చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా (Manchryala District) చెన్నూరు నియోజకవర్గం కోటపెల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల (Tribal Girls’ Ashram School) విద్యార్థినులు రోడ్డెక్కారు. పాఠశాల హెచ్ఎం ప్రవర్తనకు నిరసనగా చెన్నూరు-కోటపెల్లి రహదారిలో బాలికలు బైఠాయించారు. ఆందోళనలో పాల్గొన్న బాలికలతో స్థానిక ఎస్సై రాజేందర్, డీటీడీఓ జనార్దన్ మాట్లాడి శాంతింపజేశారు. ఉపాధ్యాయుడిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఐటీడీఏ పీఓ జోక్యం చేసుకోవాలి
కోటపెల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు రెండు రోజులుగా ఆందోళనబాట పట్టారు. బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్నతీరుపై ఉన్నత అధికారులు పర్యవేక్షించక పోవడం పట్ల స్థానికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ పీఓ జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థినులు స్పష్టం చేశారు.