Suicide | శంషాబాద్ లో విషాదం..

Suicide | శంషాబాద్ లో విషాదం..

Suicide, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆ దంపతులు ఎప్పటి నుంచో పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఆమె ఒకరి కాదు ఇద్దరకి (కవలలు) జన్మనివ్వ నుందని తెలిసి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే.. మన ఒకటి అనుకుంటే.. విధి మరోటి అనుకుంటుంది అంటారు. ఇక్కడ అలాగే జరిగింది. ఆ కవలలు కళ్లు తెరవకుండానే కన్నుమూశారు. ఆతర్వాత చికిత్స పొందుతూ భార్య మరణించింది. వరుస విషాదాలను తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాలు ఏంటంటే.. కడప (Kadapa) జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ముత్యాల విజయ్‌ (40), శ్రావ్య దంపతులు. వీరు శంషాబాద్ (Shamshabad) సమీపంలోని సామ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. ముత్యాల విజయ్‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. ఈ దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైనా పిల్లలు లేరు. ఆఖరికి ఐవీఎఫ్ ద్వారా సంతానం కోసం ప్రయత్నించారు. భార్య గర్భవతి అయ్యింది.. ఒకరు కాదు ఇద్దరు పిల్లలు పుట్టనున్నారని తెలిసి ఎంతో ఆశతో ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఎనిమిది నెలల గర్భిణి అయిన శ్రావ్యకు ఆదివారం రాత్రి కడుపునొప్పి రావడంతో అత్తాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి విజయ్‌ తీసుకెళ్లారట. అక్కడి వైద్యులు కడుపులో ఉన్న కవలలు చనిపోయినట్లు నిర్ధారించారు.

ఈ విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైన విజయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడట. ఆ తర్వాత అతడి తల్లి శ్రావ్యకు మెరుగైన చికిత్స కోసం గుడిమల్కాపూర్‌లోని మైత్రి ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది. కవలలు చనిపోయారన్న వార్తతో కుంగిపోయిన విజయ్.. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో శంషాబాద్ లోని ఇంటికి చేరుకుని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. ఈ విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply