీరు ఏ సమయానికి ఖాళీగా వుంటారో ఆ సమయానికే పంపిస్తాను!”అన్నాడు భాస్కర్ వేడికోలుగా. “మా ఇల్లు చిన్నది. మా కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా ఉంటుంది. నేనే ఇక్కడికి వచ్చి నీ సిబ్బందికి పాఠాలు చెబుతాను!”
“అలాగే మాస్టారూ!ప్రతిరోజూ నేను కారు పంపిస్తాను!”అంటూ వినయంగా విశ్వనాథరావు మాస్టారి పాదాలు అంటి నమస్కారం చేశాడు భాస్కర్.
అవినాష్ ఛానల్.
ఆ ఛానల్ సి. ఇ. ఒ. అవినాష్ తన ఆఫీసులో చికాగ్గా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతడి అసిస్టెంట్ వికాస్ భయం భయంగా లోపలికి అడుగుపెట్టాడు.
“ఈ మధ్య ఆ భాస్కర్ ఛానల్ రేటింగ్సులో దూసుకొని పోతోంది.కారణం ఏమిటో తెలుసుకో!ఇలాగే ఉంటే మన ఛానలును నడపటం కష్టం!”
అసిస్టెంట్ మౌనంగా నిలబడ్డాడు. అసహనంగా టేబుల్ మీద కొట్టాడు అవినాష్. “కనుక్కో!కూపీ లాగు!అసలు ఆ భాస్కర్ ఛానలును జనాలంతా వదలకుండా ఎందుకు చూస్తున్నారో తెలుసుకో!నిఘా పెట్టి విషయం తెలుసుకో! కావాలంటే అక్కడ పని చేసే వాళ్ళను కొనెయ్యి! వెళ్ళు!”అంటూ అరిచాడు అవినాష్.
అసిస్టెంట్ మెల్లగా వెళ్లిపోయాడు. వారం రోజులకల్లా అవినాష్ ఛానల్ వాళ్లకు విషయం తెలిసిపోయింది. ఆ ఆదివారం పొద్దున్నే పళ్లబుట్ట ఒకటి పట్టుకొని విశ్వనాథరావు మాస్టారి ఇల్లు వెతుక్కుంటూ బయలు దేరాడు అవినాష్.
(సమాప్తం)
4.కబుర్లు – శీర్షిక

అహంకారం వద్దు!
ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్, చివరకు నిస్సహాయంగా చనిపోయాడు. జాత్యహంకారానికి మారుపేరుగా నిలిచి, లక్షల మందిని ఊచకోత కోయించి, రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ దిక్కులేని పరిస్థితుల్లో – ఆత్మహత్య చేసుకున్నాడు. కాలమహిమ ఎలా ఉంటుందంటే, కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది.
మహానటుడు, ఆంధ్ర ప్రజలు గర్వించే ఎన్టీఆర్ మీద, వైస్రాయ్ సాక్షిగా చెప్పులు పడ్డాయి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎంత దారుణ పరిస్థితిలో పడ్డారో చూసాం. పిల్లలు పట్టించుకోలేదు. ఆస్తులు కలసి రాలేదు.
2009 ఎలక్షన్ ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవి మీద కోడిగుడ్లతో దాడి చేశారు. ఆ తరవాత రాజకీలయాల నుంచి నిష్క్రమణ. మహామేధావి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 420 కోర్టు కేసుల్లో బోనులో నిలబడవలసి వచ్చింది. చివరికి శవానికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగలేదు.
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, అంత్యక్రియలు చేయడానికి కనీసం శవం కూడా దొరకలేదు. మాజీ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి – 16 నెలలు జైలులో ఉన్నారు. 1978 లో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని, కమ్టెంట్ ఆఫ్ హౌస్ కింద సాక్షాత్తు మన పార్లమెంటే జైలుకు పంపింది.
తమిళ ప్రజలతో ‘అమ్మ’ అని పిలిపించుకున్న తిరుగులేని ఉక్కుమహిళ, మాజీ ముఖ్యమంత్రి జయలలితను – అసెంబ్లీ సాక్షిగా చీర లాగి వివస్త్రను చేశారు. టాన్సికేస్ లో కోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి ఏ స్థితిలో చనిపోయిందో చూసాం.
ఆంధ్ర బిల్ గేట్స్ గా పేరుపొందిన సత్యం రామలింగరాజు, నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. గొప్ప విజన్ ఉన్న నాయకుడు గా చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం – గుమ్మం బయట చేతులు కట్టుకుని వేచిచూసిన కేసీఆర్, తరువాతి కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
అలాగే NDA అధికారంలో ఉన్నప్పుడు, NDA కన్వీనర్ చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసివిఫలమైన నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యాడు.నరేంద్ర మోడీ, కెసిఆర్ లు 15 సంవత్సరాల తర్వాత PM, CM అవడం.. చంద్రబాబుకి 2019 ఎలక్షన్స్ లో చరమగీతం పాడడం కాలమహిమ కాక మరి ఏమిటి! అదే చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా భోరున ఏడ్చిన సంఘటన చూసాం.
ఇలా చెప్పుకుంటూ పోతే- చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. అందువల్ల ‘నేనే’అన్న అహంకారంతో విర్రవీగవలసిన అవసరం లేదు. నేనే గొప్ప, నా వల్లనే అంతా జరుగుతుంది, నా సంఘమే ఉన్నతమైనది, నా పార్టీకే ప్రజాదరణ, మా నాయకుడేనెంబర్ వన్,గట్రాగట్రా అంటూ అహంకరించటం అవివేకుల లక్షణం. ఈ నేనే మనం అనే ఈ భూమికి ‘అరువు’గా వచ్చాం. కొన్నాళ్లకు ఈ భూమికే ‘ఎరువు’గా మారిపోతాం. కాబట్టి నిత్యజీవితంలో అణుకువ అలవరుచుకుంటే పరువు నిలబెట్టుకుంటాం.
5.సన్నిహితం… శీర్షిక

అవహేళన వద్దు
నేను జాబ్ లో జాయిన్ అయిన కొత్తలో…ఊరి నుండి హైదరాబాద్ ఎవరు వచ్చినా మా ఇంటికి వచ్చేవారు. నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న నన్ను ఊరివాళ్ళు గొప్పగా చూస్తున్నారు అని అనుకునే వాడిని.
ఇలాగే ఒకసారి నాకు తమ్ముడు వరస అయ్యే కుర్రాడు మా ఇంటికి వచ్చాడు. ఏమి చేస్తున్నావురా ఇప్పుడు అని వాడిని దర్పంగా అడిగాను. అన్నా ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొడదామని ఇక్కడే కోచింగ్ తీసుకుందామని అనుకుంటున్నా అని చెప్పాడు. వాడు మా ఇంట్లో ఉండటానికి ప్లేన్ చేస్తున్నాడని… ఎందుకురా అవన్నీ హాయిగా ఊళ్ళో ఉండి దగ్గర్లో ఏదైనా జాబ్ చూసుకో..నీలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఎందుకురా అని చెప్పాను. వాడు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత ఊరికి వెళ్ళిపోయాడు.
కట్ చేస్తే..కొన్ని సంవత్సరాల తర్వాత వాడు.. ఒక మంచి జాబ్ కి సెలెక్ట్ అయ్యాడని తెలిసి ఆశ్చర్యపోయాను. అలాగే ఇంకోసారి… హైదరాబాద్ లోనే నా భార్య తరపు బంధువులు మా ఇంటికొచ్చారు. మాట ముచ్చట అయ్యాక పాతికవేలు కావాలని అడిగారు. ఎందుకు అని అన్నాను.
హైదరాబాద్ శివార్లలో స్థలం కొనుక్కుంటాం అని చెప్పారు. అక్కడికి పారిశ్రామిక వాడ దగ్గర ఉండటంతో అందులో ఏదో ఒక పని చూసుకుంటాం అని చెప్పారు. పోనీలే అని డబ్బులు ఇచ్చాను. స్థలం కొనుక్కుని అందులోనే చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఇండస్ట్రీలో డైలీ లేబర్ గా పని చేయసాగారు.
వారి అబ్బాయిని అక్కడే ఒక చిన్న స్కూల్ లో జాయిన్ చేశారు. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఏదో ఒక సహాయం పొందుతూ ఉండేవారు. వాళ్ళతో వీలున్నప్పుడల్లా చులకనగా మాట్లాడేవాడిని. కాలక్రమంలో …ఇరవయ్యేళ్ల తర్వాత వాళ్ళ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది.
వాళ్ళ స్థాయి పెరిగింది. ఇప్పుడు వారి అబ్బాయి అమెరికా కూడా వెళ్ళాడు. దీంతో వాళ్ళకి అహం పెరిగి మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. అది వేరే విషయం కానీ వారి అబ్బాయి పేదరికాన్ని జయించి వృద్ధిలోకి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే ఎవరినీ తక్కువగా చూస్తూ అవహేళన చేయకూడదు.
ఎవరిలో ఏ శక్తి దాగి ఉందో మనకు తెలీదు కదా. అలాగే ఒక స్థాయి రాగానే చేసిన సహాయం మరచి కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కూడా మనం పట్టించుకోనవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన విలువ మనకు ఉంటుంది ఎప్పుడూ !!!!
6.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

తూర్పుకు తిరిగి దండం పెట్టు
ఈ సామెతలో దైవ సంబంధమైన అంశాలున్నాయి. ఆధ్యాత్మిక పరిమళాలున్నాయి. కానీ దీనిని వ్యంగ్యంగా, వ్యతిరేకంగా మార్చి వాడుతున్నారు. ఎవరికైనా డబ్బో, ఇంకోటో ఇచ్చామనుకోండి, అది తర్వాత తిరిగి ఇస్తారనే ఆశతో! కాని వాళ్లు తిరిగి ఇవ్వరు సరికదా, ఖచ్చితంగా ఎగ్గొడతారు అని తెలిసిపోతుంది. అప్పుడు మన శ్రేయోభిలాషులు మనకు ఇలా సలహా ఇస్తారు –‘తూర్పుకు తిరిగి దండం పెట్టు!’. అంటే. ఇక ఆ ఆశలు వదిలేసుకో, అని.
ఇలాంటిదే మరో సామెత ఉంది – “గోడకేసిన సున్నం”. ఒకసారి గోడకు సున్నం వేస్తే, దాన్ని తిరిగి తీసుకోలేము. ఇప్పుడంటే రకరకాల పెయింట్స్ వచ్చాయి గాని, అప్పుడంతా సున్నాలే కదా! పండగలు, పబ్బాలు, శుభకార్యాలు వస్తే, ఇంటికి సున్నాలు వేయించడంతో ఆ హడావిడి ప్రారంభమయేది. సున్నాలైనా, పెయింట్స్ అయినా, ఒకసారి గోడకు వేస్తే, అంతే సంగతులు! దీనికి అదనంగా మరో మాట చేరుస్తుంటారు.
“సానికి పెట్టిన సొమ్ము, గోడకు వేసిన సున్నం తిరిగిరావు!”. ఇదే థీమ్‌తో చింతామణి నాటకం వ్రాశారు, శ్రీ కాళ్ళకూరి నారాయణరావుగారు. పద్యనాటకాల్లో అది సూపర్ హిట్! వేశ్యావృత్తి సమాజానికి చేసే కీడును ఆ నాటకంలో ఆవిష్కరించారు కాళ్లకూరి. దీనినే 1956లో భరణి పిక్చర్స్ వారు సినిమాగా రూపొందించారు. చింతామణి పాత్రను భానుమతిగారు వేయడం అప్పట్లో సాహసంగా చెప్పుకునేవారు. బిల్వమంగళుడిగా ఎన్.టి.ఆర్, భవానీశంకరునిగా యస్.వి.రంగారావు, సుబ్బిశెట్టిగా రేలంగి నటించారు. కాని నాటకానికి వచ్చినంత ప్రాచుర్యం సినిమాకు రాలేదు.
సరే, అసలు సామెత కొద్దాం. ఏదైనా మనకు తిరిగి రాదని తెలిసినప్పుడు, తూర్పుకే తిరిగి దండం పెట్టడం ఎందుకు? పడమటికి తిరిగి ఎందుకు పెట్టకూడదు? లేదా ఉత్తర దక్షిణాల కెందుకు తిరిగి దండం పెట్టకూడదు? అంటే, తూర్పు, సూర్యుడు ఉదయించే దిక్కు. ఆయన నుంచి వచ్చే శక్తి కోసం అన్నమాట. అది సానుకూల శక్తులకు, జ్ఞానానికి ప్రతీక. ‘ప్రాంగ్ముఖం’అంటే తూర్పుముఖం. ఏదైనా ముఖ్యమైన అగ్రిమెంట్ సైన్ చేసేటపుడు, ఉద్యోగంలో చేరేటపుడు, తూర్పుకు తిరిగి సంతకం పెడతారు.
ఇంత స్పిరిచ్యుయల్ యాంగిల్ ఉన్నవిషయాన్ని, వ్యంగ్యంగా‘ఇక పోయినట్లే’, ‘నీళ్లు వదిలెయ్యి’ – అనే అర్థంలో వాడటం మనవాళ్లకే చెల్లింది. దైవికమైన పదబంధాలను లౌకికార్థంలో వెటకారంగా వాడడం ఎవరు కనిపెట్టారో గాని వారిని… ఎందుకులెండి! ‘తీర్థం పుచ్చుకున్నాడు’అంటే ‘పార్టీలో చేరాడు’అని; ‘శఠగోపం పెట్టాడు’అంటే మోసం చేశాడని; ‘కైంకర్యం చేశాడు’అంటే ‘అవినీతికి పాల్పడ్డాడు’అని; ‘హారతి కర్పూరమైపోయింది’అంటే ‘నశించిపోయింది’అని.. దేవుని పూజకు సంబంధించిన ఈ పదబంధాలను ఇలా వాడటం, నాకు నచ్చదు. అది మన సంస్కృతిని అవమానించినట్లు అవుతుంది కదా!
ఇక సినిమావాళ్ళకు పనికిరానిది ఏదీ లేదు. 1980లో ‘దీపారాధన’అనే సినిమా వచ్చింది. దానికి దర్శకుడు దాసరి నారాయణరావుగారు. దానిలో “తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండీ మావారు” అనే పాట ఉంది. దానికి సంగీత దర్శకుడు చక్రవర్తి. బాలు, సుశీలగార్లు దాన్నిపాడారు. అది హాస్యభరితంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య తగాదా! దానికీ తూర్పుకు తిరిగి దండంపెట్టడానికీ సంబంధం లేదు. పాట రాసిన వారు కూడా దాసరే. అది పల్లవిఎందుకయిందో!
మనం పక్కింటి వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో.. కూరో, పచ్చడో చిన్న గిన్నెల్లోనో, డబ్బాల్లోనో పెట్టి ఇచ్చామనుకోండి వాటిని తిని బాగుందంటారు. కానీ ఆ డబ్బాలు తిరిగివ్వరు. మనం తూర్పుకు తిరిగి దండం పెట్టడమే! ఇక అప్పుల అప్పారావుల సంగతి చెప్పేదేముంది? విజయ్ మాల్యా లాంటి మహనీయులు 9 వేల కోట్ల రూపాయల ఋణం బ్యాంకు నుండి తీసుకుని, 22 వేల రూపాయల కోట్ల రూపాయల వడ్డీతో సహా దాన్ని తిరిగి చెల్లించకుండా ఇంగ్లాండుకు పారిపోయాడు! యు.కె.లో రిలాక్స్ అవుతున్నాడు.
ఆయనకు లోనిచ్చిన ప్రభుత్వరంగ బ్యాంకులు ‘తూర్పుకు తిరిగి దండం పెట్టడం’తప్ప ఏమీ చేయలేకపోయాయి. అదే మనలాంటివారు లోన్ తీసుకుని, ఇ.ఎమ్.ఐ. కట్టలేదనుకోండి! రికవరీ ఏజెంట్లు మన ఇంటి మీదికొచ్చేస్తారు! పాపం, పత్రాలూ, సాక్ష్యాలూ లేకపోయినా, నానా అవస్థలూ పడి లోన్ మొత్తం కట్టేసిన హరిశ్చంద్రుడు పిచ్చిమారాజు!
మరో సామెతతో వచ్చే వారం కలుద్దాం!
7.వినరో భాగ్యము – శీర్షిక

శ్రీవారికి కుండపెంకు లో నైవేద్యం
కలియుగ ప్రత్యక్ష దైవం అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిదినం పెట్టె నైవేద్యం మట్టి కుండ పెంకులోనే సమర్పిస్తారు . సంబంధిత ఐతిహ్యం ప్రకారం కుమ్మరి వృత్తి చేసుకునే భీముడు అనే భక్తుడు స్వామి వారిపై అచంచల భక్తివిశ్వాసాలతో జీవించేవాడు. తన ఇంటిలోనే స్వామి ప్రతిమను ఏర్పాటు చేసుకుని మట్టితో చేసిన పూలతో పూజ చేస్తూ తన వృత్తిని చేసుకుంటూ స్వామి నామస్మరణ చేస్తూ ఉండేవాడు.
తిరుమల దేవాలయాన్ని నిర్మించిన తొండమాన్ చక్రవర్తి ప్రతి రోజూ స్వామిని బంగారు పూలతో అర్చించేవాడు. ఒక రోజు బంగారు పూల మధ్య మట్టి పూలు కనిపించడంతో స్వామిని అడుగుతాడు. స్వామి కుమ్మరి భీముడు గురించి చెప్పడంతో చక్రవర్తి అతడి ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో తన ఇంటికి వచ్చిన స్వామికి కుమ్మరి భీముడు తానూ తినే రాగిముద్దలను పగలకొట్టిన కొత్త కుండ పెంకులో సమర్పించడం కనిపిస్తుంది.
కుమ్మరి భక్తుడి భక్తికి, అతనిపై స్వామి కురిపించిన కరుణకు ప్రతీకగా తిరుమల క్షేత్రంలో స్వామికి సమర్పించే నైవేద్యాన్ని కుండ పెంకులోనే సమర్పించే విధానాన్ని తొండమాన్ చక్రవర్తి అమలులో తెచ్చారు. ఇప్పటికీ తిరుమల ఆలయంలో కులశేఖర పడి దాటి స్వామికి సమర్పించే నైవేద్యం కుండ పెంకు (ఓడు) లోనే సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. పాతికేళ్ల క్రితం వరకు స్వామి వారికి కళ్యాణం వంటి ఆర్జిత సేవలు చేయించుకునే భక్తులకు కూడా కుండ పెంకుల్లోనే అన్న ప్రసాదాలు ఇచ్చే వారు. దాన్ని ఓడు మర్యాద అని పిలిచేవారు . అందుకే స్వామిని తోమని పళ్లాల వాడు అని అన్నమయ్య కీర్తించారు.
మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

Magazine, Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine
Magazine, Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine Magazine
