WGL| విద్యార్థులు సామాజిక బాధ్య‌త తీసుకోవాలి : జిష్ణుదేవ్ వ‌ర్మ‌

  • అట్టహాసంగా స్నాతకోత్సవం
  • 564 బంగారు ప‌త‌కాలు, 387 పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం


కేయూ క్యాంపస్ (వ‌రంగ‌ల్‌), ఆంధ్రప్రభ : విద్యార్థులు డిగ్రీలతో పాటు దేశాభివృద్ధికి, సమాజ అభివృద్ధికి బాధ్యతలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్, కాకతీయ విశ్వవిద్యాలయ కులపతి జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma) అన్నారు. సోమవారం విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాప్ రెడ్డి (Vice Chancellor, Acharya, Karnati Pratap Reddy) అధ్యక్షతన 23వ స్నాతకోత్సవం జరిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ… కాకతీయ విశ్వవిద్యాలయానికి ఘన చరిత్ర ఉందన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పడి 50ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో విద్యార్థులు డిగ్రీలు తీసుకోవడం గొప్ప అవకాశంగా భావించాలన్నారు. 672 ఎకరాలలో 23 విభాగాలు, ఏడు కళాశాలలు, 500 అనుబంధ కళాశాలలతో ఉత్తర తెలంగాణ (North Telangana) లో మంచి పేరున్న విశ్వవిద్యాలయం అన్నారు. ఇక్క‌డ విద్య అభ్య‌సించిన వారు స‌మాజాభివృద్ధికి కృషి చేయాల‌ని సూచించారు.

564 బంగారు పత‌కాలు…
యూనివ‌ర్సిటీలో విద్యార్థుల‌కు 564 బంగారు ప‌త‌కాల‌ను (Gold medals) గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ప్ర‌దానం చేశారు. అలాగే 387 పీహెచ్‌డీ పట్టాలను అంద‌జేశారు. కార్యక్రమానికి మ‌రో అతిథిగా శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో కేయూ పాలకమండలి సభ్యులు, పూర్వ ఉపకులపతులు, వివిధ విభాగల డీన్లు, పరీక్షల విభాగం అధికారులు, పాలు విభాగాల కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఘన స్వాగతం పలికిన మేయర్, ఎమ్మెల్యే, కలెక్టర్లు…
హనుమకొండ: వరంగల్ ఎన్ఐటి కి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, టీజీఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కుడా ఛైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలను అందించి ఘనంగా స్వాగతం పలికారు.

ఇవాళ కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల చాన్స్ లర్ జిష్ణు దేవ్ వర్మ వరంగల్ ఎన్ఐటీకి చేరుకోగా ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు స్వాగతం పలికిన వారిలో వరంగల్ ఎన్ఐటి డైరెక్టర్ బిద్యాధర్ సూబుది, వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా, రెడ్ క్రాస్ రాష్ట్ర ఈసీ మెంబర్ ఈవీ. శ్రీనివాస్ రావు, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, కాజీపేట తహసీల్దార్ భావు సింగ్, ఇతర అధికారులు ఉన్నారు.

Leave a Reply